ఆసుపత్రుల నియంత్రణకో సంస్థ!

ఆరోగ్య సంరక్షణ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆసుపత్రులను నియంత్రించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయాలని లేదంటే వాటి నియంత్రణకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐకు అనుమతి ఇవ్వాలని, సంస్థ సభ్యులు టి.ఎల్‌.

Published : 07 Dec 2021 01:42 IST

లేదంటే మాకు అనుమతివ్వండి

పాలసీదార్ల ప్రయోజనాలను రక్షిస్తాం

ఐఆర్‌డీఏఐ సభ్యులు టి.ఎల్‌. అలమేలు

దిల్లీ: ఆరోగ్య సంరక్షణ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆసుపత్రులను నియంత్రించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయాలని లేదంటే వాటి నియంత్రణకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐకు అనుమతి ఇవ్వాలని, సంస్థ సభ్యులు టి.ఎల్‌. అలమేలు కోరారు. ఆరోగ్య బీమా ప్రీమియాలు పెరుగుతూనే ఉన్నందున ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలని ఐఆర్‌డీఏఐ కోరుకుంటోందని  పేర్కొన్నారు. ‘బీమా నియంత్రణ సంస్థగా ఆరోగ్య వ్యవస్థను నియంత్రించడం పెద్ద కష్టమేమీ కాదు. అందులో కేవలం ఒక భాగమైన బీమాదార్లను మాత్రమే మేం నియంత్రిస్తున్నామ’ని అన్నారు. ‘బీమా సంస్థలు ప్రీమియాలను ఎలా పెంచుతున్నాయో ఓ కంట కనిపెడుతున్నాం. అయితే ఆ సేవలను అందజేస్తున్నవారిపై ఎటువంటి నియంత్రణ సంస్థా పనిచేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ విషయమై మాట్లాడాలని భావిస్తున్నాం. ఆసుపత్రులను నియంత్రించడానికి ఒక నియంత్రణ సంస్థ ఉండాలి లేదా మాకు అందుకు అనుమతి ఇస్తే అపుడు మెరుగైన వ్యవస్థ ఏర్పడుతుంద’ని ఆమె వివరించారు.

నగదు రహిత చికిత్సకు ముందుకు రావాలి

‘కొవిడ్‌ బాధితులకు కొన్ని ఆసుపత్రులు నగదు రహిత చికిత్సకు నిరాకరించిన ఘటనలు మా దృష్టికి వచ్చాయి. క్యాష్‌లెస్‌ చికిత్సకు ముందుకు రావాలని ఆసుపత్రులను కోరుతున్నాం. బీమా చేసుకున్న జనాభాతో పోలిస్తే నగదు రహిత చికిత్సనందిస్తున్న ఆసుపత్రుల సంఖ్య తక్కువగానే ఉంది. అదీకాక కొన్ని ఆసుపత్రులు బిల్లులను పెంచుకుంటూ పోతున్నాయి. టారిఫ్‌లను తరచూ మారుస్తూ ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణ రంగం మొత్తాన్ని నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తీసుకొస్తే ప్రజలు లేదా పాలసీదార్ల ప్రయోజనాలను రక్షించుకోవచ్చు. అపుడు బీమా కొనుగోలుపై నమ్మకం ఏర్పడుతుంద’ని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని