సన్‌ఫ్లవర్‌ నూనె లీటర్‌ రూ.140 లోపు

కొత్త సంవత్సరం, సంక్రాంతి పండగ వేళ వినియోగదారులకు శుభవార్త. వంట నూనెల ధరల భారం నుంచి కంపెనీలు ఉపశమనం కల్పించాయి. ప్రధాన వంట నూనె బ్రాండుల కంపెనీలైన

Published : 28 Dec 2021 04:48 IST

గరిష్ఠ స్థాయుల నుంచి 20% వరకు తగ్గిన ధరలు

దిల్లీ: కొత్త సంవత్సరం, సంక్రాంతి పండగ వేళ వినియోగదారులకు శుభవార్త. వంట నూనెల ధరల భారం నుంచి కంపెనీలు ఉపశమనం కల్పించాయి. ప్రధాన వంట నూనె బ్రాండుల కంపెనీలైన అదానీ విల్మర్‌ (ఫార్చూన్‌), రుచిసోయా (మహాకోశ్‌, రుచి గోల్డ్‌, సన్‌రిచ్‌, న్యూట్రెల్లా), జెమినీ (ఫ్రీడమ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌), ప్రియ ఫుడ్స్‌కు చెందిన ప్రియ బ్రాండ్‌ ఆయిల్స్‌ సంస్థలు వంట నూనెల ఉత్పత్తుల గరిష్ఠ చిల్లర ధరను (ఎంఆర్‌పీ) 20 శాతం వరకు తగ్గించాయి. కాఫ్కో (న్యూట్రిలివ్‌), ఫ్రిగోరిఫికో అల్లానా (సన్నీ బ్రాండు), గోకుల్‌ ఆగ్రో (విటాలైఫ్‌, మహేక్‌, జైకా బ్రాండ్లు), బుంగే (డాల్డా, గగన్‌, చంబల్‌ బ్రాండ్లు) కూడా ధరలు తగ్గించిన సంస్థల్లో ఉన్నాయని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈఏ) తెలిపింది. ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం, కొన్ని రకాలను లైసెన్స్‌ లేకుండా దిగుమతి చేసుకునేందుకూ అనుమతించడం ఇందుకు కారణం. సుంకాల రూపేణ ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాన్ని కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయాలని ఇటీవల కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే సూచించారు. ఆయన వినతిపై సానుకూలంగా స్పందించిన పరిశ్రమ.. 15-205 శాతం మేర ధర తగ్గించినట్లు ఎస్‌ఈఏ పేర్కొంది. అంతర్జాతీయంగా అధిక ధరల కారణంగా కొన్ని నెలలుగా వంట నూనెల ధరలు భారీగా పెరిగాయని ఎస్‌ఈఏ తెలిపింది. రానున్న నెలల్లో అంతర్జాతీయంగా ధరలు తగ్గే అవకాశం ఉన్నందున, కొత్త సంవత్సరంలో మరింతగా వంటనూనెల ధరలు తగ్గుతాయని భావిస్తున్నామని వెల్లడించింది. రిఫైన్డ్‌ పామాయిల్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని  17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గిస్తూ ఈనెల 20న ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సుంకం తగ్గింపు 2022 మార్చి వరకు వర్తించనుంది.

గిరాకీ పెరిగే అవకాశం

అంతర్జాతీయ విపణిలో ధరల ప్రభావంతో ఈ ఏడాది ఆరంభం నుంచి సన్‌ఫ్లవర్‌ (పొద్దుతిరుగుడు పువ్వు) నూనె ధర గణనీయంగా పెరిగి లీటరుకు రూ.180కి చేరిందని, తదుపరి ప్రభుత్వ చర్యల ఫలితంగా  స్థూలంగా ధర 20 % వరకు దిగివచ్చిందని ఫ్రీడమ్‌ హెల్దీ కుకింగ్‌ ఆయిల్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (విక్రయాలు, మార్కెటింగ్‌) పి.చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించడమే ఇందుకు కారణమన్నారు. ధరల తగ్గింపుతో ప్రస్తుతం ఫ్రీడమ్‌ రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర లీటరుకు రూ.140 లేదా అంతకంటే తక్కువకే అందుబాటులో ఉందని తెలిపారు. పండగల సమయం కావడంతో వంట నూనెలకు గిరాకీ పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని