
ఐటీ ఎగుమతులు రూ.75 లక్షల కోట్లకు!
దశాబ్దంలో సాకారం కావాలి
చిన్న పట్టణాల్లో ఐటీ హబ్‌లకు సహకారం
వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్
దిల్లీ: సాఫ్ట్వేర్ సేవల ఎగుమతులు దశాబ్దకాలంలో లక్ష కోట్ల డాలర్లకు (సుమారు రూ.75 లక్షల కోట్ల) చేరేలా ఐటీ కంపెనీలు కృషి చేయాలని, ఇందుకు అవసరమైన సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఉత్పత్తుల ఎగుమతులు 40,000 కోట్ల డాలర్లకు (సుమారు రూ.30 లక్షల కోట్ల) చేర్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటివరకు సాగుతున్నామని, సేవల ఎగుమతులు కూడా 240-250 బి.డాలర్లకు (రూ.18-18.75 లక్షల కోట్ల) చేరొచ్చనే అంచనాను మంత్రి వ్యక్తం చేశారు. ‘మనం లక్ష కోట్ల డాలర్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకోవాలి. అనుకున్న సమయం కంటే ముందే సాధిస్తే ఎంతో బాగుంటుంది’ అని దిగ్గజ ఐటీ కంపెనీల సీఈఓలతో మంత్రి ఆదివారం పేర్కొన్నారు. రెండు, మూడో అంచె పట్టణాల్లో ఐటీ కేంద్రాలు నెలకొల్పాలన్న ఐటీ సంస్థల ప్రతిపాదనను మంత్రి స్వాగతించారు. కొత్త సాంకేతికతలు, ఉత్పత్తులను ఆవిష్కరించడం ద్వారా, అంతర్జాతీయంగా ఐటీ రంగంలో భారత్ మరింత ఉన్నత స్థానానికి చేరుతుందని మంత్రి వివరించారు. హైటెక్ ఉత్పత్తులను ఆవిష్కరించడంపై కంపెనీలు దృష్టి సారించాలని, ఇందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. అంకుర సంస్థలకు కావాల్సిన వాతావరణాన్ని దేశంలో కల్పించని పరిస్థితుల్లోనూ ఐటీ కంపెనీలు సొంతగా ఎదిగాయని మంత్రి ప్రశంసించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) సేవల ఎగుమతుల వృద్ధికి సహకరిస్తుందని తెలిపారు. దృశ్యమాధ్యమ విధానంలో మంత్రితో సమావేశమైన వారిలో నాస్కామ్ అధ్యక్షుడు దేవ్జాని ఘోష్, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్, టెక్‌మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ, ఎంఫసిస్ సీఈఓ నితిన్ రాకేశ్, విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ, జెన్ప్యాక్స్ సీఈఓ ఎన్వి త్యాగరాజన్, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్ గ్రూప్ సీఈఓ కేశవ్ ఆర్ మురుగేశ్, టీసీఎస్ టెక్నాలజీ సేవల విభాగాధిపతి కృష్ణన్ రామానుజమ్ పాల్గొన్నారు.
అంకురాలే వెన్నెముక
దేశ సమస్యల పరిష్కారానికి అంకుర సంస్థలు వినూత్న పరిష్కారాలు అన్వేషించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్బోధించారు. సరికొత్త భారతావని ఆవిష్కరణకు అంకురాలు వెన్నెముకగా నిలుస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జాతీయ అంకురసంస్థల దినోత్సవంగా జనవరి16ను నిర్ణయించినట్లు ప్రధాని వెల్లడించారు. అంకుర సంస్థల నిర్వాహకులతో దృశ్యమాధ్యమ విధానంలో సమావేశమైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో 60,000 అంకురాలుంటే, 2021లోనే 46 సంస్థలు యూనికార్న్ (100 కోట్ల డాలర్లు-రూ.7500 కోట్ల విలువ)లుగా ఆవిర్భవించాయని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించడం, వినూత్నత ప్రోత్సాహకానికి సంస్థాగత ఏర్పాట్లు, వినూత్న సాధకులకు సహకారం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని భరోసా ఇచ్చారు.