ఏటీఎం లావాదేవీల కంటే మొబైల్‌ చెల్లింపులే ఎక్కువ

గతేడాది ఏటీఎంల నుంచి జరిగిన నగదు ఉపసంహరణల కంటే మొబైల్‌ చెల్లింపు లావాదేవీలే అధికంగా ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఫిన్‌టెక్‌ కార్యకలాపాలకు అందించిన ప్రోత్సాహకాల

Published : 04 Dec 2021 05:59 IST

 ఫిన్‌టెక్‌ విప్లవంతోనే ప్రతి పౌరుడికి ఆర్థిక సాధికారత  

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

దిల్లీ: గతేడాది ఏటీఎంల నుంచి జరిగిన నగదు ఉపసంహరణల కంటే మొబైల్‌ చెల్లింపు లావాదేవీలే అధికంగా ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఫిన్‌టెక్‌ కార్యకలాపాలకు అందించిన ప్రోత్సాహకాల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. ప్రతి పౌరుడికి ఆర్థిక సాధికారత కల్పించేందుకు ఫిన్‌టెక్‌ విప్లవం రావాలని పేర్కొన్నారు. శుక్రవారం ఇన్ఫినిటీ ఫోరమ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ, ప్రసంగించారు. ‘ఎటువంటి భౌతిక శాఖలు లేని పూర్తిస్థాయి డిజిటల్‌ బ్యాంకులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. మరో దశాబ్దంలో ఇవి సర్వసాధారణంగా మారొచ్చు. ఆర్థిక కార్యకలాపాల్లో సాంకేతికత ఎనలేని మార్పులు తెస్తోంద’ని ప్రధాని వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

* 2014లో 50 శాతం కంటే తక్కువ మంది భారతీయులకు బ్యాంకు ఖాతాలు ఉంటే.. గత ఏడేళ్లలో 4.3 కోట్ల జన్‌ధన్‌ ఖాతాలు జతయ్యాయి. 69 కోట్ల రూపే కార్డులతో గతేడాది 130 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది నవంబరులో 420 కోట్ల యూపీఐ లావాదేవీలు చోటుచేసుకున్నాయి. ప్రతి నెలా జీఎస్‌టీ పోర్టల్‌పై 30 కోట్ల ఇన్‌వాయిస్‌లు అప్‌లోడ్‌ అవుతున్నాయి.

* ఆదాయం, పెట్టుబడులు, బీమా, సంస్థాగత రుణాలు అనే నాలుగు పునాదులపై ఫిన్‌టెక్‌ అభివృద్ధి చెందుతోంది. ఆర్థిక లావాదేవీల్లో విశ్వసనీయత అత్యంత ముఖ్యం. ఇందుకు భరోసా కల్పిస్తే, మరింతమంది డిజిటల్‌ లావాదేవీలకు ముందుకు వస్తారు.  

* ప్రతిదేశానికి యూపీఐ, రూపే వంటివి అంతులేని అవకాశాలు కల్పిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని