పసిడి బ్యాంకు కావాలి

దేశంలో పసిడి బ్యాంకు నెలకొల్పాల్సిన అవసరం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. ప్రజల వద్ద ఉన్న బంగారం నిల్వలను నగదీకరణ....

Published : 02 Dec 2021 01:59 IST

ప్రజల దగ్గరున్న నిల్వలను నగదీకరించాలి

అపుడే ఆర్థిక వ్యవస్థ మెరుగు

ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ గాంధీ

ముంబయి: దేశంలో పసిడి బ్యాంకు నెలకొల్పాల్సిన అవసరం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. ప్రజల వద్ద ఉన్న బంగారం నిల్వలను నగదీకరణ చేయడానికి అది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ‘మేలిమి బంగారం, ఆభరణాల రూపంలో బంగారాన్ని దాచుకోవడం భారతీయులకు అలవాటు. ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగ్గా రాణించడం కోసం, ఈ పసిడిని నగదీకరించాలి. ఇందుకు అనుగుణంగా అడుగులు వేయాల’ని బుధవారం జరిగిన ఒక వర్చువల్‌ కార్యక్రమంలో గాంధీ పిలుపునిచ్చారు. భారత్‌లోని వ్యక్తులు, మత సంస్థల దగ్గర 23,000-24,000 టన్నుల పసిడి నిల్వలున్నాయని ఒక అంచనా. అయితే ప్రజల ఆలోచనలను మార్చడం అంత సులువు కాదని ఆయన అన్నారు. ‘భారత్‌ వంటి వర్థమాన దేశం అధిక వృద్ధిని సాధించాలంటే భారీ మూలధనం అవసరం. అధిక వృద్ధితోనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని గుర్తు పెట్టుకోవాల’ని పేర్కొన్నారు. పసిడి బ్యాంకును పెట్టాలంటే బ్యాంకు లైసెన్సింగ్‌ విధానాలను, కొన్ని నియంత్రణలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంద’న్నారు.

కొన్నేళ్లుగా మార్పు..
గత కొన్నేళ్లుగా దేశంలో పసిడి విషయంలో విధానాల్లో మార్పు వచ్చింది. ప్రజలు పసిడి లోహంతో పాటు పసిడి బాండ్లు, ఈటీఎఫ్‌లపైనా పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు. పౌరుల వద్ద ఉన్న పసిడిని నగదీకరించడానికి అడుగులు పడుతున్నాయి. బంగారం నాణ్యత నియంత్రణకు లైసెన్స్‌డ్‌ రిఫైనరీలు, హాల్‌మార్కింగ్‌ వంటి మౌలిక వసతులనూ ఏర్పాటు చేస్తున్నారు.

ఇలా చేయొచ్చు..
‘ప్రజలు ఆభరణాలకు ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నారో కనుక్కోవాలి. పసిడి నగదీకరణకు వినూత్న ఆలోచనలు అవసరం. పసిడి ఆభరణాల డిపాజిట్‌ పథకాలను తీసుకురావడంతో పాటు దీర్ఘకాలం లేదా పదేళ్ల తర్వాత వారిచ్చిన రకం ఆభరణాలనే తిరిగిస్తామనే హామీ ఇవ్వడం ద్వారా పసిడిని నగదీకరించవచ్చు. బంగారంపై ప్రజలు ఖర్చు చేసే ప్రతి రూపాయిని, పసిడి నగదీకరణ రూపంలో మూలధనంగా మార్చాల’ని గాంధీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని