ULIP: యులిప్‌... పెట్టుబడితో ధీమా...

బీమా రక్షణ, మార్కెట్లో పెట్టుబడికి అవకాశం, పన్ను ఆదా ఈ మూడూ ఒకే చోట కావాలనుకున్నప్పుడు ఉన్న మార్గం యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ (యులిప్‌)లు. పన్ను ఆదాకు బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌లాంటి పథకాలున్నప్పటికీ.. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి అవకాశం కల్పించే యులిప్‌లు చాలామంది ఎంచుకుంటారు.

Updated : 14 Jan 2022 10:04 IST

బీమా రక్షణ, మార్కెట్లో పెట్టుబడికి అవకాశం, పన్ను ఆదా ఈ మూడూ ఒకే చోట కావాలనుకున్నప్పుడు ఉన్న మార్గం యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ (యులిప్‌)లు. పన్ను ఆదాకు బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌లాంటి పథకాలున్నప్పటికీ.. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి అవకాశం కల్పించే యులిప్‌లు చాలామంది ఎంచుకుంటారు.

పన్ను మినహాయింపు: ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సీ ప్రకారం యులిప్‌లకు చెల్లించిన ప్రీమియానికి పరిమితి మేరకు మినహాయింపు వర్తిస్తుంది. దీంతోపాటు పెన్షన్‌ ప్లాన్లను ఎంచుకున్నప్పుడు సెక్షన్‌ 80సీసీసీ కింద క్లెయిం చేసుకోవచ్చు. ఈ రెండు సెక్షన్లకు కలిపి పరిమితి రూ.1,50,000 ఉంటుంది. పాలసీకి చెల్లించే వార్షిక ప్రీమియం పాలసీ విలువలో 10శాతానికి మించి ఉండకూడదు.

పాక్షికంగా వెనక్కి: యులిప్‌లకు లాకిన్‌ వ్యవధి అయిదేళ్లు ఉంటుంది. ఆ తర్వాత వీటిలో నుంచి పాలసీదారుడు పాక్షికంగా కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు వీలుంటుంది. ఇది మొత్తం ఫండ్‌ విలువలో 20 శాతానికి మించి ఉండకూడదు. ఉదాహరణకు అయిదేళ్ల తర్వాత ఫండ్‌ విలువ రూ.2లక్షలు ఉంటే.. ఇందులో నుంచి రూ.40వేల వరకూ తీసుకోవచ్చన్నమాట. బీమా సంస్థలు దీనిపై పరిమితి విధించేందుకూ అవకాశం ఉంది. పాలసీ తీసుకునేముందు ఈ నిబంధన గురించి తెలుసుకోవడం మంచిది.

వ్యవధి తీరాక: పాలసీ గడువు తీరాక వచ్చే మొత్తంపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 10 (10డీ) ప్రకారం మినహాయింపు వర్తిస్తుంది. ఏప్రిల్‌ 1, 2012 తర్వాత తీసుకున్న పాలసీలకు చెల్లించే వార్షిక ప్రీమియం పాలసీ విలువలో 10శాతం లోపు ఉండాలి. అంతకు క్రితం తీసుకున్న పాలసీలకు ఈ ప్రీమియం 20శాతం లోపుండాలి. ఒకవేళ పాలసీదారుడు గడువులోగా మరణిస్తే వచ్చే పరిహారానికీ పన్ను మినహాయింపు ఉంటుంది.

అదనంగా చెల్లిస్తూ: కొత్తగా తీసుకున్న యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలకు చెల్లించే వార్షిక ప్రీమియం రూ.2.5లక్షలకు మించినప్పుడు, వచ్చిన రాబడిపై ఎలాంటి పన్ను మినహాయింపూ వర్తించదు. ఈ విషయాన్ని పాలసీదారులు గుర్తుంచుకోవాలి.

ముందే అనుకున్నట్లు.. పెట్టుబడి, బీమా కలిసి ఉండే యులిప్‌లతో ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి. ఈక్విటీ, డెట్‌లలో మదుపు చేసేందుకూ ఇవి అవకాశం ఇస్తాయి. అధిక నష్టభయం భరించగలిగేవారు ఈక్విటీ ఫండ్లనూ, కాస్త మధ్యస్థంగా ఉన్నవారు డెట్‌ ఫండ్లనూ ఎంచుకోవచ్చు. సురక్షిత పథకాలు కావాలంటే.. ప్రభుత్వ సెక్యూరిటీలు, ఫిక్స్‌డ్‌ ఇన్‌కం సెక్యూరిటీలను, కార్పొరేట్‌ బాండ్లను ఎంచుకోవచ్చు. పదవీ విరమణ నిధిని జమ చేసుకునేందుకూ ఇవి ఉపయోగపడతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని