వణికించిన ఒమిక్రాన్‌

దేశీయంగా కేసుల నమోదు

 సెన్సెక్స్‌కు 765 పాయింట్ల నష్టం

సమీక్ష

ఇతర దేశాల్లో కొవిడ్‌-19 ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదైనా, వెనక్కి తగ్గని మన సూచీలు.. దేశీయంగా ఆ కేసులు వెలుగు చూడటంతోనే కుప్పకూలాయి. దేశీయంగా 5 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించడంతో, మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా సూచీల రెండు రోజుల జోరుకు అడ్డుకట్ట పడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు తగ్గి 75.12 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో షాంఘై, సియోల్‌, టోక్యో లాభపడగా.. హాంకాంగ్‌ నష్టపోయింది. ఐరోపా షేర్లు మెరుగ్గా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 58,555.58 పాయింట్ల వద్ద సానుకూలంగానే ప్రారంభమై, ఇంట్రాడేలో 58,757.09 వద్ద గరిష్ఠానికి చేరింది. ఈ స్థితిలో అమ్మకాల ఒత్తిడికి లోనై, నష్టాల్లోకి జారుకున్న సూచీ మళ్లీ కోలుకోలేదు. ఒకదశలో 57,640.57 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్‌, చివరకు 764.83 పాయింట్ల నష్టంతో 57,696.46 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 204.95 పాయింట్లు కోల్పోయి 17,196.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,180.80- 17,489.80 పాయింట్ల మధ్య కదలాడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్‌ 589.31 పాయింట్లు, నిఫ్టీ 170.25 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 26 నష్టపోయాయి. పవర్‌గ్రిడ్‌ 4.03%, రిలయన్స్‌ 3.05%, కోటక్‌ బ్యాంక్‌ 2.58%, ఏషియన్‌ పెయింట్స్‌ 2.29%, టెక్‌ మహీంద్రా 2.26%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.88%, సన్‌ఫార్మా  1.87%, మారుతీ 1.68%, ఐటీసీ 1.66%, హెచ్‌యూఎల్‌   1.65% మేర డీలాపడ్డాయి. ఎల్‌ అండ్‌ టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ స్వల్పంగా లాభపడ్డాయి. రంగాల సూచీల్లో ఇంధన, ఎఫ్‌ఎమ్‌సీజీ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఆరోగ్య సంరక్షణ 2.30% వరకు పడ్డాయి.

*  టెగా ఇండస్ట్రీస్‌ ఇష్యూ చివరి రోజుకు మొత్తం 219.04 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 95,68,636 షేర్లను ఆఫర్‌ చేయగా.. 2,09,58,59,600 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఎన్‌ఐఐ విభాగంలో 666.19 రెట్లు, క్యూఐబీలో 215.45 రెట్లు, రిటైల్‌ విభాగంలో 29.44 రెట్ల ఆసక్తి కనిపించింది.

* ఆనంద్‌ రాఠీ వెల్త్‌ ఐపీఓ రెండో రోజు ముగిసేసరికి 3.02 రెట్ల స్పందన వచ్చింది. రిటైల్‌ విభాగంలో 4.77 రెట్ల బిడ్లు లభించాయి. ఇష్యూ 6న ముగియనుంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

క్రీడలు

పాలిటిక్స్

వెబ్ ప్రత్యేకం

జాతీయం

జనరల్