
మిథనాల్ ఉత్పత్తిలో భెల్ ముందడుగు
హైదరాబాద్ (భెల్), న్యూస్‌టుడే: దేశీయంగా లభించే బొగ్గును మండించినప్పుడు విడుదల అయ్యే బూడిద నుంచి 99 శాతం స్వచ్ఛతతో మిథనాల్ గ్యాస్ (సింథటిక్ గ్యాస్) ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని భెల్ సంస్థ సాధించింది. రోజుకు .25 మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను ఉత్పత్తి చేసే సీటీఎం (బొగ్గు నుంచి మిథనాల్) ప్రయోగాత్మక ప్లాంటును కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే దిల్లీ నుంచి దృశ్యమాధ్యమ పద్ధతిలో జాతికి అంకితం చేశారు. భెల్ సీఎండీ నళిన్ షింఘాల్, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి జితేంద్ర సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి మహేంద్రనాథ్ పాండే మాట్లాడుతూ దేశం స్వావలంబన సాధించడంలో తయారీరంగం కీలకమని తెలిపారు. ఈ రంగానికి అవసరమైన యంత్రాలు తయారు చేయడంలో భెల్ ఎంతో కీలకపాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. గ్యాస్ వినియోగం పెంచే క్రమంలో, అధిక బూడిద కలిగిన భారతీయ బొగ్గుని మిథనాల్‌గా మార్చే ప్రక్రియను భెల్ సొంతగా ఆవిష్కరించడం అభినందనీయమన్నారు.