స్థిరీకరణ కొనసాగొచ్చు!

సమీక్ష: దేశీయ పరిణామాలు, దిగువ స్థాయుల్లో కొనుగోళ్లతో గత వారం మొత్తంమీద మార్కెట్లు లాభాలు ఆర్జించాయి. జులై-సెప్టెంబరులో జీడీపీ 8.4 శాతం వృద్ధి చెందడం, నవంబరులోనూ జీఎస్‌టీ వసూళ్లు రూ.1.3 లక్షల కోట్ల స్థాయిని మించడం కలిసొచ్చింది. కొవిడ్‌-19 ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు దేశీయంగా నమోదుకావడంతో మార్కెట్ల లాభాల జోరుకు అడ్డుకట్ట పడింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్నందున కీలక బిల్లులపై మార్కెట్లు దృష్టి పెడుతున్నాయి. అక్టోబరులో మౌలిక రంగం 7.5 శాతం రాణించింది. తయారీ పీఎంఐ  57.6కు, సేవల పీఎంఐ 58.1కు పెరిగాయి. దేశ ద్రవ్యలోటు రికార్డు స్థాయిలో 2327 కోట్ల డాలర్లకు చేరింది. ఒమిక్రాన్‌ పరిణామాల వల్ల గిరాకీ మళ్లీ తగ్గొచ్చనే అంచనాలతో, వరుసగా రెండో వారం చమురు ధరలు తగ్గి, బ్యారెల్‌ 69.9 డాలర్లకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి     0.3 శాతం తగ్గి 75.1 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా చూస్తే.. పలు దేశాల్లో తాజా లాక్‌డౌన్‌లు, ప్రయాణ ఆంక్షలు విధించడంతో ప్రపంచ మార్కెట్లు డీలాపడ్డాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 1 శాతం లాభంతో 57,696 పాయింట్ల వద్ద, నిఫ్టీ 1 శాతం పెరిగి 17,196 పాయింట్ల దగ్గర స్థిరపడ్డాయి. ఐటీ, మన్నికైన వినిమయ వస్తువులు, యంత్ర పరికరాల షేర్లు లాభపడ్డాయి. ఆరోగ్య సంరక్షణ, ఎఫ్‌ఎమ్‌సీజీ, విద్యుత్‌ స్క్రిప్‌లు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.15,809 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.16,450 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 10:9గా నమోదు కావడం..

ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: సెన్సెక్స్‌ రికవరీ క్రమంలో 58800- 59000 శ్రేణిలో నిరోధం ఎదురైంది. ఫలితంగా సెన్సెక్స్‌ గరిష్ఠాల నుంచి వెనక్కి వచ్చింది. అందువల్ల 56,867 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 56,118 వద్ద మద్దతు లభించొచ్చు. స్వల్పకాలంలో మార్కెట్‌ స్థిరీకరించుకునే అవకాశాలు ఎక్కువ.

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల తరహాలోనే దేశీయ సూచీల ఒడుదొడుకులు కొనసాగొచ్చు. కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ పరిణామాలతో ఆర్థిక వ్యవస్థలు మళ్లీ అనిశ్చితికి చేరతాయనే ఆందోళన ఉంది. ఐరోపా, ఆఫ్రికా, ఇతర దేశాల్లో కొవిడ్‌ కొత్త కేసులు పెరగడం, ప్రభుత్వాలు ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్‌లు విధిస్తుండటం వల్ల ఆర్థిక రికవరీకి ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. దేశీయంగా కూడా కొవిడ్‌ కేసుల నమోదు, పరిణామాల నుంచి మదుపర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశం 6-8 తేదీల్లో జరగనుంది. అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడి వల్ల కీలక రేట్లను యథాతథంగానే ఆర్‌బీఐ కొనసాగించొచ్చు. రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ ఐపీఓ ఈనెల 7న ప్రారంభమై 9న ముగియనుంది. స్టార్‌ హెల్త్‌ షేర్లు 10న నమోదుకానున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా వాణిజ్యం, చైనా-అమెరికా ద్రవ్యోల్బణం, యూరో ఏరియా కన్‌స్ట్రక్షన్‌ పీఎంఐ, చైనా ఎగుమతులు-దిగుమతుల గణాంకాలు విడుదల కానున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడులు, ముడిచమురు ధరలు నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగితే సెంటిమెంట్‌ బలహీనపడొచ్చు. గతంలో నిర్ణయించిన ప్రకారమే ఉత్పత్తి పెంచాలని ఒపెక్‌ నిర్ణయించడంతో చమురు ధరలు స్వల్పకాలంలో పెరగకపోవచ్చు.
తక్షణ మద్దతు స్థాయులు: 57,346, 56,867, 56,188
తక్షణ నిరోధ స్థాయులు: 58,182, 58,757, 59090
స్వల్పకాలంలో సెన్సెక్స్‌ మరింత స్థిరీకరించుకోవచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని