నవంబరులో కోటి మంది విమానమెక్కారు: ఇక్రా

దేశీయ విమాన ప్రయాణికుల రద్దీలో రికవరీ కొనసాగింది. కొవిడ్‌ పరిణామాలు ప్రారంభమయ్యాక, తొలిసారిగా ఒక నెల (నవంబరు)లో కోటి మంది ప్రయాణించారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఈ రికవరీని దెబ్బతీయవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. ఇంకా ఏమంటోందంటే..

Published : 08 Dec 2021 02:22 IST

ముంబయి: దేశీయ విమాన ప్రయాణికుల రద్దీలో రికవరీ కొనసాగింది. కొవిడ్‌ పరిణామాలు ప్రారంభమయ్యాక, తొలిసారిగా ఒక నెల (నవంబరు)లో కోటి మంది ప్రయాణించారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఈ రికవరీని దెబ్బతీయవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. ఇంకా ఏమంటోందంటే..

2020 ఫిబ్రవరిలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 1.23 కోట్లకు చేరగా, మరుపటి నెలలో కరోనా వచ్చింది. అప్పుడు నిలిపిన విమాన సేవలను ప్రారంభించిన తొలి నెల (2020 జూన్‌)లో 19.84 లక్షల మంది ప్రయాణించారు. అటుపైన రద్దీ పెరిగింది. కానీ రెండో దశ కరోనా సమయంలో అంటే 2021  మేలో 21.15 లక్షల మందే ప్రయాణించారు. ఈసారి కూడా రికవరీ వేగంగా పుంజుకోవడంతో గత నెలలో కోటి మందికి పైగా దేశీయ విమానాల్లో ప్రయాణించారు.

* 2020 నవంబరులో నమోదైన 63.54 లక్షల మందితో పోలిస్తే ఈ సంఖ్య 64 శాతం అధికం. ఈ ఏడాది అక్టోబరులో ప్రయాణించిన 89.8 లక్షల మందితో పోల్చినా 15-16 శాతం అధికమే.

* 2020 నవంబరుతో పోలిస్తే దేశీయ విమాన సర్వీసుల సంఖ్య కూడా 54,132 నుంచి 49 శాతం పెరిగి 80,750కు చేరింది. 2021 అక్టోబరుతో పోల్చినా నవంబరులో 12 శాతం అధికంగా డిపార్చర్లు నమోదయ్యాయి.

* నవంబరులో సగటు రోజువారీ డిపార్చర్లు ఏడాది క్రితం నాటి 1806 నుంచి 2700కు పెరిగాయి. 2021అక్టోబరులో ఇవి 2400గా ఉన్నాయి.

* నవంబరులో సగటున ఒక్కో విమానంలో 129 మంది ప్రయాణించగా.. అంతక్రితం నెల 125 మంది ఉన్నారు.

ఇవీ సమస్యలు..

కొత్త వేరియంట్‌ కారణంగా మళ్లీ లాక్‌డౌన్‌లు/షరతులు విధిస్తే దేశీయ విమానయాన రద్దీకి మళ్లీ విఘాతం కలగొచ్చని ఇక్రా ఉపాధ్యక్షుడు సుప్రియో బెనర్జీ అంచనా వేస్తున్నారు. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధర ఏడాది వ్యవధిలో 67.3 శాతం పెరగడమూ సంస్థలను కలవరపెడుతోంది. విమానాల సామర్థ్య వినియోగం తక్కువగా నమోదవుతుండడం కూడా 2021-22లో దేశీయ విమాన సంస్థల ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపొచ్చని ఇక్రా అంచనా వేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని