13 కంపెనీల ఎగవేత..రూ.2.85 లక్షల కోట్లు

తీసుకున్న అప్పును ఎగవేసి, దివాలా తీసిన 13 కంపెనీల వల్ల దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.2.85 లక్షల కోట్ల మేరకు నష్టం జరిగింది. ఇచ్చిన అప్పులో 23 శాతం నుంచి 95 శాతం వరకు దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా బ్యాంకులు

Published : 14 Dec 2021 03:22 IST

ప్రభుత్వరంగ బ్యాంకులకు భారీ నష్టం
నిరర్థక ఆస్తుల భారం రూ.6.16 లక్షల కోట్లు
ఈనాడు - హైదరాబాద్‌

తీసుకున్న అప్పును ఎగవేసి, దివాలా తీసిన 13 కంపెనీల వల్ల దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.2.85 లక్షల కోట్ల మేరకు నష్టం జరిగింది. ఇచ్చిన అప్పులో 23 శాతం నుంచి 95 శాతం వరకు దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా బ్యాంకులు వదులుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు 2021 మార్చి నాటికి బ్యాంకులకు రూ.6.16 లక్షల కోట్ల మేర స్థూల నిరర్ధక ఆస్తుల (జీఎన్‌పీఏ) భారం ఉంది. రద్దుచేసిన పారు బకాయిల మొత్తం కూడా అధికంగానే ఉంది. గీతాంజలి, రీ అగ్రో, విన్‌సమ్‌ డైమండ్స్‌, రోటోమ్యాక్‌, కుడోస్‌ కెమికల్‌, రుచి సోయా.. తదితర ఎన్నో కంపెనీలకు ఇచ్చిన అప్పులు రానిబాకీలుగా మారిపోయాయి. ఇటువంటి 50 కంపెనీలకు ఇచ్చిన రుణాల్లో  రూ.60,607 కోట్ల మొత్తాన్ని రానిబాకీల కింద బ్యాంకులు ఇటీవల కాలంలో రద్దు చేయాల్సి వచ్చింది. దీనివల్ల బ్యాంకులు ఆర్జించిన లాభాల్లో 70- 75 శాతం సొమ్మును ప్రొవిజన్లకు, రానిబాకీల రద్దుకు కేటాయించాల్సి వచ్చింది.

ప్రైవేటు బ్యాంకులనూ ఆదుకున్నాయ్‌: గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంకు నుంచి యస్‌ బ్యాంకు వరకు.. కష్టాల్లో చిక్కుకున్న ప్రైవేటు బ్యాంకులను ప్రభుత్వరంగ బ్యాంకులే ఆదుకున్నాయి. అతి పెద్ద ఎన్‌బీఎఫ్‌సీ అయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ ఆఫ్‌ ఇండియా కాపాడిన విషయం విదితమే.

సామాన్యులకే నష్టం

ఇంతగా సేవచేస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుకు ధారాదత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఆరోపించింది. ప్రభుత్వం తీసుకురానున్న బ్యాంకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లు, 2021 ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నట్లు యూఎఫ్‌బీయూ కన్వీనర్‌ బి.రాంబాబు వెల్లడించారు. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటు పరం చేస్తే, దేశంలోని సామాన్యులకు ఎంతో నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

సమ్మె ప్రతిపాదన విరమించి, చర్చలకు రావాలని ఉద్యోగుల సంఘాలకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా ప్రభుత్వరంగ బ్యాంకులు విజ్ఞప్తి చేశాయి.

రెండు ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ) ల్లో వాటా ఉపసంహరణకు సంబంధించి ‘ప్రైవేటీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘం’ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు సోమవారం తెలిపారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని