విద్యుత్తు వాహనాల కోసం

విద్యుత్‌ వాహనాలు (ఈవీ), తక్కువ కర్బన పరిష్కారాల నిమిత్తం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్రిటన్‌కు చెందిన బీపీల సంయుక్త సంస్థ రిలయన్స్‌ బీపీ మొబిలిటీ లిమిటెడ్‌ (ఆర్‌బీఎంఎల్‌) మహీంద్రా గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

Published : 09 Dec 2021 01:53 IST

జియో-బీపీ, మహీంద్రా జట్టు

దిల్లీ: విద్యుత్‌ వాహనాలు (ఈవీ), తక్కువ కర్బన పరిష్కారాల నిమిత్తం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్రిటన్‌కు చెందిన బీపీల సంయుక్త సంస్థ రిలయన్స్‌ బీపీ మొబిలిటీ లిమిటెడ్‌ (ఆర్‌బీఎంఎల్‌) మహీంద్రా గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. త్రిచక్ర వాహనాలకు బ్యాటరీ మార్పిడి సాంకేతికతపై ఈ సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఈవీ ఉత్పత్తులు, సేవల సృష్టిపై పనిచేయడంతో పాటు తక్కువ కర్బన, సంప్రదాయ ఇంధనాల్లో పరిష్కారాలను గుర్తించడం కోసం కూడా రిలయన్స్‌ బీపీ మొబిలిటీ, మహీంద్రా గ్రూప్‌ల మధ్య అవగాహన ఒప్పందం(ఎమ్‌ఓయూ) కుదిరింది. మహీంద్రాకు చెందిన విద్యుత్‌ త్రిచక్ర, నాలుగు చక్రాలు, క్వాడ్రిసైకిళ్లు, ఇ-ఎస్‌సీవీ(4 టన్నుల్లోపు చిన్న వాణిజ్య వాహనాలు)లకు ఛార్జింగ్‌ సొల్యూషన్లను జియో-బీపీలు అందించనున్నాయి. ఇరు కంపెనీల బలాలను ఈవీ ఉత్పత్తులు, సేవలపై వినియోగించడానికి ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇటీవలే జియో-బీపీ తన తొలి మొబిలిటీ స్టేషన్‌ను నెలకొల్పింది. మొబిలిటీ యాజ్‌ ఏ సర్వీస్‌(మాస్‌), బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌(బాస్‌) వంటి వ్యాపార నమూనాలను ఈ భాగసామ్యం పరిశీలించనుంది. భారత్‌లో విద్యుత్‌ వాహనాల వాడకాన్ని వేగవంతం చేసేందు కోసం అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీల మార్పిడిని ఈ భాగస్వామ్యం లక్ష్యంగా చేసుకుంది.


2023 మార్చికి రూ.10-15 లక్షల్లో విద్యుత్‌ కారు

 ఎంజీ మోటార్‌ ఇండియా

దిల్లీ: 2023 మార్చి కల్లా  రూ.10-15 లక్షల్లో విద్యుత్‌ కారును విపణిలోకి తీసుకొస్తామని ఎంజీ మోటార్‌ ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ విద్యుత్‌ ఎస్‌యూవీ జెడ్‌ఎస్‌ ఈవీలను విక్రయిస్తోంది. తదుపరి కొత్త ఉత్పత్తిగా భారతీయ విపణికి సరిపోయేలా అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్‌పై విద్యుత్‌ క్రాస్‌ఓవర్‌ కారును తీసుకొస్తామని ఎంజీ మోటార్‌ ఇండియా ప్రెసిడెంట్‌, ఎండీ రాజీవ్‌ చాబా వెల్లడించారు. రూ.10-15 లక్షల మధ్య వ్యక్తిగత విద్యుత్‌ వాహనం తీసుకొస్తే ఎక్కువ మంది కొనుగోలుదార్లను ఆకర్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

* ఎంజీ మోటార్‌ జెడ్‌ఎస్‌ ఈవీ రెండు వేరియంట్ల ధరల శ్రేణి రూ.21-24.68 లక్షలుగా ఉంది. కంపెనీ వద్ద 2,000కు పైగా ఆర్డర్లు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. సెమీ కండక్టర్ల కొరతతో నెలకు 250-300 వాహనాలనే సరఫరా చేయగలుగుతున్నామని కంపెనీ తెలిపింది. ఫిబ్రవరి నుంచి నెలకు 500-600 కార్లను వినియోగదార్లకు అందిస్తామని రాజీవ్‌ చాబా వెల్లడించారు.


రూ.4,000 కోట్లతో 6 విద్యుత్‌ వాహనాలు: హ్యుందాయ్‌

దిల్లీ: దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుందాయ్‌ 2028 కల్లా 6 విద్యుత్‌ వాహనాలను భారత విపణిలో విడుదల చేయాలని అనుకుంటోంది. ఇందుకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ), తయారీ కార్యకలాపాలపై సుమారు రూ.4,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న మోడళ్లతో పాటు, కొత్త మోడళ్లలోనూ విద్యుత్‌ వాహనాలు తీసుకొస్తామంది. ఇందులో మొదటి వాహనాన్ని 2022లో విడుదల చేసే అవకాశం ఉందని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఎండీ, సీఈఓ ఎస్‌ ఎస్‌ కిమ్‌ తెలిపారు. వాహనాల తయారీతో పాటు ఇంటెలిజెంట్‌ టెక్నాలజీ, సుస్థిరత, వినూత్నతలపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. భారత్‌లో బ్యాటరీ వాహనాల కోసం ప్రత్యేకమైన బీఈవీ ప్లాట్‌ఫాం.. ‘ఈ-జీఎంపీ’తో పాటు మరికొన్ని నవీకరించిన ప్లాట్‌ఫాంలను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ప్రస్తుతం భారత్‌లో ఒకే విద్యుత్‌ వాహనాన్ని (కోనా ఎలక్ట్రిక్‌) హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా విక్రయిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు