నెలనెలా... పొదుపు పెరగాలి...

డబ్బు సంపాదించడం కోసం అందరూ కష్టపడతారు. కానీ, ఆ డబ్బును పొదుపు చేసే విషయంలో మాత్రం కొద్దిమందే శ్రద్ధ చూపిస్తారు. అందుకే, వేతనం అందిన ఒకటి రెండు వారాల్లోనే మొత్తం డబ్బు ఖర్చయిపోతుంది.

Updated : 11 Dec 2021 08:39 IST

డబ్బు సంపాదించడం కోసం అందరూ కష్టపడతారు. కానీ, ఆ డబ్బును పొదుపు చేసే విషయంలో మాత్రం కొద్దిమందే శ్రద్ధ చూపిస్తారు. అందుకే, వేతనం అందిన ఒకటి రెండు వారాల్లోనే మొత్తం డబ్బు ఖర్చయిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితికి చేరుకుంటారు. నిజానికి డబ్బు విషయంలో నిర్వహణపరమైన లోపమే ఇందుకు కారణం. దీన్ని అధిగమిస్తూ.. నెలనెలా పొదుపు మొత్తాన్ని పెంచుకునేందుకు పాటించాల్సిన సూత్రాలేమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

అలవాట్లకే అధిక మొత్తం..

ప్రతి వ్యక్తికీ కొన్ని అలవాట్లు ఉంటాయి. ఒకరు ఎప్పుడు ఏదో ఒకటి కొంటూనే ఉంటారు. మరొకరు బయట ఆహార పదార్థాలను భుజిస్తుంటారు. ఈ అలవాట్లు కొన్నిసార్లు వ్యసనాలుగానూ మారుతుంటాయి. వీటికే మన సంపాదనలో అధిక మొత్తం ఖర్చయిపోతుంటుంది. ఫలితం పొదుపు చేయడం సాధ్యం కాదు.. అప్పుల మీద ఆధారపడాల్సిన అవసరమూ వస్తుంది. ఒకసారి మీ అలవాట్లేమిటన్నది చూసుకోండి. వీటిలో వదిలించుకోవాల్సినవి ఏమిటో నిర్ణయించుకోండి. కొన్నాళ్లలోనే ఆ ఫలితం మీకు మిగులు మొత్తం రూపంలో కనిపిస్తుంది.

కొంత నేరుగా వెళ్లేలా...

ఆర్జించిన మొత్తంలో నుంచి నిర్ణీత శాతం పొదుపు చేసేలా ఏర్పాటు చేసుకోవాలి. వేతనం రాగానే ఇది జరిగిపోవాలి. మిగిలిన మొత్తం నుంచే ఖర్చులకు కేటాయించాలి. ఇప్పుడు బ్యాంకుల్లో వేతనం నుంచి కొంత మొత్తం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు కేటాయించే వీలు కల్పిస్తున్నాయి. మీ బ్యాంకు ఆన్‌లైన్‌ ఖాతాలో ఈ వివరాలు ఉంటాయి. పరిశీలించండి. పొదుపు ముందు.. ఖర్చు తర్వాత అనే సూత్రాన్ని ఎప్పుడూ విస్మరించవద్దు.

24 గంటల తర్వాతే..

ఏదైనా వస్తువు కొనాలని అనుకున్నప్పుడు ఖరీదైనదాని గురించే చూస్తుంటారు చాలామంది. ఆర్థికంగా ఇది సరైనది కాదు. మీ అవసరం తీరుతుందా లేదా అనేది మాత్రమే ఇక్కడ ప్రధానం. నాణ్యమైన వస్తువు కొనడంలో తప్పు లేదు. కానీ, అధిక ధర ఉన్న వాటి గురించి ఆలోచించాల్సిందే. ఏదైనా కావాలని అనుకున్నప్పుడు.. దానికి 24 గంటల వరకూ వేచి చూడండి. ఈ మధ్యలో ఒకటి రెండుసార్లు ఆ వస్తువు/సేవతో ఎంత మేరకు అవసరం అన్నది ఆలోచించండి. నిజంగా తప్పదు అన్నప్పుడే ముందడుగు వేయాలి.

లక్ష్యాల ఆధారంగా..

స్వల్పకాలంలో అవసరమైనవి ఏమిటి? దీర్ఘకాలంలో ఏం కావాలి? ఈ రెండు విషయాల్లోనూ స్పష్టత ఉండాలి. దీన్నిబట్టే మీ పొదుపు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి. మూడు నెలల కాలంలో డబ్బు అవసరం ఉంటే.. ఏం చేయాలి? మూడేళ్ల తర్వాత అవసరాల కోసం ఎలా? పొదుపు విషయంలో గట్టి నిర్ణయం తీసుకుంటే తప్ప వీటికి డబ్బు జమ చేయలేరు. ప్రతి లక్ష్యానికి ఎంత మొత్తం కావాలన్నది లెక్క వేసుకోండి. ఆ తర్వాత దాన్ని ఏ పెట్టుబడి పథకాలకు కేటాయించాలన్నది ఎంపిక చేసుకోవచ్చు.

బడ్జెట్‌తో...

ప్రతి రూపాయికీ లెక్క ఉన్నప్పుడే.. మన డబ్బుకు అదుపు వస్తుందనేది ఆర్థిక నిపుణుల సూచన. దీన్ని కచ్చితంగా పాటించాలి. అవసరాలు, కోరికలు, విలాసాలు.. దేనికి ఎంత మొత్తం కేటాయించాలన్న విషయంలో స్పష్టత ఉండాలి. అవసరాలకు ఎటూ తప్పదు.. కోరికలు, విలాసాల ఖర్చు తగ్గిస్తేనే పొదుపు మొత్తం పెరుగుతుంది. నెలనెలా చిన్న మొత్తం మిగిలినా.. కొన్నేళ్లకు దాని ప్రభావం ఎంతో అధికంగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని