
ఇంటర్నెట్‌కు దూరంగానే కోట్లమంది
అందుబాటు ధరలే కీలకం: సునీల్ మిత్తల్
దిల్లీ/దావోస్: ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ ఇంటర్నెట్‌కు దూరంగానే ఉన్నారని, అందుబాటు ధరల్లో ఈ సేవలు అందించడం చాలా కీలకమని భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక ‘ఆన్‌లైన్ దావోస్ అజెండా 2022’ సదస్సులో నాలుగో పారిశ్రామిక విప్లవంపై జరిగిన చర్చలో సునీల్ మిత్తల్ మాట్లాడారు. టెలికాం పరిశ్రమ ఒక్కటే అన్నీ చేయలేదని, ప్రజలందరికీ ఇంటర్నెట్ అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం భారీ పెట్టుబడులు కావాలని అన్నారు. టెక్నాలజీ రెండు వైపులా పదును కలిగిన కత్తి లాంటిదేనని, డిజిటల్ అనుసంధానత వల్ల నష్టాలు తగ్గించి.. లాభాలను పెంచడం టెలికాం సంస్థల బాధ్యతగా మారిందని తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవ సాంకేతికతలు ఇప్పటికే పలు మార్పులు తీసుకొచ్చాయన్నారు. కొవిడ్-19 సమయంలో టెలికాం, బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ల అవసరం గణనీయంగా పెరిగిందని వివరించారు. వ్యాక్సినేషన్ వివరాలు, ఆర్థిక సేవలు, ఆహార డెలివరీ.. ఇలా ప్రతి అంశంలో టెలికాం భాగమైందన్నారు. ఇంటర్నెట్ ప్రతి మానవుడి హక్కు అని వెరిజోన్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్, సీఈఓ వెస్ట్‌బర్గ్ అభిప్రాయపడ్డారు.