జపాన్‌ను వెనక్కి నెట్టేస్తాం

2030 కల్లా జపాన్‌ను నెట్టి ఆసియాలోనే అతిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారుతుందని అంచనా. జర్మనీ, బ్రిటన్‌లనూ వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ శుక్రవారం...

Published : 08 Jan 2022 05:40 IST

ఆసియాలోనే అతిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా భారత్‌

ప్రపంచంలో మూడో స్థానం సొంతం

2030 కల్లా సాధ్యం: ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ నివేదిక

దిల్లీ

2030 కల్లా జపాన్‌ను నెట్టి ఆసియాలోనే అతిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారుతుందని అంచనా. జర్మనీ, బ్రిటన్‌లనూ వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ శుక్రవారం తన నివేదికలో అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ, బ్రిటన్‌ల తర్వాత ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఆ నివేదిక ప్రకారం..

* 2021లో 2.7 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత జీడీపీ.. 2030 కల్లా 8.4 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చు. ఈ వేగవంతమైన వృద్ధి కారణంగా జపాన్‌ జీడీపీని భారత జీడీపీ అధిగమించి ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో రెండో స్థానంలోకి వెళ్లొచ్చు.
* 2030 కల్లా అతిపెద్ద పశ్చిమ ఐరోపా ఆర్థిక వ్యవస్థలైన జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌లను సైతం భారత ఆర్థిక వ్యవస్థ అధిగమించొచ్చు. మొత్తం మీద వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌ కొనసాగుతుంది.
* వినియోగదారు వ్యయాలు పెరిగేందుకు భారత్‌లోని పెద్ద, వేగవంతమైన మధ్య తరగతి భారత్‌కు అతిముఖ్యమైన సానుకూల అంశంగా మారుతుంది. 2020లో 1.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న వినియోగదారు వ్యయాలు 2030 కల్లా రెట్టింపై 3 లక్షల కోట్ల డాలర్లకు చేరొచ్చు.
* పూర్తి ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారత వాస్తవ జీడీపీ వృద్ధి 8.2 శాతంగా నమోదుకావొచ్చని అంచనా. 2022-23లోనూ 6.7 శాతం మేర బలంగానే వృద్ధిని కొనసాగించొచ్చు.

ఇవీ కారణాలు..: భారత్‌లో డిజిటల్‌ మార్పుల వల్ల ఇ-కామర్స్‌ వేగంగా వృద్ధి చెందొచ్చు. వచ్చే దశాబ్దంలో రిటైల్‌ వినియోగదారు రంగమే సమూలంగా మారొచ్చు. ఈ అంశం సాంకేతిక, ఇ-కామర్స్‌లోని బహుళజాతి కంపెనీలను ఆకర్షిస్తోంది. 2030 కల్లా 110 కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్‌ను వినియోగించొచ్చు. ప్రస్తుత 50 కోట్ల మందితో పోలిస్తే ఇది రెట్టింపు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పెరుగుదలా భారత్‌ను బలంగా మారుస్తోంది. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటివి భారత్‌కు నిధులతో తరలివస్తున్నాయి. వాహన, ఎలక్ట్రానిక్స్‌, రసాయనాలు, బ్యాంకింగ్‌, బీమా, అసెట్‌ మేనేజ్‌మెంట్‌, ఆరోగ్య సంరక్షణ, ఐటీ వంటి రంగాల్లో బహుళజాతి కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తుండడం వల్ల భారత్‌ భవిష్యత్‌ బలంగా కనిపిస్తోంది.


ఆర్థిక వృద్ధి 9.2 శాతం

2021-22పై ఎన్‌ఎస్‌ఓ ముందస్తు అంచనాలు

గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారత ఆర్థిక వ్యవస్థ కరోనా ముందు స్థాయిలను అధిగమించగలదని ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. వ్యవసాయ, గనులు, తయారీ రంగాలు మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుండడం వల్ల 9.2% వృద్ధి నమోదు కావొచ్చని అంచనా. 2020-21లో కరోనా కారణంగా లాక్‌డౌన్‌, ఇతరత్రా ఆంక్షల కారణంగా జీడీపీ వృద్ధి రేటు 7.3% మేర క్షీణించిన సంగతి తెలిసిందే. శుక్రవారం జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన జాతీయ ఆదాయ ముందస్తు అంచనాల ప్రకారం వివిధ రంగాల్లో వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అంచనాల ప్రకారం..

* 2021-22లో వాస్తవ జీడీపీ లేదా జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)ని రూ.147.54 లక్షల కోట్లకు చేరవచ్చు. అంతక్రితం ఏడాది తాత్కాలిక జీడీపీ అంచనా (మే 31, 2021న) అయిన రూ.135.13 లక్షలతో పోలిస్తే ఇది ఎక్కువే. 2021-22లో వాస్తవ జీడీపీ వృద్ధి 9.2 శాతంగా నమోదవుతుందని అంచనా. ఆర్‌బీఐ అంచనా వేసిన 9.5 శాతం కంటే ఇది తక్కువే.
* వాస్తవ గణాంకాల్లో 2021-22 జీడీపీ గణాంకాలు 2019-20 నాటి కరోనా ముందు స్థాయైన రూ.145.69 లక్షల కోట్లను అధిగమించొచ్చని అంచనా.
* 2021-22లో తయారీ రంగం 12.5%, గనుల రంగం   14.3%; వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్‌, బ్రాడ్‌క్యాస్టింగ్‌ సేవల రంగం 11.9% వృద్ధిని నమోదు చేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని