సంక్షిప్త వార్తలు

వెన్నెముక సమస్యలతో బాధపడేవారికి సహజసిద్ధ ఔషధం స్పైనోకార్ట్‌ ట్యాబ్లెట్లను ఆవిష్కరించినట్లు లీహెల్త్‌ డొమెయిన్‌ ప్రకటించింది. శక్తిమంత పోషకాలతో కూడిన బయొలాజికల్‌ యాక్టివ్‌ల కలయికతో దీనిని అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ‘కొలాజెన్‌, గుడ్డు పెంకు నుంచి తీసిన పొరల

Published : 03 Dec 2021 02:40 IST

వెన్నెముక సమస్యలకు లీ ఔషధం

హైదరాబాద్‌: వెన్నెముక సమస్యలతో బాధపడేవారికి సహజసిద్ధ ఔషధం స్పైనోకార్ట్‌ ట్యాబ్లెట్లను ఆవిష్కరించినట్లు లీహెల్త్‌ డొమెయిన్‌ ప్రకటించింది. శక్తిమంత పోషకాలతో కూడిన బయొలాజికల్‌ యాక్టివ్‌ల కలయికతో దీనిని అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ‘కొలాజెన్‌, గుడ్డు పెంకు నుంచి తీసిన పొరల వంటివి వెన్నెముక కీళ్లలో మృదులాస్థిని మెరుగు పరుస్తాయి. బోస్వెలియా సెరెటా ఎక్స్‌ట్రాక్ట్‌, ఎల్‌-లైసిడ్‌ హైడ్రోక్లోరైడ్‌, కుర్కుమిన్‌, విటమిన్‌-సి, డి; ఫ్యాటీ యాసిడ్స్‌ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి వెన్నెముక, ఇంటర్‌వెర్టెబ్రల్‌ డిస్క్‌పై యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేసి, వాపును తగ్గిస్తాయి. 3 వారాల్లో నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంద’ని లీహెల్త్‌ డైరెక్టర్‌ లీలారాణి తెలిపారు. ఔషధ దుకాణాలతో పాటు అమెజాన్‌లోనూ ఈ ఔషధం లభ్యమవుతుందన్నారు.


విపణిలోకి రాధా టీఎంటీ 550డీ ఎల్‌ఆర్‌ఎఫ్‌ స్టీల్‌ బార్లు

హైదరాబాద్‌ (బంజారాహిల్స్‌) న్యూస్‌టుడే: ఎత్తైన భవనాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో ఉపయోగించేందుకు అనువైన టీఎంటీ 550డీ ఎల్‌ఆర్‌ఎఫ్‌ ఉక్కు బార్లను హైదరాబాద్‌ సంస్థ రాధా స్మెల్టర్స్‌ మార్కెట్లోకి విడుదల చేయనుంది. 2025 నాటికి వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 0.4 మిలియన్‌ టన్నుల నుంచి 1 మిలియన్‌ టన్నులకు పెంచనుంది. ఇందుకోసం  రూ.75 -100 కోట్ల పెట్టుబడులను పెట్టాలని యోచిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్‌ సునీల్‌ సరాఫ్‌ తెలిపారు. సంస్థ టర్నోవర్‌ 2020-21లో రూ.530 కోట్లు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1000 కోట్లు, 2022-23లో రూ. 1500 కోట్లు సాధించాలన్నది లక్ష్యమన్నారు. మెదక్‌లోని ప్లాంట్‌ను విస్తరించడంతో పాటు కర్ణాటకలోనూ నెలకొల్పే ఆలోచన ఉందన్నారు. విపణిలో తమ సంస్థకు 3-4 శాతం వాటా ఉందన్నారు. ఈ నెల 6న సంస్థ ప్రచారకర్త, నటుడు దగ్గుబాటి రానా ఈ కొత్త ఉత్పత్తిని విపణిలోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.


బీడీఎల్‌, సైన్యం మధ్య రూ.471 కోట్ల ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: ఐజీఎల్‌ఏ 1ఎం క్షిపణుల నవీకరణ కోసం రక్షణ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌), భారత సైన్యం పరస్పర అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. తాజా ఒప్పందం విలువ రూ.471.41 కోట్లని బీడీఎల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. నవీకరణ అనంతరం క్షిపణుల జీవితకాలం మరో పదేళ్లు పెరగనుంది. దీంతో పాటూ గైడెడ్‌ క్షిపణులు, అనుబంధ పరికరాలు, నింగి, నేలపై నుంచి, నీటి లోపల ఉపయోగించే ఆయుధ వ్యవస్థలను సరఫరా చేయనుంది.


హోండా బ్యాటరీ షేరింగ్‌ అనుబంధ సంస్థ

దిల్లీ: భారత్‌లో రూ.135 కోట్ల పెట్టుబడితో బ్యాటరీ షేరింగ్‌ సేవల అనుబంధ సంస్థను నెలకొల్పనున్నట్లు జపాన్‌ వాహన దిగ్గజం హోండా మోటార్‌ ప్రకటించింది. విద్యుత్‌ వాహనాలకు అవసరమైన బ్యాటరీ షేరింగ్‌ సేవలను కొత్త అనుబంధ సంస్థ హోండా పవర్‌ ప్యాక్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అందించనుంది. వాహన తయారీ సంస్థల (ఓఈఎంలు)కు సాంకేతిక తోడ్పాటు కూడా ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. 2022 ప్రథమార్ధంలో బెంగళూరులో విద్యుత్‌ ఆటో రిక్షాలతో బ్యాటరీ షేరింగ్‌ సేవలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని, అనంతరం దశలవారీగా ఇతర నగరాలకు కార్యకలాపాలను విస్తరిస్తామని హోండా వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని