టీసీఎస్‌ బైబ్యాక్‌లో రూ.12,993 కోట్ల షేర్లు విక్రయించనున్న టాటా సన్స్‌, టీఐసీఎల్‌

ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ప్రకటించిన రూ.18,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌లో పాల్గొనడానికి ప్రమోటర్‌ సంస్థలు టాటా సన్స్‌, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఐసీఎల్‌) ఆసక్తి చూపుతున్నాయి.

Published : 15 Jan 2022 04:44 IST

దిల్లీ: ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ప్రకటించిన రూ.18,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌లో పాల్గొనడానికి ప్రమోటర్‌ సంస్థలు టాటా సన్స్‌, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఐసీఎల్‌) ఆసక్తి చూపుతున్నాయి. ఈ బైబ్యాక్‌లో దాదాపు రూ.12,993.2 కోట్ల విలువైన షేర్లు విక్రయించడానికి ఈ సంస్థలు సిద్ధమవుతున్నాయి. బైబ్యాక్‌లో ఒక్కో షేరు రూ.4500 చొప్పున 4 కోట్ల షేర్లను టీసీఎస్‌ కొనుగోలు చేయనుంది. కంపెనీ పోస్టల్‌ బ్యాలెట్‌ నోటీసు ప్రకారం.. బైబ్యాక్‌ ఆఫర్‌లో పాల్గొనేందుకు టాటా సన్స్‌, టీఐసీఎల్‌ ఆసక్తిగా ఉన్నాయి. టీసీఎస్‌లో దాదాపు 266.91 కోట్ల షేర్లు కలిగిన టాటా సన్స్‌.. 2.88 కోట్ల షేర్లకు టెండర్‌ దాఖలు చేయనుంది. 10,23,685 షేర్లు కలిగిన టీఐసీఎల్‌.. 11,055 షేర్లు విక్రయించనుంది. ఒక్కో షేరు రూ.4500 వద్ద ఈ రెండు సంస్థలు రూ.12,993.2 కోట్లు సమీకరించనున్నాయి. ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు ప్రత్యేక తీర్మానం ద్వారా వాటాదార్ల అనుమతి తీసుకోవాలని టీసీఎస్‌ చూస్తోంది. ఇ-ఓటింగ్‌ జనవరి 14న ప్రారంభమై.. ఫిబ్రవరి 12న ముగియనుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలు ఫిబ్రవరి 15న వెలువడతాయి. ఇంతకు ముందు 2020లో టీసీఎస్‌ చేపట్టిన రూ.16000 కోట్ల షేర్ల బైబ్యాక్‌లో టాటా సన్స్‌ రూ.9997.5 కోట్ల విలువైన షేర్లు టెండర్‌ చేసింది. ఆ సమయంలో 5.33 కోట్లకు పైగా షేర్లను టీసీఎస్‌ కొనుగోలు చేయగా.. టాటా సన్స్‌ నుంచి 3,33,25,118 షేర్లు స్వీకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని