భారీ ఊగిసలాటలే!

దేశీయ సూచీల్లో భారీ హెచ్చుతగ్గులు ఈ వారమూ కొనసాగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ పరిణామాలను మదుపర్లు జాగ్రత్తగా పరిశీలించొచ్చు. నిఫ్టీ 17,000-17,500 శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Published : 06 Dec 2021 02:16 IST

 ఒమిక్రాన్‌ పరిణామాలు కీలకం 

అమెరికా స్థూల ఆర్థిక గణాంకాలూ ముఖ్యమే

ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నేటి నుంచి

ఐటీ షేర్లు రాణించే అవకాశం 

విశ్లేషకుల అంచనాలు

స్టాక్‌ మార్కెట్‌

ఈ వారం

దేశీయ సూచీల్లో భారీ హెచ్చుతగ్గులు ఈ వారమూ కొనసాగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ పరిణామాలను మదుపర్లు జాగ్రత్తగా పరిశీలించొచ్చు. నిఫ్టీ 17,000-17,500 శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈనెల 6-8 తేదీల్లో జరగబోయే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరపతి విధాన కమిటీ నిర్ణయాలు కీలకం కానున్నాయి. ఆర్‌బీఐ రేట్లను యథాతథంగా ఉంచొచ్చని భావిస్తున్నారు. 10న వెలువడే పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలూ ముఖ్యమే. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా స్థూల ఆర్థిక గణాంకాలనూ మదుపర్లు పరిశీలించొచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

* ఫాడా విడుదల చేసే నవంబరు విక్రయ గణాంకాల ఆధారంగా వాహన కంపెనీల షేర్లు కదలాడొచ్చు. కీలక సూచీల కదలికలూ ప్రభావం చూపుతాయి. దేశీయ డీలర్లకు కార్ల కంపెనీలు 2020 నవంబరుతో పోలిస్తే గత నెలలో 11 శాతం తక్కువగా వాహనాలను పంపిణీ చేశాయి.

* సిమెంటు కంపెనీల షేర్లు స్తబ్దుగా కదలాడొచ్చు. దేశవ్యాప్తంగా గిరాకీ పుంజుకునే సంకేతాలు కనిపించకపోవడమే ఇందుకు కారణం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో భారీ వర్షాల కారణంగా అమ్మకాలపై ప్రభావం పడొచ్చు. 

* చమురు కంపెనీల షేర్లు అంతర్లీనంగా ప్రతికూల ధోరణితో, చాలా తక్కువ శ్రేణికి లోబడి కదలాడొచ్చు. చమురు ధరల ఆధారంగా అప్‌స్ట్రీమ్‌ సంస్థల షేర్ల చలనాలు ఉండొచ్చు.

* బ్యాంకు షేర్లు ఊగిసలాటలకు గురికావొచ్చు. విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు కొనసాగుతాయని భావిస్తున్నందున, బ్యాంక్‌ నిఫ్టీలో ఊగిసలాటలు అధికంగా ఉండి, 36,000 వద్ద మద్దతు లభించొచ్చు. యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ విలువలు రాణించొచ్చు.

* టెలికాం కంపెనీల షేర్లు ఊగిసలాటలకు గురికావొచ్చు. గత వారం 33% మేర పెరిగిన వొడాఫోన్‌ఐడియాలో లాభాల స్వీకరణ జరగొచ్చు. సానుకూల వార్తలు లేకపోవడం, అధిక విలువల కారణంగా భారతీ ఎయిర్‌టెల్‌ స్తబ్దుగా చలించొచ్చు. దీర్ఘకాలానికి మాత్రం సానుకూలతలున్నాయి.

* రక్షణాత్మక ఐటీ షేర్లు కీలక సూచీలతో పోలిస్తే రాణించే అవకాశం ఉంది. మధ్య కాలానికి డాలరు బలోపేతం నుంచి కూడా ఈ రంగం లాభాలు పొందొచ్చు.

* స్వల్పకాల అంచనాలు ప్రతికూలంగా ఉన్నందున, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు డీలా పడొచ్చు. ముడి పదార్థాల అధిక వ్యయాలు మార్జిన్లపై ఒత్తిడి పెంచుతాయన్న అంచనాలకు ఒమిక్రాన్‌ భయాలు తోడవవచ్చు.

* మార్కెట్‌తో పాటే యంత్ర పరికరాల షేర్లు ట్రేడవవచ్చు. ఎల్‌ అండ్‌ టీ, స్కిప్పర్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, జేఎమ్‌సీ ప్రాజెక్ట్స్‌లకు ఆర్డర్లు లభించినందున ఆయా సంస్థల షేర్లను గమనించొచ్చు.

* ఔషధ షేర్లలో మదుపర్లు ‘వేచిచూసే ధోరణి’ని ప్రదర్శించవచ్చు. ఒమిక్రాన్‌ కేసులు పెరిగితే, ఈ షేర్లు వెలుగులోకి రావొచ్చు. ఆ లాభాలు ఎంత వరకు నిలిచి ఉంటాయన్నదీ గమనించాలి.

* లోహ, గనుల కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణిలో చలించొచ్చు. వరుసగా మూడు వారాలుగా ట్రేడర్ల మార్కెట్లో ధరలు తగ్గుతున్నందున, ఉక్కు షేర్లు వెలుగులోకి రావొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని