
ధరల పెంపు బాటలో టాటా, హోండా, రెనో
దిల్లీ: ముడి పదార్థాల వ్యయాలు అధికమవుతున్నందున, వాహన ధరలు పెంచేందుకు తయారీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, ఆడి సంస్థలు కార్ల ధరల్ని జనవరి 1 నుంచి పెంచుతున్నామని ప్రకటించగా, టాటా మోటార్స్, హోండా, రెనో సంస్థలు కూడా ఇదే బాటను అనుసరించనున్నాయి. ‘కమొడిటీలు, ముడి పదార్థాల ధరలు పెరిగినందున, కంపెనీపై పడుతున్న భారంలో కొంతైనా వినియోగదార్లకు సమీప భవిష్యత్తులో బదిలీ చేస్తామ’ని టాటా మోటార్స్ ప్రయాణికుల వాహనాల వ్యాపార అధ్యక్షుడు శైలేష్ చంద్ర వెల్లడించారు. హోండా కార్స్ ఇండియా కూడా సమీప భవిష్యత్‌లో ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ సంస్థ గత ఆగస్టులో ఒకసారి ధరలు పెంచింది. క్విడ్, ట్రైబర్, కైజర్ వాహనాలను దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఫ్రెంచ్ కంపెనీ రెనో కూడా జనవరి నుంచి వాహన ధరలు పెంచాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.