కొవిడ్‌ ఆందోళనలున్నా, భవిష్యత్తు ఆశావహమే

కొవిడ్‌ కేసులు అధికంగా నమోదవుతున్న నగరాల్లో వినియోగదార్ల విశ్వాసం, ఇతర నగరాలతో పోలిస్తే ఎక్కువగా ప్రభావితమవుతోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజా బులెటిన్‌లో పేర్కొంది. కొవిడ్‌తో దెబ్బ తిన్న చాలా దేశాల్లో వినియోగదారు విశ్వాసం క్రమంగా పెరుగుతున్నా,

Published : 18 Jan 2022 02:18 IST

ఆర్‌బీఐ బులెటిన్‌

ముంబయి: కొవిడ్‌ కేసులు అధికంగా నమోదవుతున్న నగరాల్లో వినియోగదార్ల విశ్వాసం, ఇతర నగరాలతో పోలిస్తే ఎక్కువగా ప్రభావితమవుతోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజా బులెటిన్‌లో పేర్కొంది. కొవిడ్‌తో దెబ్బ తిన్న చాలా దేశాల్లో వినియోగదారు విశ్వాసం క్రమంగా పెరుగుతున్నా, ఇంకా కొవిడ్‌ పూర్వ స్థితికి రాలేదని పేర్కొంది. కొవిడ్‌ కేసులు విస్తృతమవుతున్న ప్రతిసారి వినియోగదార్లు ప్రభావితమవుతున్నా, భవిష్యత్‌పై ఆశాజనకంగా ఉంటున్నారని తెలిపింది. ప్రభుత్వ చర్యలతో పాటు టీకాల కార్యక్రమం ఇందుకు ఉపకరిస్తుందని వివరించింది. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో కుటుంబాల ఆదాయం గణనీయంగా తగ్గిందని, దీంతో వినియోగదారు విశ్వాసం కూడా కనిష్ఠ స్థాయికి పడిపోయిందని పేర్కొంది. అయితే నిత్యావసరాలపై వ్యయాలు పెరిగాయని తెలిపింది. ప్రభుత్వ చర్యల వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడి, కుటుంబాల ఆదాయాలు కూడా పెరుగుతున్నాయని, దీంతో క్రమంగా వినియోగదారు విశ్వాసం పుంజుకుంటోందని ఆర్‌బీఐ వెల్లడించింది.

* యూకే, దక్షిణాఫ్రికాల నుంచి వస్తున్న తాజా సమాచారం మేరకు 66-80 శాతం ఒమిక్రాన్‌ కేసులు తీవ్రంగా లేవని, ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం తక్కువగా ఉంటోందని పేర్కొంది.

* బ్యాంక్‌ రుణాలు పెరగడం, వ్యవస్థలో గిరాకీ పరిస్థితులు మెరుగవ్వడం, రబీ పంటలు గత ఏడాది స్థాయిని మించి సాధారణ స్థాయికి రావడం కలిసొచ్చే అంశాలని వివరించింది.

* తయారీ, సేవల రంగంలోని చాలా విభాగాలు విస్తరణ దిశలో ఉండటంతో మొత్తం మీద దేశంలో ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉండనున్నాయని ఆర్‌బీఐ తెలిపింది.

* సరఫరా చైన్‌ అంతరాయాలు తొలగి రవాణా ఛార్జీలు కూడా తగ్గుతున్నాయని, ద్రవ్యోల్బణం అదుపులోకి రావడానికి ఇది దోహదం చేస్తుందని అంచనా వేసింది. అంతర్జాతీయ రికవరీ కూడా పుంజుకుంటోందని పేర్కొంది.

* డిజిటల్‌ చెల్లింపులు 2020-21లో 30,000 కోట్ల డాలర్లుగా (సుమారు 22.5 లక్షల కోట్లు) నమోదు కాగా, 2025-26 నాటికి లక్ష కోట్ల డాలర్లకు (సుమారు రూ.75 లక్షల కోట్లు) చేరే అవకాశం ఉందని మార్కెట్‌లో అంచనాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని