
48 గంటల్లోగా రూ.1,000 కోట్లు జమ చేస్తాం
డీఏఎంఈపీఎల్ రుణాల బాధ్యతనూ తీసుకుంటాం
దిల్లీ హైకోర్టుకు తెలిపిన డీఎంఆర్సీ
ఈనెల 22కు విచారణ వాయిదా
దిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ దిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (డీఏఎంఈపీఎల్)కు రూ.4,600 కోట్లు చెల్లించాలంటూ ఇచ్చిన తీర్పును అనుసరించి 48 గంటల్లోగా ఎస్క్రో (థర్డ్‌పార్టీ) ఖాతాలో రూ.1000 కోట్లు జమ చేయనున్నట్లు దిల్లీ హైకోర్టుకు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తెలిపింది. తీర్పులో ఎంతైతే చెల్లించాలని చెప్పారో, ఆ మేరకు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థకు ఉన్న రుణానికి బాధ్యత తీసుకునేందుకూ సిద్ధంగా ఉన్నామని డీఎంఆర్సీ పేర్కొంది. ‘డీఎంఆర్సీ నిధుల కొరత సమస్యను ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఒక్కసారిగా ఈ డబ్బులు చెల్లించాలంటే ప్రజా ప్రయోజనాలపై ప్రభావం పడుతుంది. అందుకే అధికారులు ఒక పరిష్కారాన్ని రూపొందించే పనిలో ఉన్నార’ని డీఎంఆర్సీ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. ‘ఏయే అవకాశాలున్నాయో పరిశీలిస్తున్నాం. ఒకవేళ మేం చెల్లించినా.. బ్యాంకుల నుంచే రుణాలు తీసుకునే చెల్లించాలి. అదే డీఏఎంఈపీఎల్ రుణాల బాధ్యతను మేమే తీసుకుంటే.. బ్యాంకులకు మేమే సమాధానం చెప్పుకుంటామ’ని డీఏఎంఈపీఎల్ పిటిషన్‌ను విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కుమార్ కెయిట్‌కు సొలిసిటర్ జనరల్ తెలిపారు. డీఎంఆర్సీ తరపు వాదిస్తున్న మరో సీనియర్ న్యాయవాది పరాగ్ త్రిపాఠి కూడా ఇదే విషయాన్ని సమర్థించారు. అయితే డీఏఎంఈపీఎల్ తరపు వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ నాయర్ మాట్లాడుతూ.. ‘ఈ సూచనల విషయంలో మాకు అభ్యంతరం లేదు. అయితే చెల్లించాల్సిన తుది మొత్తాన్ని ముందుగా లెక్కగట్టాలి. వాళ్లు లెక్కగట్టిన దాని ప్రకారం ఇది రూ.7,000 కోట్లకు పైగానే ఉండొచ్చ’ని పేర్కొన్నారు. అలాగే తీర్పులో పొందుపర్చిన చెల్లింపు మొత్తంలో ముందుగా సగాన్ని డిపాజిట్ చేయాల్సిందేనని ఆయన వాదించారు. ‘ఇది ప్రభుత్వ నియంత్రణలోని సంస్థ. ముందుగా కోర్టుకు ఆ డబ్బులు రానివ్వండి. ప్రభుత్వం దివాలా తీసిందని మనం అనలేం కదా. పైగా రూ.10,000 కోట్లకు పైగా నిధులు డీఎంఆర్సీ వద్ద ఉన్నాయ’ని రాజీవ్ నాయర్ తెలిపారు. అయితే సగం మొత్తాన్ని డిపాజిటు చేయడం డీఎంఆర్సీ వల్ల కాదని సొలిసిటర్ జనరల్ తెలిపారు. రూ.1,000 కోట్ల వరకు డిపాజిటు చేస్తుందని, అంతకుమించి కావాలంటే బ్యాంకుల దగ్గర నుంచి రుణం తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ కేసు విచారణను డిసెంబరు 22 వరకు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. తీర్పులో పేర్కొన్న తుది మొత్తాన్ని ఎప్పటివరకు, ఎలా చెల్లిస్తారనే దానిపై తెలియజేయాల్సిందిగా డీఎంఆర్సీని ఆదేశించింది. అలాగే డీఎంఆర్సీ సూచనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పాల్సిందిగా డీఏఎంఈపీఎల్‌కు కోర్టు సూచించింది.
ఏడేళ్లలో రూ.16.7 లక్షల కోట్లు
2014-15 నుంచి 2020-21 మధ్య పెట్రోలియం ఉత్పత్తుల నుంచి మొత్తం రూ.16.7 లక్షల కోట్ల ఎక్సైజ్ సుంకాన్ని(సెస్సులతో కలిపి) వసూలు చేసినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా వివరించారు. ‘2013-14లో అన్‌బ్రాండెడ్ పెట్రోలుపై మొత్తం ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ.9.2గా ఉండగా.. అన్‌బ్రాండెడ్ డీజిల్‌పై రూ.3.46 వరకు ఉంది. ప్రస్తుతం అన్‌బ్రాండెడ్ పెట్రోలుపై కేంద్ర ఎక్సైజ్ సుంకం రూ.27.9గా ఉండగా.. డీజిల్‌పై రూ.21.80గా ఉన్న’ట్లు ఆయన తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.