ప్రపంచమే భారత్‌ వైపు చూస్తోంది

5జీ, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ వంటి కొత్త తరం విభాగాల్లో అందుబాటు ధరలో, స్థిరమైన సాంకేతికత సొల్యూషన్ల కోసం ప్రపంచమంతా భారత్‌ వైపే చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బుధవారం...

Published : 09 Dec 2021 01:54 IST

 అందుబాటు ధరలో సాంకేతిక సొల్యూషన్లే లక్ష్యం

ప్రధాన మంత్రి మోదీ 

వేగంగా 5జీ : ముకేశ్‌

కలిసి పనిచేస్తే టారిఫ్‌లు తగ్గుతాయ్‌: మిత్తల్‌

దిల్లీ: 5జీ, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ వంటి కొత్త తరం విభాగాల్లో అందుబాటు ధరలో, స్థిరమైన సాంకేతికత సొల్యూషన్ల కోసం ప్రపంచమంతా భారత్‌ వైపే చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌(ఐఎమ్‌సీ)నుద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకురావడం కోసం భారత్‌ తన సామర్థ్యాలను ఎలా వినియోగిస్తుందన్నదే కీలకం. డిజిటల్‌ సత్తా అసమానం. ఆరోగ్యసంరక్షణ, విద్య, వ్యవసాయం, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ వంటి రంగాలను సైతం మెరుగుపరచడానికి మన వినూత్నత, సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలన్నదానిపై ప్రణాళికలు రచించుకోవాల’ని సూచించారు.

6జీ సాంకేతికతపైనా దృష్టి: మంత్రి వైష్ణవ్‌

అంతర్జాతీయ ప్రమాణాలకు చేరేందుకు టెలికాంలో మరిన్ని సంస్కరణలు చేపట్టేందుకు సూచనలు కోరుతున్నట్లు టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్‌ పేర్కొన్నారు. 6జీ సాంకేతికత అభివృద్ధి కోసం టెలికాం విభాగం ఒక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సొంతంగా రూపకల్పన చేసి, అభివృద్ధి పరచిన 4జీ నెట్‌వర్క్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు కమ్యూనికేషన్ల సహాయ మంత్రి దేవసిన్హ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.


రాయితీపై స్మార్ట్‌ఫోన్లకు యూఎస్‌ఓ నిధి: అంబానీ

డిజిటల్‌ విప్లవాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఎంపిక చేసిన ఆదాయ వర్గాలకు స్మార్ట్‌ఫోన్లను సబ్సిడీపై ఇవ్వడానికి యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌(యూఎస్‌ఓ) నిధిని వినియోగించుకోవాలని రిలయన్స్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ సూచించారు. జాతీయ ప్రాధాన్యం కింద బ్రాడ్‌బ్యాండ్‌ సెల్యులార్‌ నెట్‌వర్క్‌ల కోసం భారత్‌ 5జీ సేవలను అందించాలని ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు. టెలికాం కంపెనీలు చెల్లించే లైసెన్సు ఫీజులో 5 శాతం వాటా యూఎస్‌ఓ ఫండ్‌కు వెళుతోంది. దీని ద్వారా గ్రామీణ, సుదూర ప్రాంతాల్లో టెలికాం సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిధిలో సగం కంటే తక్కువే వినియోగిస్తున్నారని కాగ్‌ పేర్కొనడం గమనార్హం. 2జీ నుంచి 4జీకి, 4జీ నుంచి 5జీకి మారడాన్ని వేగంగా అమలు చేయాల్సి ఉందని ముకేశ్‌ అభిప్రాయపడ్డారు.


వ్యాజ్యాలను తగ్గించాలి: సునీల్‌ మిత్తల్‌

టెలికాం రంగంలో తాజా వ్యాజ్యాలు తలెత్తకుండా నియంత్రణపరమైన నిబంధనలను సరళతరం చేయాలని భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ అభిప్రాయపడ్డారు. పరిశ్రమకున్న పూర్తి సత్తాను వెలికితీయాలంటే సుంకాలు, స్పెక్ట్రమ్‌ ధర తగ్గించాలన్నారు. 5జీ, 6జీ అనుసంధానతపై దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. టెల్కోలు మౌలిక వసతులను పంచుకుంటే వ్యయాలు తగ్గి, ప్రపంచంలోనే అతి తక్కువ టారిఫ్‌లతో సేవలందించవచ్చని సూచించారు.


బ్యాంకింగ్‌ తోడ్పాటు పెరగాలి: కుమార మంగళం బిర్లా

బ్యాంకింగ్‌ రంగ తోడ్పాటు పెరిగితే టెలికాం రంగం మరింత బలోపేతం అవుతుందని ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. టెక్నాలజీలో భారత్‌ ముందుండేందుకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు. భారత్‌ లక్ష కోట్ల డాలర్ల డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో వొడాఫోన్‌ ఐడియా నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని హామీ ఇచ్చారు. 2025కి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించేందుకు మొబైల్‌ పరిశ్రమ చాలా కీలకమని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని