సంక్షిప్త వార్తలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు వరకు దివాలా చట్టం కింద 421 కేసులు పరిష్కారమయ్యాయి. వీటి విలువ రూ.2.55 లక్షల కోట్లు. మరో 1149 కేసులు లిక్విడేషన్‌కు వెళ్లాయి.

Published : 08 Dec 2021 02:22 IST

రూ.2.55 లక్షల కోట్ల విలువైన 421 దివాలా కేసుల పరిష్కారం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు వరకు దివాలా చట్టం కింద 421 కేసులు పరిష్కారమయ్యాయి. వీటి విలువ రూ.2.55 లక్షల కోట్లు. మరో 1149 కేసులు లిక్విడేషన్‌కు వెళ్లాయి. వీటి విలువ రూ.52,036 కోట్లుగా ఉందని ప్రభుత్వం మంగళవారం తెలిపింది. సెప్టెంబరు 30 నాటికి దివాలా చట్టం కింద మొత్తం 4708 కంపెనీలకు సంబంధించి కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ(సీఐఆర్‌పీ)ను ప్రారంభించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభకు సమాచారమిచ్చారు.


ప్రపంచ ఎల్‌పీజీ సంఘ అధ్యక్షుడిగా ఐఓసీ ఛైర్మన్‌  

దిల్లీ: ప్రపంచ ఎల్‌పీజీ సంఘం (డబ్ల్యూఎల్‌పీజీఏ) అధ్యక్షుడిగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ఛైర్మన్‌ ఎస్‌ఎం వైద్య ఎన్నికయ్యారు. 125కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 300కు పైగా సభ్యులతో కూడిన అంతర్జాతీయ ఎల్‌పీజీ నెట్‌వర్క్‌కు ఈ సంఘం ప్రాతినిథ్యం వహిస్తోంది. పారిస్‌లో డబ్ల్యూఎల్‌పీజీఏ ప్రధాన కార్యాలయం ఉంది. ఎల్‌పీజీకి గిరాకీ పెంచడం ద్వారా ఈ రంగానికి అదనపు విలువ పెంచడమే ఈ సంఘం ప్రాథమిక లక్ష్యం. దుబాయ్‌లో జరిగిన ప్రపంచ ఎల్‌పీజీ ఫోరం 2021లో డబ్ల్యూఎల్‌పీజీఏ జనరల్‌ అసెంబ్లీ ఎస్‌ఎం వైద్యను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఐఓసీ వెల్లడించింది. డబ్ల్యూఎల్‌పీజీఏ బృందంలో డైరెక్టర్ల బోర్డు, పరిశ్రమ కౌన్సిల్‌ ఉంటాయి. బోర్డులో అధ్యక్షుడు, ఒక ఫస్ట్‌ ఉపాధ్యక్షుడు, కోశాధికారి, ముగ్గురు ఉపాధ్యక్షులు, అయిదుగురు వరకు బోర్డు సభ్యులు ఉంటారు. డబ్ల్యూఎల్‌పీజీఏలో ఐఓసీకి ‘ఏ’ కేటగిరీ సభ్యత్వం, పరిశ్రమ కౌన్సిల్‌ సభ్యత్వం కొనసాగుతున్నాయి.


నియంత్రణ సంస్థలకు మదుపర్ల కేవైసీ వివరాలు
క్రిప్టో బిల్లులో చేర్చే అవకాశం

దిల్లీ: సెబీ, ఆర్‌బీఐ, ఆదాయపు పన్ను విభాగం వంటి నియంత్రణ సంస్థలకు మదుపర్ల వివరాలు (కేవైసీ)ను క్రిప్టో ఎక్స్ఛేంజీలు కచ్చితంగా తెలియజేసే నిబంధనను క్రిప్టోకరెన్సీ బిల్లులో పెట్టే అవకాశం ఉంది. క్రిప్టో ఫ్లాట్‌ఫామ్‌ల వారీ లావాదేవీల గుర్తింపు, బ్యాంక్‌ డిపాజిట్లతో పోల్చడం, లాభాలు, ఇతర అంశాలను పరిశీలించడానికి నియంత్రణ సంస్థలు మదుపర్ల కేవైసీ వివరాలను వినియోగించుకోవచ్చని ఒక ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఎక్స్ఛేంజీలు అన్నింటికీ ఒకే కేవైసీ ప్రక్రియను తీసుకొచ్చే ప్రతిపాదనను  బిల్లులో చేర్చనున్నారు. ప్రస్తుతం వివిధ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలకు సొంత కేవైసీ ప్రక్రియలు ఉన్నాయి. సరైన కేవైసీ మార్గదర్శకాలు లేకుంటే.. క్రిప్టో మదుపర్లు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు నిర్వహించే అవకాశం ఉందని, పలు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల్లోని నగదును వినియోగించుకోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే క్రిప్టోకరెన్సీ నియంత్రణ బిల్లు ఆమోదానికి వచ్చే అవకాశం ఉంది.


రికార్డుల నుంచి 3.96 లక్షల కంపెనీల తొలగింపు

కంపెనీల చట్టం కింద నిబంధనలు పాటించని 3.96 లక్షలకు పైగా సంస్థలను అధికారిక రికార్డుల నుంచి గత అయిదు ఆర్థిక సంవత్సరాల్లో తొలగించారు. గత ఆర్థిక సంవత్సరంలోనూ 12,892 సంస్థలను లెక్కల్లో నుంచి తీసేసినట్లు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ రాజ్యసభకు తెలిపారు. ఇలా రికార్డుల నుంచి తొలగించిన సంస్థల సంఖ్య 2019-20లో 2,933; 2018-19లో 1,38,446; 2017-18లో 2,34,371, 2016-17లో 7,943గా ఉన్నట్లు ఆయన వివరించారు. వరుసగా రెండు ఆర్థిక సంవత్సరా పాటు వ్యాపారం, కార్యకలాపాలు నిర్వహించడం లేదని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ) పరిశీలనలో తేలితేనే ఇలా చేస్తారు.


ఏడో దశ ల్యాబ్‌32లో 23 అంకురాలు: టి-హబ్‌

ఈనాడు, హైదరాబాద్‌: అంకురాలకు ప్రోత్సాహం అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ల్యాబ్‌32 కార్యక్రమం ఏడో దశ కోసం 23 అంకురాలను ఎంపిక చేసినట్లు టి-హబ్‌ వెల్లడించింది. మూడు నెలల పాటు సాగే యాక్సిలేటర్‌ హైబ్రిడ్‌ ప్రోగ్రాం మంగళవారం ప్రారంభమైంది. మార్చిలో ఇది ముగుస్తుందని టి-హబ్‌ సీఈఓ ఎం.శ్రీనివాస రావు తెలిపారు.


ఆర్‌ఈసీ సోలార్‌ హోల్డింగ్స్‌ కొనుగోలుకు రూ.5,500 కోట్ల రుణం

దిల్లీ: సౌరవిద్యుదుత్పత్తికి ఉపకరించే ప్యానెళ్లను తయారు చేసే నార్వే సంస్థ ఆర్‌ఈసీ సోలార్‌ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) 73.6 కోట్ల డాలర్ల (సుమారు రూ.5,500 కోట్ల) రుణాన్ని (గ్రీన్‌ లోన్‌) 5 బ్యాంకుల నుంచి తీసుకుంది. ఏఎన్‌జెడ్‌, క్రెడిట్‌ అగ్రికోల్‌, డీబీఎస్‌ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ, ఎంయూఎఫ్‌జీలు ఈ రుణాన్ని సమకూర్చాయని ఆర్‌ఐఎల్‌ తెలిపింది. ఈ రుణంలో 25 కోట్ల డాలర్లను 6 ఏళ్ల రుణంగా, 15 కోట్ల డాలర్లను వర్కింగ్‌ కేపిటల్‌గా, 33.6 కోట్ల డాలర్లను 5 ఏళ్ల బ్యాంక్‌ గ్యారెంటీగా విభజించినట్లు పేర్కొంది. ఏఎన్‌జెడ్‌, ఎంయూఎఫ్‌జీలు చెరో 7 కోట్ల డాలర్లను టర్మ్‌ రుణంగా ఇచ్చాయి. డీబీఎస్‌, హెచ్‌ఎస్‌బీసీలు చెరో 4 కోట్ల డాలర్లు, క్రెడిట్‌ అగ్రికోల్‌ 3 కోట్ల డాలర్లను టర్మ్‌ రుణాలుగా ఇచ్చాయని ఆర్‌ఐఎల్‌ తెలిపింది. వర్కింగ్‌ కేపిటల్‌ రుణాన్ని డీబీఎస్‌, హెచ్‌ఎస్‌బీసీ, ఎంయూఎఫ్‌జీ సమానంగా ఇవ్వగా, బ్యాంక్‌ గ్యారెంటీలను డీబీఎస్‌, హెచ్‌ఎస్‌బీసీలు సదుపాయాన్ని సమానంగా ఇచ్చాయి. సింగపూర్‌కు చెందిన ఆర్‌ఈసీ సోలార్‌ రుణ గ్రహీతగా ఉండగా, కొనుగోలు చేస్తున్న రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌ హామీదారుగా ఉండనుంది. రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌ గత అక్టోబరులో చైనా నేషనల్‌ బ్లూస్టార్‌ (గ్రూప్‌) కంపెనీ నుంచి ఆర్‌ఈసీ గ్రూప్‌ను 77.1 కోట్ల డాలర్లతో (సుమారు రూ.5,800 కోట్లు) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని