Published : 02 Dec 2021 06:16 IST

నష్టాల నుంచి కోలుకున్నాయ్‌

మెరిసిన రిలయన్స్‌, బ్యాంకింగ్‌ షేర్లు

సమీక్ష

ఇటీవల నష్టపోయిన బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు మళ్లీ కోలుకున్నాయి. సెన్సెక్స్‌ 620 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 17100 ఎగువకు చేరింది. కొవిడ్‌ నూతన వేరియెంట్‌ ఒమిక్రాన్‌పై భయాలు ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్లలో రికవరీ రావడం కలిసొచ్చింది. రూపాయి బలపడటం, సానుకూల జీడీపీ గణాంకాలు, నవంబరు జీఎస్‌టీ వసూళ్లు ఇందుకు తోడయ్యాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్యాంకింగ్‌ షేర్లు మద్దతుగా నిలిచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 22 పైసలు బలపడి 74.91 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు అదే ధోరణిలో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 57,365.85 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే జోరు కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 57,846.45 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 619.92 పాయింట్ల లాభంతో 57,684.79 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 183.70 పాయింట్లు పెరిగి 17,166.90 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,064.25- 17,213.05 పాయింట్ల మధ్య కదలాడింది.

* నవంబరులో విక్రయాలు 25 శాతం పెరగడంతో టాటా మోటార్స్‌ షేరు మెరిసింది. ఇంట్రాడేలో 4.29% లాభంతో రూ.478.50 గరిష్ఠాన్ని తాకి, చివరకు 3.61% పెరిగి రూ.475.35 వద్ద ముగిసింది.
* సెన్సెక్స్‌ 30 షేర్లలో 22 రాణించాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 5.73%, యాక్సిస్‌ బ్యాంక్‌ 3.46%, ఎస్‌బీఐ       3.19%, టెక్‌ మహీంద్రా 3.07%, మారుతీ 2.66%, రిలయన్స్‌ 2.50%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.95%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.41%, టీసీఎస్‌ 1.31% లాభపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ 1.58%, అల్ట్రాటెక్‌ 1.48%, సన్‌ఫార్మా 1.14%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.06%, టైటన్‌ 0.65% చొప్పున డీలాపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో లోహ, ఇంధన, బ్యాంకింగ్‌, వాహన, ఫైనాన్స్‌ 2.40% వరకు పెరిగాయి. ఆరోగ్య సంరక్షణ, మన్నికైన వినిమయ వస్తువులు, టెలికాం షేర్లు మాత్రం పడ్డాయి. బీఎస్‌ఈలో 1827 షేర్లు లాభాల్లో ముగియగా, 1431 స్క్రిప్‌లు నష్టపోయాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts