జియోస్పేషియల్‌లో 9.50 లక్షల ఉద్యోగాలు

భారతీయ జియోస్పేషియల్‌ విపణి 2025 నాటికి  రూ.63,100 కోట్లకు చేరే అవకాశం ఉందని ఇండియా జియోస్పేషియల్‌ ‘అర్థ’ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దీని పరిమాణం రూ.38,972 కోట్లుగా ఉండగా, 4.70 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు..

Published : 08 Dec 2021 02:22 IST

2025 కల్లా రూ.63,100 కోట్లకు విపణి

ఈనాడు, హైదరాబాద్‌: భారతీయ జియోస్పేషియల్‌ విపణి 2025 నాటికి  రూ.63,100 కోట్లకు చేరే అవకాశం ఉందని ఇండియా జియోస్పేషియల్‌ ‘అర్థ’ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దీని పరిమాణం రూ.38,972 కోట్లుగా ఉండగా, 4.70 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.. ఈ రంగంలో 2025 వరకు ఏటా 12.8 శాతం వృద్ధి నమోదై, ఉద్యోగాల సంఖ్య 9.50 లక్షలకు చేరుతుందని నివేదిక వివరించింది. ఈ నివేదికను మంగళవారం ఇక్కడ ప్రధానమంత్రి సలహాదారుడు అమిత్‌ ఖరే, ఇస్రోకి చెందిన విక్రమ్‌ సారాబాయ్‌ స్పేస్‌ సెంటర్‌ ప్రొఫెసర్‌ కిరణ్‌ కుమార్‌  సమక్షంలో విడుదల చేశారు.  నూతన జియోస్పేషియల్‌ విధానాలకు కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని, ఇవి అమల్లోకి వస్తే మనదేశంలో జియోస్పేషియల్‌ ఆర్థిక వ్యవస్థ ఏడాదిలోనే రెట్టింపు అవుతుందని కిరణ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. ప్రతి అంగుళం భూమిని గుర్తించి, కొలిచేందుకు జియోస్పేషియల్‌ సాంకేతిక పరిజ్ఞానం వీలుకల్పిస్తోందని, అనూహ్య మార్పులకు ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదపడినట్లు అమిత్‌ ఖరే పేర్కొన్నారు. దేశంలో టీకాల కార్యక్రమాన్ని అమలు చేయడంలో జియోస్పేషియల్‌ సాంకేతికత ఎంతోగానో ఉపయోగపడినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 4.70 లక్షలకు పైగా పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, వ్యక్తులు, ఎగుమతి సేవల్లో నిమగ్నమైన సంస్థలు ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుని వస్తు, సేవలు అందిస్తున్నాయని జియోస్పేషియల్‌ ‘అర్థ’ నివేదిక వెల్లడించింది. జియోస్పేషియల్‌ వ్యవస్థలో ప్రధానంగా జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జీఐఎస్‌), ఎర్త్‌ అబ్జర్వేషన్‌ (శాటిలైట్‌, ఏరియల్‌, స్ట్రీట్‌ ఇమేజరీ), స్కానింగ్‌ టూల్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ (లైడార్‌),  రాడార్‌ (గ్రౌండ్‌ పెనిట్రేటింగ్‌ రాడార్‌) సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇలా  సేకరించిన సమాచారాన్ని డిజిటల్‌ మ్యాప్స్‌, శాటిలైట్‌ ఇమేజింగ్‌ వంటి అవసరాలకు వినియోగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని