దుమ్మురేపిన సూచీలు

వరుసగా రెండో రోజూ మార్కెట్‌ ఉరకలేసింది. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో సర్దుబాటు ధోరణిని కొనసాగించడం, కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాలు తగ్గుముఖం పట్టడం మదుపర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది.

Updated : 09 Dec 2021 06:06 IST

కలిసొచ్చిన ఆర్‌బీఐ నిర్ణయాలు.. అంతర్జాతీయ సంకేతాలు

రూ.3.96 లక్షల కోట్లు పెరిగిన సంపద

వరుసగా రెండో రోజూ మార్కెట్‌ ఉరకలేసింది. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో సర్దుబాటు ధోరణిని కొనసాగించడం, కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాలు తగ్గుముఖం పట్టడం మదుపర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. సెన్సెక్స్‌ 1016 పాయింట్ల లాభాన్ని నమోదుచేయగా, నిఫ్టీ మళ్లీ 17400 పాయింట్ల ఎగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు మద్దతుగా నిలిచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి దాదాపు 2 నెలల కనిష్ఠమైన 75.50 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.

* సూచీల జోరు నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ రూ.3.96 లక్షల కోట్లు పెరిగి రూ.264.15 లక్షల కోట్లకు చేరింది.

సెన్సెక్స్‌ ఉదయం 58,158.56 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై, ఇంట్రాడేలో 58,702.65 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1016.03 పాయింట్ల లాభంతో 58,649.68 వద్ద ముగిసింది. ఈ ఏడాది మార్చి 30 (1128 పాయింట్ల లాభం) తర్వాత సెన్సెక్స్‌కు ఇదే అతిపెద్ద ఒకరోజు లాభం. నిఫ్టీ 293.05 పాయింట్లు దూసుకెళ్లి 17,469.75 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,484.60 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది.

* టాజిజ్‌తో కలిసి 200 కోట్ల డాలర్ల పెట్టుబడితో సంయుక్త సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు పరుగులు తీసింది. ఇంట్రాడేలో 2.09% లాభపడిన షేరు         రూ.2431.45 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు 1.5% లాభంతో రూ.2417.4 వద్ద ముగిసింది.

* నవంబరులో ఉక్కు ఉత్పత్తి 10 శాతం పెరగడంతో జిందాల్‌ స్టీల్‌ షేరు 3.67% రాణించి   రూ.381.50 దగ్గర స్థిరపడింది.

* వుచి మీడియాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించడంతో బ్రైట్‌కామ్‌ గ్రూప్‌ షేరు 4.98% దూసుకెళ్లి రూ.145.5 వద్ద అప్పర్‌సర్క్యూట్‌ను తాకి, అక్కడే ముగిసింది.

28 షేర్లకు లాభాలు

సెన్సెక్స్‌ 30 షేర్లలో 28 లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ అత్యధికంగా 3.67% పెరిగింది. మారుతీ 3.48%, ఎస్‌బీఐ 3.11%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.01%, ఏషియన్‌ పెయింట్స్‌ 2.57%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.55%, ఇన్ఫోసిస్‌ 2.37%, భారతీ ఎయిర్‌టెల్‌ 2.31%, టాటా స్టీల్‌ 2.09%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.08% చొప్పున మెరిశాయి.  కోటక్‌ బ్యాంక్‌ 0.85%, పవర్‌గ్రిడ్‌ 0.49% మాత్రం డీలాపడ్డాయి.

* రంగాల వారీ సూచీల్లో.. వాహన, టెక్‌, టెలికాం, ఐటీ, లోహ 2.24% వరకు రాణించాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1.50% వరకు పెరిగాయి.

* బీఎస్‌ఈలో 2313 షేర్లు లాభాల్లో ముగియగా, 980 స్క్రిప్‌లు నష్టపోయాయి. 118 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని