నవంబరులోనూ గప్‌చిప్‌

సెమీకండక్టర్ల(చిప్‌సెట్‌) కొరత కొనసాగుతుండడంతో నవంబరులోనూ వాహన తయారీ, టోకు అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ ఇండియా వంటి దిగ్గజ...

Published : 02 Dec 2021 02:18 IST

సెమీకండక్టర్ల కొరతతో తగ్గిన వాహన ఉత్పత్తి

మారుతీ, హ్యుందాయ్‌ అమ్మకాలపై ప్రభావం

రాణించిన మహీంద్రా, టాటా, టయోటా

దిల్లీ: సెమీకండక్టర్ల(చిప్‌సెట్‌) కొరత కొనసాగుతుండడంతో నవంబరులోనూ వాహన తయారీ, టోకు అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ ఇండియా వంటి దిగ్గజ వాహన కంపెనీల దేశీయ విక్రయాల్లో క్షీణత నమోదైంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌(టీకేఎమ్‌)లు మాత్రం 2020 నవంబరుతో పోలిస్తే గత నెలలో మెరుగైన అమ్మకాలు సాధించగలిగాయి.

మారుతీ ఉత్పత్తి 3%, అమ్మకాలు 18% తగ్గాయ్‌
ఈ ఏడాది నవంబరులో మారుతీ సుజుకీ దేశీయ అమ్మకాలు 18% తగ్గి 1,17,791కి పరిమితమయ్యాయి. ‘ఎలక్ట్రానిక్‌ విడిభాగాల కొరత ప్రభావం నవంబరులో వాహన తయారీపై కొంతే ఉంది. అయితే దేశీయ విపణిలో అధికంగా విక్రయమయ్యే వాహనాల ఉత్పత్తిపై ఎక్కువ ప్రభావం చూపింది. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి అన్ని చర్యలూ తీసుకున్న’ట్లు మారుతీ తెలిపింది. 2020 ఇదే నెల ఉత్పత్తి 1,50,221 నుంచి 3 శాతం తగ్గి 1,45,560 వాహనాలకు పరిమితమైందని కంపెనీ వెల్లడించింది.. చిన్న కార్ల (ఆల్టో, ఎస్‌-ప్రెసో) ఉత్పత్తి 24,336 నుంచి 19,810కి; కాంప్యాక్ట్‌ కార్ల(వ్యాగన్‌ ఆర్‌, సెలెరియో, ఇగ్నిస్‌, స్విఫ్ట్‌, బాలెనో, డిజైర్‌) తయారీ 85,118 నుంచి 74,283కు తగ్గగా; యుటిలిటీ వాహనాల(జిప్సీ, ఎర్టిగా, ఎస్‌-క్రాస్‌, బ్రెజా, ఎక్స్‌ఎల్‌ 6) ఉత్పత్తి మాత్రం 24,719 నుంచి 35,590కి పెరిగినట్లు వివరించింది. ఎగుమతులు మాత్రం 9004 నుంచి 21,393కు పెరిగాయి. ఫలితంగా మొత్తం అమ్మకాలు 9 శాతం తగ్గినట్టైంది.

సవాలు కొనసాగుతోంది..
హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా దేశీయ అమ్మకాలు  24% తగ్గి 37,001కి చేరాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా దేశీయ ప్రయాణికుల వాహన అమ్మకాలు 7 శాతం పెరిగి 19,458కి చేరాయి.  పరిశ్రమకు చిప్‌ల కొరత సవాలుగానే ఉందని మహీంద్రా ప్రతినిధి తెలిపారు. దేశీయ దిగ్గజమైన టాటా మోటార్స్‌ 38% వృద్ధితో 29,778 వాహనాలను విక్రయించగలిగింది. టయోటా కిర్లోస్కర్‌, స్కోడా, నిస్సాన్‌లు కూడా రాణించగా.. హోండా కార్స్‌, ఎమ్‌జీ మోటార్‌, అశోక్‌ లేలాండ్‌, ఎస్కార్ట్స్‌లు డీలా పడ్డాయి. ద్విచక్ర వాహనాల విషయానికొస్తే..హోండా,  హీరో, టీవీఎస్‌, బజాజ్‌ ఆటో, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వంటి కంపెనీలు సైతం అమ్మకాల్లో క్షీణతను నమోదు చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని