మన ఆరోగ్యమే మనకు రాయితీగా

కొవిడ్‌-19 తర్వాత ఆరోగ్య బీమా పాలసీలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే బీమా సంస్థలూ పాలసీదారులను ఆకట్టుకునేందుకు పలు కొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చాయి. ఆరోగ్యకరమైన జీవన శైలి ఉన్నవారికి ప్రోత్సాహకాలను,

Updated : 11 Dec 2021 08:37 IST

కొవిడ్‌-19 తర్వాత ఆరోగ్య బీమా పాలసీలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే బీమా సంస్థలూ పాలసీదారులను ఆకట్టుకునేందుకు పలు కొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చాయి. ఆరోగ్యకరమైన జీవన శైలి ఉన్నవారికి ప్రోత్సాహకాలను, రివార్డులను అందించడం ఇందులో ఒకటి. వీటివల్ల ఎంత మేరకు ప్రయోజనమన్నది చూద్దామా..

వైద్య బీమా పాలసీ కొనుగోలు చేసినప్పుడు.. ఆరోగ్య సంరక్షణ కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను బీమా సంస్థలు తీసుకొస్తున్నాయి. వీటిని ఎలాంటి అదనపు భారం లేకుండా అందిస్తున్నాయి. మంచి అలవాట్లతో ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకునేందుకు ప్రేరణ కలిగిస్తున్నాయి.

వ్యాయామం చేస్తే రాయితీ..

పాలసీదారులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం, నడక, పరుగు, సైకిల్‌ తొక్కడం వంటివి చేసినప్పుడు వారికి బీమా సంస్థలు కొన్ని రివార్డు పాయింట్లను కేటాయిస్తాయి. వీటి ఆధారంగా పునరుద్ధరణ వేళలో ప్రీమియంలో రాయితీని అందిస్తున్నాయి. ఔట్‌ షేషెంట్‌ కన్సల్టేషన్లు, వైద్య పరీక్షలు, ఔషధాల బిల్లులో రాయితీ కోసమూ వీటిని వాడుకోవచ్చు. కొన్ని బీమా సంస్థలు ఈ పాయింట్లను పలు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వినియోగించే వెసులుబాటునూ కల్పిస్తున్నాయి.

కోచ్‌ల సహాయంతో..

కొన్ని బీమా సంస్థలు పాలసీదారుల కోసం ప్రత్యేకంగా వెల్‌నెస్‌ కోచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీరు ఆహారం, వ్యాయామం, మానసిక ఆరోగ్యం, శరీర బరువు నిర్వహణ ఇలా పలు అంశాల్లో పాలసీదారులకు ఎప్పుటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తుంటారు. కోచ్‌లు సూచించిన విధంగా నడుచుకున్న వారికి బీమా సంస్థలు రివార్డు పాయింట్లను కేటాయిస్తాయి. దీంతోపాటు ఇతర కొన్ని ప్రయోజనాలూ అందిస్తున్నాయి.

రెండో వైద్యుని సలహా...

చికిత్సకు సంబంధించి రెండో వైద్యుడి సలహా తీసుకునేందుకూ బీమా సంస్థలు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అదీ ఎలాంటి అదనపు ప్రీమియం వసూలు చేయకుండా పాలసీలో భాగంగానే అందిస్తున్నాయి. శస్త్రచికిత్సలు, కొన్ని ప్రత్యేక వ్యాధులకు సంబంధించిన చికిత్సల సమయంలో మరో వైద్యుని సలహాలు తీసుకోవడం (సెకండ్‌ ఒపీనియన్‌) వల్ల మెరుగైన చికిత్స అందుకునేందుకు వీలవుతుంది. ఈ సేవలను పొందేందుకు నిర్ణీత దరఖాస్తు పత్రాన్ని నింపి, వైద్య పరీక్షల నివేదికలను జత చేయాలి. కొన్నిసార్లు బీమా సంస్థ మొబైల్‌ యాప్‌ ద్వారానే ఈ సేవలు పొందవచ్చు.

మన దేశంలో మొత్తం మరణాల్లో దాదాపు 25 శాతం వరకూ జీవన శైలి వ్యాధుల వల్లే అని నివేదికలు చెబుతున్నాయి. ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల ఇలాంటి ముప్పును తగ్గించుకోవచ్చు. ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఇలాంటి ప్రత్యేక పథకాలతో వస్తున్న వాటిని ఎంచుకోవడం వల్ల పాలసీదారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రీమియంలోనూ రాయితీ లభిస్తుంది.

- సంజయ్‌ దత్తా, చీఫ్‌-క్లెయిమ్స్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని