ఐఎంఎఫ్‌లో ఫస్ట్‌ డిప్యూటీ ఎండీగాగీతా గోపీనాథ్‌

మన ఆడపడుచుకు అరుదైన అవకాశం

వాషింగ్టన్‌: అంతర్జాతీయ సంస్థల్లో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తూ భారతీయులు సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ఫస్ట్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎఫ్‌డీఎండీ) గా మన ఆడపడుచు గీతా గోపీనాథ్‌ నియమితులయ్యారు. అంటే ఈ దిగ్గజ సంస్థలో ఆమె రెండో అత్యున్నత అధికార స్థానాన్ని అధిరోహించారు. ఇప్పటి వరకు ఆమె ఐఎంఎఫ్‌లో ప్రధాన ఆర్థికవేత్తగా ఉన్నారు. కొవిడ్‌ కల్లోలంతో అతలాకుతలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఆమెకు ఈ పదోన్నతి లభించింది. ప్రస్తుత ఎఫ్‌డీఎండీగా ఉన్న జియోఫ్రె వచ్చే ఏడాది ప్రారంభంలో ఐఎంఎఫ్‌ను వీడనున్నారు. ఆ స్థానంలోకి గీతా గోపీనాథ్‌ వస్తారని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలీనా జార్జివా ప్రకటించారు. 2022 జనవరి నుంచి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో పాఠాలు బోధించేందుకు వెళ్లాలని గీతా గోపీనాథ్‌ నిర్ణయించుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఐఎంఎఫ్‌లో ఉండటం ఎంతైనా అవసరమైనందున,  తన ప్రణాళికను వాయిదా వేసుకున్నారని క్రిస్టలీనా తెలిపారు. ‘జియోఫ్రె, గీతా ఇద్దరూ నాకు మంచి సహచరులు. జియోఫ్రె ఐఎంఎఫ్‌ను వీడనుండటం బాధ కలిగిస్తున్నా.. గీతా ఎఫ్‌డీఎండీగా కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించడం ఆనందంగా ఉంద’ని పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌ తదుపరి ఎఫ్‌డీఎండీగా ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని గీతా గోపీనాథ్‌ వెల్లడించారు.

ప్రస్థానం ఇలా..

* వాషింగ్టన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐఎంఎఫ్‌లో తొలి మహిళా ప్రధాన ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్‌ (49) గత మూడేళ్లుగా (2018 అక్టోబరు నుంచి) పని చేస్తున్నారు.

* 1971 డిసెంబరు 8న ఆమె కోల్‌కతాలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు వీసీ విజయలక్ష్మి, టీవీ గోపీనాథ్‌. వారి ఇద్దరు కుమార్తెల్లో గీత చిన్నవారు.

* మైసూర్‌లోని నిర్మలా కాన్వెంట్‌ స్కూల్‌లో చదువుకున్నారు. దిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌ నుంచి 1992లో డిగ్రీ పట్టా పొందారు. 1994లో దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ చేశారు. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం నుంచి మరోసారి ఆర్థిక శాస్త్రంలోనే ఎంఏ పూర్తి చేశారు. ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం నుంచి 2001లో పీహెచ్‌డీ పట్టా పొందారు.

* తదుపరి షికాగో విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా గీత చేరారు. తర్వాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా కొనసాగుతున్న సమయంలోనే ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్తగా ఎంపికయ్యారు.

* 1999లో ఇక్బాల్‌ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. 1995 భారత సివిల్‌ సర్వీసెస్‌లో తొలి ర్యాంకు పొందిన ఈయన,  తిరునెల్వేలి జిల్లా సబ్‌-కలెక్టర్‌గా నియమితులయ్యారు. తర్వాత రాజీనామా చేసి అమెరికాకు వెళ్లారు. ప్రస్తుతం అక్కడి మసాసుచెట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఎకనామిక్స్‌ విభాగంలోని అబ్దుల్‌ లతీఫ్‌ జమీల్‌ పావర్టీ యాక్షన్‌ ల్యాబ్‌కు గ్లోబల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇక్బాల్‌-గీతా దంపతులకు రోహిల్‌ అనే కుమారుడున్నారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

క్రీడలు

పాలిటిక్స్

వెబ్ ప్రత్యేకం

జాతీయం

జనరల్