క్రెడిట్‌ సూయిజ్‌ ఛైర్మన్‌ రాజీనామా

కొవిడ్‌పై పోరు కోసం ఏర్పాటు చేసిన నిబంధనలను ఉల్లంఘించినందుకు అంతర్జాతీయ బ్యాంకు క్రెడిట్‌ సూయిజ్‌ ఛైర్మన్‌ ఓసోరియా రాజీనామా చేశారు. బ్రిటిష్‌-పోర్చుగీసు జాతీయుడైన ఆంటోనియో హోర్తా-ఓసోరియా ఎనిమిది నెలల కిందటే ఆ బాధ్యతలను చేపట్టారు.

Published : 18 Jan 2022 02:17 IST

కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనపై  అంతర్గత దర్యాప్తు నేపథ్యంలోనే

జెనీవా: కొవిడ్‌పై పోరు కోసం ఏర్పాటు చేసిన నిబంధనలను ఉల్లంఘించినందుకు అంతర్జాతీయ బ్యాంకు క్రెడిట్‌ సూయిజ్‌ ఛైర్మన్‌ ఓసోరియా రాజీనామా చేశారు. బ్రిటిష్‌-పోర్చుగీసు జాతీయుడైన ఆంటోనియో హోర్తా-ఓసోరియా ఎనిమిది నెలల కిందటే ఆ బాధ్యతలను చేపట్టారు. కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనపై కంపెనీలో జరుగుతున్న అంతర్గత దర్యాప్తు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. హెడ్జ్‌ ఫండ్స్‌పై సరైన రీతిలో పెట్టుబడులు పెట్టలేకపోవడం; అంతర్గత నిఘా కుంభకోణం వంటి పలు సమస్యల్లో చిక్కుకున్న ఈ స్విస్‌ బ్యాంకుకు ఇది మరో ఇబ్బందిగా మారొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ‘నా వ్యక్తిగత చర్యల వల్ల బ్యాంకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినందుకు విచారిస్తున్నాను. బ్యాంకు బయటా, లోపలా సరిగ్గా ప్రాతినిథ్యం వహించడంలో విఫలమయ్యాను. బ్యాంకు ప్రయోజనాల రీత్యా రాజీనామా చేస్తున్నా’ అని ఒసారియో (57) ప్రకటించారు. యూబీఎస్‌ నుంచి వచ్చిన యాక్సెల్‌ లేమాన్‌ ఛైర్మన్‌గా అక్టోబరులో బాధ్యతలు స్వీకరిస్తారని కంపెనీ తెలిపింది.

ఇంతకీ ఏం చేశారు.. ఒసారియో (లాయిడ్స్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ మాజీ సీఈఓ) క్వారెంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. డిసెంబరులో బ్రిటన్‌కు వెళ్లడంతో పాటు వేసవిలో వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్నమెంటుకు హాజరు కావడాన్ని కంపెనీ గుర్తించిందని స్విస్‌ మీడియా చెబుతోంది. ఈ ఉల్లంఘనలపై డిసెంబరు చివర్లో ఓసోరియోను విచారించినట్లు అక్కడి ఆన్‌లైన్‌ వార్తా సేవల సంస్థ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని