సరఫరాకు అధిక సమయం వల్ల ప్రతికూల ప్రభావం: మారుతీ

సెమీ కండక్టర్ల కొరత వల్ల, ఎలక్ట్రానిక్‌ పరికరాలు తగినన్ని అందక, వాహనాల ఉత్పత్తిని కంపెనీలు తగ్గిస్తున్నాయి. అందువల్ల కొనుగోలుదార్లు వారాలు, నెలల తరబడి బుక్‌ చేసిన కారు కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.

Published : 06 Dec 2021 02:16 IST

దిల్లీ: సెమీ కండక్టర్ల కొరత వల్ల, ఎలక్ట్రానిక్‌ పరికరాలు తగినన్ని అందక, వాహనాల ఉత్పత్తిని కంపెనీలు తగ్గిస్తున్నాయి. అందువల్ల కొనుగోలుదార్లు వారాలు, నెలల తరబడి బుక్‌ చేసిన కారు కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఇందువల్ల కార్ల గిరాకీపై ప్రతికూల ప్రభావం పడుతుందని మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది. అయితే కారు బుక్‌ చేసిన వారికి వారానికోసారి సమాచారం ఇస్తూ, ఎప్పటికి ఇస్తామో తెలుపుతున్నందున, క్యాన్సిలేషన్లు లేవని మారుతీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌, విక్రయాలు) శశాంక్‌ శ్రీవాత్సవ వెల్లడించారు. కంపెనీ వద్ద ఇంకా సుమారు 2.5 లక్షల కార్ల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. చిప్‌ల కొరత సమస్య ఆగస్టులో ప్రారంభం కాగా, అనుకున్న ఉత్పత్తిలో సెప్టెంబరులో 40 శాతం, అక్టోబరులో 60 శాతం, నవంబరులో 83-84 శాతం చేయగలిగామని, డిసెంబరులోనూ 80-85 శాతం చేయగలమని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా చిప్‌ల కొరత సమస్య తీవ్రత తగ్గుతున్నందున, త్వరలో పరిశ్రమ కుదుట పడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశీయంగా అన్ని కంపెనీలవి కలిపి ఏప్రిల్‌-నవంబరులో 19 లక్షల కార్లు విక్రయమయ్యాయని, గతేడాది ఇదే సమయం విక్రయాలు 15 లక్షలతో పోలిస్తే, ఇవి 26 శాతం అధికమని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని