రూ.1,000 కోట్లతో మెడికవర్‌ హాస్పిటల్స్‌ విస్తరణ

2024కు 7,500 పడకల సామర్థ్యమే లక్ష్యం
మరో 5,000 నియామకాలు
సీఎండీ డాక్టర్‌ జి.అనిల్‌ కృష్ణ వెల్లడి
ఈనాడు - హైదరాబాద్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మెడికవర్‌ హాస్పిటల్స్‌ పెద్దఎత్తున విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టింది. రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టి, వచ్చే మూడేళ్లలో మరో 3,000 సూపర్‌ స్పెషాలిటీ వైద్య పడకల సామర్థ్యాన్ని సమకూర్చుకోనుంది. ఈ విస్తరణ ఫలితంగా దేశీయ వైద్యసేవల రంగంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించే స్థాయికి మెడికవర్‌ హాస్పిటల్స్‌ చేరుకుంటుందని మెడికవర్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ సీఎండీ డాక్టర్‌ జి.అనిల్‌ కృష్ణ వెల్లడించారు.

ఏడాదిన్నరలో 2,000 పడకలు
ఐరోపాలో వైద్యసేవల రంగంలో దిగ్గజ సంస్థ అయిన మెడికవర్‌, 2017 ఆగస్టులో స్థానిక మ్యాక్స్‌క్యూర్‌ హాస్పిటల్స్‌లో మెజార్టీ వాటా సొంతం చేసుకుని, సంస్థ పేరును మెడికవర్‌ హాస్పిటల్స్‌గా మార్చారు. కొవిడ్‌ ముందు (2020 మార్చి) మెడికవర్‌ హాస్పిటల్స్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల్లో కలిపి 2500 పడకలు ఉండగా, ఏడాదిన్నర వ్యవధిలో రూ.700 కోట్ల పెట్టుబడితో మరో 2,000 పడకలు జతచేర్చుకుని, ప్రస్తుతం 4,500 పడకల సామర్థ్యం గల 20 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. 10,400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

విదేశీ సంస్థ వాటా పెరగొచ్చు
సగటున 300 పడకలతో మరో 10 ఆసుపత్రులను (అదనంగా 3,000 పడకలు) నెలకొల్పాలని, తద్వారా మొత్తం పడకల సంఖ్యను 7,500కు పెంచాలని నిర్ణయించారు. దీనికి అయ్యే పెట్టుబడిలో సగం మొత్తాన్ని అంతర్గత వనరులు, ఈక్విటీ పెట్టుబడి ద్వారా సమకూర్చుకుంటారు. మిగిలిన సగాన్ని బ్యాంకుల నుంచి అప్పు కొంత, మరికొంత విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) రూపంలో సేకరిస్తారు. ఈ విస్తరణను 2024 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డాక్టర్‌ అనిల్‌ కృష్ణ వెల్లడించారు. ఈ సంస్థలో స్వీడిష్‌ సంస్థ అయిన మెడికవర్‌కు ప్రస్తుతం 61 శాతం ఈక్విటీ వాటా ఉంది. ప్రతిపాదిత విస్తరణ కోసం కొంత మేరకు మూలధన నిధులు సమకూర్చేందుకు మెడికవర్‌ సిద్ధంగా ఉంది. దీనివల్ల మెడికవర్‌ హాస్పిటల్స్‌లో ఈ విదేశీ సంస్థ ఈక్విటీ వాటా ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

వచ్చే నెలలో నవీ ముంబయిలో 300 పడకల కొత్త ఆసుపత్రిని ప్రారంభించనున్నామని డాక్టర్‌ అనిల్‌ కృష్ణ తెలిపారు. దీనికి రూ.100 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. వచ్చే రెండేళ్లలో వరంగల్‌లో ఒక కొత్త ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్‌లో మరో రెండు ఆసుపత్రులు నెలకొల్పాలనే ఆలోచన ఉందని  అన్నారు. 2020 కేలండర్‌ ఏడాదిలో మెడికవర్‌ హాస్పిటల్స్‌ రూ.750 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఏడాదిలో రూ.1100 కోట్ల ఆదాయం ఉంటుందని అంచనా. వచ్చే ఏడాదిలో రూ.1600- 1800 కోట్ల ఆదాయాన్ని నమోదుచేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. బెంగళూరు, చెన్నై, పుణె వంటి మెట్రోలకు విస్తరించనుండటం, పడకల సంఖ్య పెంచుకుంటున్నందున ఆదాయంలో ఆమేరకు వృద్ధి ఉంటుందని వివరించారు. కొత్త ఆసుపత్రుల విస్తరణ కోసం మరో 5,000 మంది ఉద్యోగులను నియమించకుంటామని ఆయన తెలిపారు.

విస్తరణ తరవాతే ఐపీఓ ఆలోచన
పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) కు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా? అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ, ఇప్పటికి అయితే లేదని, ప్రతిపాదిత విస్తరణను వచ్చే మూడేళ్లలో పూర్తిచేసి ఆ తర్వాత ఐపీఓ చేసే అంశాన్ని పరిశీలిస్తామని వివరించారు. డయాగ్నొస్టిక్‌, ఫార్మా సేవలను మరింత విస్తృతం చేసే యోచనా ఉందన్నారు. ఔషధాల తయారీ, రిటైల్‌ రంగంలోకి ప్రవేశించే ప్రణాళికా ఉందని పేర్కొన్నారు. క్యాన్సర్‌, తల్లీపిల్లల వైద్యానికి ప్రత్యేక ఆసుపత్రులకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు.

ఆక్సిజన్‌ ప్లాంట్లు నిర్మిస్తున్నాం
‘ఒమిక్రాన్‌’ రూపంలో మూడో విడత కొవిడ్‌-19 ముప్పు ముంచుకొస్తున్న వైనంపై స్పందిస్తూ, టీకాతోనే దీని నుంచి రక్షణ కలుగుతుందని పేర్కొన్నారు. రెండు డోసుల టీకా పూర్తయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో బూస్టర్‌ కింద మూడో డోసు టీకా తీసుకోవడం మంచిదని సూచించారు. డెల్టా వేరియంట్‌తో ఎదురైన అనుభవంతో, 200 కంటే ఎక్కువ పడకలు ఉన్న ఆస్పత్రుల్లో సొంత ఆక్సిజన్‌ ప్లాంట్‌ నెలకొల్పాలని ప్రభుత్వం నిర్దేశించినందున, సొంత ఆక్సిజన్‌ ప్లాంట్లకు ఆర్డర్‌ ఇచ్చినట్లు డాక్టర్‌ అనిల్‌ కృష్ణ తెలిపారు. విశాఖపట్నం ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటు  ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని