ఒమిక్రాన్‌ భయాలు.. విదేశీయుల అమ్మకాలు

8 వారాల కనిష్ఠస్థాయికి రూపాయి  
2 రోజుల్లో రూ.5.80 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశంలో ఒమిక్రాన్‌ వైరస్‌ కేసులు 21కు పెరగడంతో మదుపర్లు ఆందోళనకు గురై విక్రయాలకు తెగబడ్డారు. రూపాయి మారకపు విలువా క్షీణించడం విదేశీ మదుపర్లూ (ఎఫ్‌ఐఐలు) అమ్మకాలు కొనసాగించడంతో సెన్సెక్స్‌ 949 పాయింట్లు, నిఫ్టీ 284 పాయింట్ల మేర క్షీణించాయి. సోమవారం ప్రారంభమైన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశ నిర్ణయాలు బుధవారం వెలువడ నున్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్‌, టోక్యో నష్టపోగా, ఐరోపా మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి.

8 వారాల కనిష్ఠానికి రూపాయి: డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 33 పైసలు క్షీణించి 75.45 వద్ద ముగిసింది. అక్టోబరు 12 తర్వాత మళ్లీ ఇదే కనిష్ఠ స్థాయి.

2 రోజుల్లో రూ.5.80 లక్షల కోట్ల నష్టం: మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ సోమవారం రూ.4.29 లక్షల కోట్లు క్షీణించి రూ.256.72 లక్షల కోట్లకు పరిమితమైంది. గత 2 ట్రేడింగ్‌ రోజుల్లో కలిపి రూ.5,80,016.37 కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైంది.

ఏ దశలోనూ కోలుకోలేక..: సెన్సెక్స్‌ ఉదయం 57,778.01 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,781.46 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదు చేశాక నష్టాల్లోకి జారుకుంది. తదుపరి ఏ దశలోనూ కోలుకోలేక, ఒక దశలో 56,687.62 పాయింట్ల వద్ద కనిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 949.32 పాయింట్ల నష్టంతో 56,747.14 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సైతం 284.45 పాయింట్లు కోల్పోయి 16,912.25 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,891.70-17,216.75 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్‌లోని 30 షేర్లూ నష్టాల్లోనే: సెన్సెక్స్‌ 30 షేర్లలో అన్నీ నష్టాల్లోనే ముగిశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.75%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.43%, భారతీ ఎయిర్‌టెల్‌ 2.96%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.94%, టీసీఎస్‌ 2.89%, టెక్‌ మహీంద్రా 2.56%, ఇన్ఫోసిస్‌ 2.38%, ఏషియన్‌ పెయింట్స్‌ 2.34%, మారుతీ సుజుకీ 2.22%, ఎన్‌టీపీసీ 2.16%, డాక్టర్‌ రెడ్డీస్‌ 2.06%, పవర్‌గ్రిడ్‌ 2.01%, సన్‌ ఫార్మా 1.96%, ఎంఅండ్‌ఎం 1.93%, ఆర్‌ఐఎల్‌ 1.86%, టైటన్‌ 1.84%, ఐటీసీ 1.71%, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.69%, ఎస్‌బీఐ 1.66%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.64%, నెస్లే ఇండియా 1.62%, హెచ్‌యూఎల్‌ 1.52% చొప్పున నష్టపోయాయి.

* రంగాల వారీ సూచీలన్నీ డీలా పడ్డాయి. ఐటీ, టెక్‌, టెలికాం, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, వాహన రంగాలు 2.49 శాతం వరకు నష్టపోయాయి. నీ బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1.35 శాతం మేర క్షీణించాయి.
* బీఎస్‌ఈలో 1,356 షేర్లు సానుకూలంగా, 2,073 షేర్లు ప్రతికూలంగా ముగిశాయి. 169 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని