సూచీలు ఉవ్వెత్తున ఎగిశాయ్‌

రెండు రోజుల వరుస అమ్మకాల తర్వాత సూచీలు ఉవ్వెత్తున ఎగిశాయి. కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రతపై ఆందోళనలు తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవడంతో.. సెన్సెక్స్‌, నిఫ్టీ అదే బాటలో నడిచాయి.

Published : 08 Dec 2021 02:23 IST
కలిసొచ్చిన అంతర్జాతీయ సంకేతాలు
ఒమిక్రాన్‌ తీవ్రతపై ఆందోళనలు తగ్గడం వల్లే
సమీక్ష

రెండు రోజుల వరుస అమ్మకాల తర్వాత సూచీలు ఉవ్వెత్తున ఎగిశాయి. కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రతపై ఆందోళనలు తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవడంతో.. సెన్సెక్స్‌, నిఫ్టీ అదే బాటలో నడిచాయి. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ ప్రమాద తీవ్రత తక్కువగా ఉండొచ్చన్న వార్తలు ఇందుకు దోహదం చేశాయి. లోహ, బ్యాంకింగ్‌ షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 75.44 వద్ద స్తబ్దుగా ముగిసింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు సానుకూలంగా కదలాడాయి.

* వరుస నష్టాల నుంచి సూచీలు కోలుకోవడంతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.3.45 లక్షల కోట్లు పెరిగి రూ.260.18 లక్షల కోట్లకు చేరింది.

* సెన్సెక్స్‌ ఉదయం 57,125.98 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం అదే జోరు కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 57,095.63 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 886.51 పాయింట్ల లాభంతో 57,633.65 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 264.45 పాయింట్లు రాణించి 17,176.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,987.75- 17,251.65 పాయింట్ల మధ్య కదలాడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 29 లాభపడ్డాయి. టాటా స్టీల్‌ 3.63%, యాక్సిస్‌ బ్యాంక్‌ 3.60%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 3.46%, కోటక్‌ బ్యాంక్‌ 2.74%, ఎస్‌బీఐ 2.43%, టైటన్‌ 2.39%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.13%, మారుతీ 2.06%, పవర్‌గ్రిడ్‌ 1.98%, హెచ్‌డీఎఫ్‌సీ 1.85%, నెస్లే 1.81%, టెక్‌ మహీంద్రా 1.58% రాణించాయి. ఏషియన్‌ పెయింట్స్‌ ఒక్కటే 0.22% తగ్గింది. అన్ని రంగాల వారీ సూచీలు మెరిశాయి. లోహ, స్థిరాస్తి, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, మన్నికైన వినిమయ వస్తువులు, చమురు- గ్యాస్‌, యుటిలిటీస్‌, వాహన రంగ సూచీలు 3.20% వరకు పరుగు తీశాయి. బీఎస్‌ఈలో 2300 షేర్లు లాభపడగా, 985 స్క్రిప్‌లు నష్టపోయాయి. 109 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

* రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ మొదటిరోజున 41 శాతం స్పందన లభించింది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.18 మధ్యంతర డివిడెండు చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు వేదాంతా గ్రూప్‌ సంస్థ హిందుస్థాన్‌ జింక్‌ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని