
30న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఈజీఎం
దిల్లీ: ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ డిసెంబరు 30న అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని (ఈజీఎం) నిర్వహించనుంది. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లో (ఏఓఏ) సవరణలు చేయాల్సిందిగా ప్రమోటర్ల నుంచి వినతి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రమోటర్ల షేర్ల బదిలీపై ఆంక్షలు తొలగించే నిమిత్తం ఏఓఏలో సవరణలు చేసేందుకు ఈనెల 30న ఈజీఎం నిర్వహించనున్నామని ఎక్స్ఛేంజీలకు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ వెల్లడించింది. ప్రమోటర్లు రాహుల్ భాటియా, రాకేశ్ గాంగ్వాల్‌కు, వాళ్ల సంస్థలకు కలిపి ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో 77.4 శాతం వాటా ఉంది.
అంకుర సంస్థ ‘ఓయ్‌చెఫ్’కురూ.2.5 కోట్ల పెట్టుబడి
ఈనాడు, హైదరాబాద్: ఇళ్లలో వంట చేయడానికి ప్రైవేట్ చెఫ్‌లను ఎంపిక చేసుకునేందుకు వీలుకల్పించే మొబైల్ యాప్ ‘ఓయ్‌చెఫ్ ఆన్ డిమాండ్’ అనే హైదరాబాదీ అంకుర సంస్థకు రూ.2.5 కోట్ల ప్రాథమిక మూలధనం లభించింది. గ్రోత్ స్టోరీస్ అనే పెట్టుబడుల సంస్థ, కొందరు వ్యక్తిగత ఇన్వెస్టర్లు ఈ మూలధనాన్ని సమకూర్చారు. ఈ యాప్‌ను తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటికే 45 మంది ప్రైవేట్ చెఫ్‌లను గుర్తించామని, ఈ సంఖ్యను 350 కి పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు, 1,000 మంది ప్రీలాన్స్ చెఫ్‌లను ఎంపిక చేసే సన్నాహాల్లో ఉన్నట్లు ఓయ్‌చెఫ్ వెల్లడించింది. కార్యకలాపాలను తొలుత బెంగళూరుకు, రెండేళ్లలో ముంబయి, పుణె, దిల్లీ నగరాలకు విస్తరిస్తామని పేర్కొంది. భవిష్యత్తు అవసరాల కోసం మరో రూ.10 కోట్ల మూలధన నిధులు సమీకరించేందుకు ఈ అంకుర సంస్థ ప్రయత్నిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో లభించే రుచులను ఇళ్లలోనే అందించే ప్రయత్నాన్ని ఓయ్‌చెఫ్ చేస్తోందని గ్రోత్‌స్టోరీస్ సహ వ్యవస్థాపకులు వినయ్ కొట్రా, సాయినాథ్ గౌడ్, ఓయ్‌చెఫ్ యాప్ సర్వీసెస్ ఐడియేటర్ శ్రుతి రెడ్డి తెలిపారు.
Advertisement