భారత్‌లో మెటా అతిపెద్ద కార్యాలయం

వచ్చే మూడేళ్లలో భారత్‌లో కోటి మంది చిన్న వ్యాపారులకు, 2,50,000 మంది సృజనకారులకు శిక్షణ ఇచ్చే యోచనలో ఉన్నట్లు మెటా (ఇంతకుమునుపు ఫేస్‌బుక్‌) వెల్లడించింది. దిల్లీ- ఎన్‌సీఆర్‌లో బుధవారం ప్రారంభించిన ...

Published : 09 Dec 2021 01:53 IST

 చిన్న వ్యాపారులు, సృజనకారులకు నైపుణ్య శిక్షణ

గురుగ్రామ్‌: వచ్చే మూడేళ్లలో భారత్‌లో కోటి మంది చిన్న వ్యాపారులకు, 2,50,000 మంది సృజనకారులకు శిక్షణ ఇచ్చే యోచనలో ఉన్నట్లు మెటా (ఇంతకుమునుపు ఫేస్‌బుక్‌) వెల్లడించింది. దిల్లీ- ఎన్‌సీఆర్‌లో బుధవారం ప్రారంభించిన అతిపెద్ద కార్యాలయాన్ని ఇందుకు ఉపయోగించుకుంటామని పేర్కొంది. సెంటర్‌ ఫర్‌ ఫ్యూయలింగ్‌ ఇండియాస్‌ న్యూ ఎకానమీ (సీఎఫ్‌ఐఎన్‌ఈ)గా వ్యవహరించే ఈ బహుళ కార్యకలాపాల కార్యాలయం.. ఆసియాలో మెటాకున్న అతిపెద్ద కార్యాలయాల్లో ఒకటి. 1.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేసింది. ఆసియాలో మెటాకు ఇదే తొలి స్టాండలోన్‌ (విడిగా ఏర్పాటైన) కార్యాలయం. అమెరికాలోని మెన్లో పార్క్‌ వద్ద ఉన్న మెటా ప్రధాన కార్యాలయాన్ని ఇది పోలి ఉంటుంది. ఇందులో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ నుంచి వివిధ బృందాలు పనిచేయనున్నాయి. మెటా భారత్‌లో తన తొలి కార్యాలయాన్ని 2010లో హైదరాబాద్‌లో నెలకొల్పింది. ‘ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు భారత్‌ కేవలం అతిపెద్ద విపణే కాదు.. ఇంటర్నెట్‌ స్వరూపాన్ని ఎన్నో రకాలుగా మార్చగల వేదిక. మేం ఈ కార్యాలయాన్ని దేశంలో ఓ అతిపెద్ద కంపెనీ బృందానికి నిలయంగా మాత్రమే మేం చూడటం లేదు. ప్రపంచం మొత్తంతో లోతుగా అనుసంధానం అయ్యేందుకు ఉపయోగపడే ఒక వేదికను తీర్చిదిద్దే అవకాశంగా దీనిని భావిస్తున్నామ’ని ఫేస్‌బుక్‌ ఇండియా (మెటా) వైస్‌ ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టరు అజిత్‌ మోహన్‌ తెలిపారు. ఈ కొత్త కార్యాలయం ద్వారా రాబోయే మూడేళ్లలో కోటి మంది చిన్న వ్యాపారులకు, 2,50,000 మంది క్రియేటర్లకు శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.

మానవ ఆరోగ్యం పరిశోధనలపై రూ.25,500 కోట్ల పెట్టుబడి..

మానవ ఆరోగ్యంపై పరిశోధనల నిమిత్తం రాబోయే 10 నుంచి 15 ఏళ్లలో 3.4 బిలియన్‌ డాలర్లను (సుమారు రూ.25500 కోట్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్లు ద చాన్‌ జుకర్‌బర్‌ ఇనిషియేటివ్‌ (సీజెడ్‌ఐ) తెలిపింది. సీజెడ్‌ఐ.. ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌, ఆయన భార్య ప్రిసిలా చాన్‌ల దాతృత్వ సంస్థ. శతాబ్దం చివరినాటికి అన్ని రకాల వ్యాధులకు చికిత్స, నియంత్రణ, నిర్వహణ లక్ష్యాన్ని ఈ సంస్థ నిర్దేశించుకుంది. ఈ లక్ష్య సాధనకు తోడ్పడే కొత్త పరిశోధనల అభివృద్ధి, ఇన్‌స్టిట్యూట్‌లు, సాంకేతికతలపై రాబోయే 10 ఏళ్లు పనిచేసేందుకు దృష్టి పెట్టనున్నట్లు తెలిపింది. కృత్రిమ మేధపై దృష్టి పెట్టే ఓ విద్యా సంస్థను హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసేందుకు 500 మిలియన్‌ డాలర్లు కేటాయించనున్నట్లు సీజెడ్‌ఐ అధికార ప్రతినిధి జెప్‌ మ్యాక్‌గ్రెగర్‌ తెలిపారు. జుకర్‌ బర్గ్‌ మాతృమూర్తి కరెన్‌ కెంప్‌నర్‌ జుకర్‌బర్గ్‌ పేరుతో ఏర్పాటు చేసే ఈ సంస్థకు 15 ఏళ్లపాటు నిధులు అందిస్తామని పేర్కొన్నారు. సీజెడ్‌ఐ వద్ద కొత్త బయోమెడికల్‌ ఇమేజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోసం 600- 900 మిలియన్‌ డాలర్లు, చాన్‌ జుకర్‌బర్గ్‌ బయోహబ్‌ నెట్‌వర్క్‌కు 1 బిలియన్‌ డాలర్లు చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. వ్యాధుల చికిత్సకు ఉపయోగపడే సాంకేతికతల అభివృద్ధిపై పనిచేసేందుకు చాన్‌ జుకర్‌బర్గ్‌ బయోహబ్‌కు 10 ఏళ్ల పాటు మరో 800 మిలియన్‌ నుంచి 1 బిలియన్‌ డాలర్లు అందజేయనున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని