Cement Price: తగ్గిన సిమెంట్‌ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

సిమెంటుకు గిరాకీ భారీగా పడిపోవడంతో, దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంటు తయారీ కంపెనీలు ధరలను తగ్గించాయి. 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు తగ్గించినట్లు డీలర్లు తెలిపారు.

Updated : 07 Dec 2021 08:22 IST

హైదరాబాద్‌/చెన్నై: సిమెంటుకు గిరాకీ భారీగా పడిపోవడంతో, దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంటు తయారీ కంపెనీలు ధరలను తగ్గించాయి. 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు తగ్గించినట్లు డీలర్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బస్తాకు రూ.40 వరకు; తమిళనాడులో రూ.20 దాకా కోతలు పడ్డాయని వార్తా సంస్థ ‘ఇన్ఫామిస్ట్‌’కు డీలర్లు తెలిపారు. కేరళ, కర్ణాటకల్లోనూ రూ.20-40 వరకు కోత విధించారు. ఈ ధరల తగ్గింపు నేపథ్యంలో 50 కిలోల బస్తా తెలుగు రాష్ట్రాల్లో రూ.280-320కి పరిమితం కానుంది. తమిళనాడులో ఒక టాప్‌ బ్రాండ్‌ సిమెంటు ధర రూ.400 దిగువకు; కర్ణాటక, కేరళల్లోనూ బస్తా ధర రూ.360-400 నుంచి రూ.340-380కి చేరినట్లు డీలర్లు వివరించారు.

ఏ కంపెనీలంటే..: కోత విధించిన కంపెనీల్లో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండియా సిమెంట్స్‌, ఓరియంట్‌ సిమెంట్‌, సాగర్‌ సిమెంట్స్‌, అంబుజా సిమెంట్స్‌, రామ్‌కో సిమెంట్స్‌, చెట్టినాడ్‌ సిమెంట్‌, ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌, దాల్మియా భారత్‌, శ్రీ సిమెంట్‌, హెడల్‌బర్గ్‌ సిమెంట్‌ ఇండియా తదితరాలున్నాయి.

పెంచాలనుకున్నారు కానీ..: నవంబరు చివర్లో ధరలను పెంచాలని సిమెంటు కంపెనీలు భావించాయి. అయితే గిరాకీ తగ్గడానికి తోడు కొన్ని ప్రాంతాల్లో డీలర్ల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ఆలోచనను విరమించుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అకాల వర్షాలకు తోడు, ద్రవ్యలభ్యత సమస్యలతో గిరాకీ మరింతగా తగ్గిందని డీలర్లు చెబుతున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో నవంబరు చివరి వారం నుంచి డిసెంబరు తొలి వారం వరకు భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో అమ్ముడుపోని ఇళ్లు అధిక స్థాయిలో ఉండడంతో కొత్త ప్రాజెక్టులపై ప్రభావం పడుతోంది. బిల్డర్ల వద్ద డబ్బులు లేక సిమెంటు వినియోగం సైతం తగ్గింది. జనవరి మధ్యలో కానీ, ఫిబ్రవరి ప్రారంభంలో కానీ దక్షిణాదిన గిరాకీ పుంజుకునే అవకాశం ఉందని సిమెంటు కంపెనీలు భావిస్తున్నాయని డీలర్లు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు