జూమ్‌ కాల్‌లో 900 ఉద్యోగాలు ఉఫ్‌!

ఏదైనా సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) జూమ్‌ వెబినార్‌ నిర్వహిస్తే ఏం చేస్తారు.. సంస్థ లక్ష్యాలు, వాటిని చేరుకోవాల్సిన తీరు గురించో, భవిష్యత్‌పైనో చర్చలు చేపడతారు.

Updated : 07 Dec 2021 05:31 IST

భారత సంతతి సీఈఓ చర్యలు

న్యూయార్క్‌: ఏదైనా సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) జూమ్‌ వెబినార్‌ నిర్వహిస్తే ఏం చేస్తారు.. సంస్థ లక్ష్యాలు, వాటిని చేరుకోవాల్సిన తీరు గురించో, భవిష్యత్‌పైనో చర్చలు చేపడతారు. అమెరికాలోని ఓ కంపెనీ  సీఈఓ, అందులోనూ భారత సంతతికి చెందిన ఆ వ్యక్తి తన కంపెనీలోని 900 మందికి పైగా ఉద్యోగుల్ని జూమ్‌ కాల్‌లోనే తొలగించేశారు. సంస్థ సిబ్బందిలో ఈ సంఖ్య 9 శాతానికి సమానం. మార్కెట్‌ సామర్థ్యం, పనితీరు, ఉత్పాదకతలను ఇందుకు కారణాలు చెప్పారట. ఆ కంపెనీ పేరు కాగా.. ఈ సీఈఓ పేరు విశాల్‌ గార్గ్‌. 

వార్తా సంస్థ సీఎన్‌ఎన్‌ కథనం ప్రకారం.. ‘మీరు ఈ కాల్‌లో ఉన్నారంటే.. మీరు దురదృష్టవంతులే. ఎందుకంటే మీరందరినీ ఉద్యోగాల నుంచి తక్షణం తీసేస్తున్నా’ అని జూమ్‌ కాల్‌లో ఆ మార్టగేజ్‌ కంపెనీ అధిపతి తెలిపారట. మానవ వనరుల  విభాగం నుంచి అందుకు సంబంధించిన సమాచారం వస్తుందనీ వారికి వివరించారట. ‘నా జీవితంలో ఇలా చేయడం రెండో సారి. నాకు ఇలా చేయాలని లేకున్నా.. చేయాల్సి వచ్చింది. అంతక్రితం ఉద్యోగుల్ని తొలగించినపుడు నేను ఏడ్చాను కూడా’ అని జూమ్‌ కాల్‌లో గార్గ్‌ పేర్కొన్నారు.

క్రిస్మస్‌ సెలవులకు ముందు గార్గ్‌ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులందరూ హతాశులయ్యారట. ‘లే ఆఫ్‌లు ప్రకటించడం చాలా బాధాకర విషయం. అందులోనూ ఈ సమయంలో. అయితే హోమ్‌ఓనర్‌షిప్‌ మార్కెట్లో మనగలగడం కోసం ఈ పనిచేయక తప్పడం లేద’ని సీఎఫ్‌ఓ కెవిన్‌ రియాన్‌ సీఎన్‌ఎన్‌ బిజినెస్‌తో పేర్కొన్నారు. మరో వైపు, ఉద్యోగులు రోజులో రెండు గంటలు మాత్రమే పనిచేస్తున్నందున, ఉత్పాదకత తగ్గుతోందని గార్గ్‌ ఆరోపించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని