
తీవ్ర ఇబ్బందుల్లోనే ప్రజలు
భారత ఆర్థిక వ్యవస్థ కొవిడ్ ముందు స్థాయికి చేరలేదు
నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ
అహ్మదాబాద్: భారత్లో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, ఆర్థిక వ్యవస్థ 2019 (కొవిడ్ ముందు) స్థాయి కంటే దిగువనే ఉందని నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ వెల్లడించారు. ప్రజల చిన్న చిన్న ఆశలు కూడా నెరవేర్చుకోలేక పోతున్నారని అభిప్రాయపడ్డారు. గుజరాత్లోని అహ్మదాబాద్ విశ్వవిద్యాలయం 11వ వార్షిక పట్టా ప్రదానోత్సవంలో ఆయన అమెరికా నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రసంగించారు. ‘పశ్చిమ బెంగాల్లోని గ్రామీణ ప్రాంతాల్ని ఇటీవల సందర్శించాను. ప్రజలు చిన్న చిన్న ఆశల్ని కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ 2019 స్థాయి కంటే దిగువన ఉంది. దీనికి నేను ఎవర్నీ బాధ్యుల్ని చేయదల్చుకోవడం లేదు. మీరు మాత్రం కుటుంబం నుంచో.. సమాజం నుంచో వచ్చే ఒత్తిళ్లకు తలొగ్గకుండా అనుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేయాలి. మీకు నచ్చిన రంగంలో ఎదగడానికి ప్రయత్నించాల’ని విద్యార్థులకు సూచించారు.