
2021-22లో భారత వృద్ధి 8.4%
అంచనాలను తగ్గించిన ఫిచ్
దిల్లీ: కొవిడ్-19 రెండో దశ పరిణామాల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన స్థాయిలో పుంజుకోవడం లేదని పేర్కొంటూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను ఫిచ్ రేటింగ్స్ తగ్గించింది. జీడీపీ వృద్ధి 8.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇంతకుమునుపు 8.7 శాతం వృద్ధి రేటును సంస్థ అంచనా వేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను 10 శాతం నుంచి 10.3 శాతానికి పెంచింది. ‘సెప్టెంబరులో గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో మేం అంచనా వేసిన దానితో పోలిస్తే ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం మరీ స్తబ్దుగా ఉంది. సేవా రంగ పనితీరులోనూ పురోగతి బలహీనంగా ఉంది. సరఫరా సమస్యలు తయారీ రంగ వృద్ధికి అవరోధాలుగా మారాయ’ని ఫిచ్ రేటింగ్స్ విశ్లేషించింది. రానున్న నెలల్లో సరఫరా అవరోధాలు తొలుగుతాయని భావిస్తున్నట్లు తెలిపింది. చాలా దేశాల్లో ఆంక్షలు తొలగడంతో సేవల రంగం బలంగా పుంజుకుంటుందని అంచనా వేస్తున్నామని పేర్కొంది. ప్రజలందరికీ టీకాలు వేయడం పూర్తయితే భవిష్యత్‌లో కొవిడ్-19 మలివిడత వ్యాప్తి ముప్పు తగ్గుతుందని, వినియోగదారు విశ్వాసం పెరిగేందుకు ఇది దోహదం చేస్తుందని ఫిచ్ అభిప్రాయపడింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.