సంక్షిప్త వార్తలు

గత ఏడాది రెండో అర్ధ వార్షికంలో దేశీయంగా ఉద్యోగ నియామకాలు 53 శాతం మేరకు పెరిగాయని ఇండీడ్‌ సర్వే వెల్లడించింది. తొలి ఆరు నెలలో 44శాతం వృద్ధి కనిపించిందని పేర్కొంది. కొత్త ఉద్యోగాల్లో ఎక్కువ శాతం

Published : 19 Jan 2022 03:36 IST

ఐటీలో అధిక నియామకాలు
ఇండీడ్‌ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: గత ఏడాది రెండో అర్ధ వార్షికంలో దేశీయంగా ఉద్యోగ నియామకాలు 53 శాతం మేరకు పెరిగాయని ఇండీడ్‌ సర్వే వెల్లడించింది. తొలి ఆరు నెలలో 44శాతం వృద్ధి కనిపించిందని పేర్కొంది. కొత్త ఉద్యోగాల్లో ఎక్కువ శాతం ప్రారంభస్థాయి, తాజా ఉత్తీర్ణులకు లభించినట్లు తెలిపింది. మొత్తం ఉద్యోగాల్లో దాదాపు 63 శాతం ఉద్యోగాలు ఐటీ రంగంలోనే ఉన్నాయని తెలిపింది. దీంతోపాటు ఇ-కామర్స్‌, టెక్నాలజీ అంకురాలు, టెలి కమ్యూనికేషన్లలో అధిక ఉద్యోగాలు లభించాయి. ఉద్యోగాల కల్పనలో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం ఉద్యోగాల్లో 70 శాతం ఇక్కడే ఉన్నాయి. ముంబయిలో 66 శాతం ఉండగా, చెన్నైకి మూడో స్థానం దక్కింది. వ్యాపారాల తీరు మారడంతోనూ అధికంగా డేటా అనాలిసిస్‌, అనలిటిక్స్‌లకు ప్రాధాన్యం లభించింది. ఈ విభాగాల్లో 31శాతం నియామకాలు జరిగాయి.


యాడ్‌వెర్బ్‌లో రిలయన్స్‌ రిటైల్‌కు 54% వాటా

దిల్లీ: దేశీయ రోబోటిక్స్‌ కంపెనీ యాడ్‌వెర్బ్‌ టెక్నాలజీస్‌లో 54% వాటాను ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ రిటైల్‌ 132 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.983 కోట్లు)కు కొనుగోలు చేసింది. తమ కంపెనీ స్వతంత్రంగానే పనిచేస్తుందని, రిలయన్స్‌ నిధులను విదేశాల్లో వ్యాపార విస్తరణకు వినియోగించనున్నట్లు యాడ్‌వెర్బ్‌ సహవ్యవస్థాపకుడు, సీఈఓ సంగీత్‌ కుమార్‌ పేర్కొన్నారు. నోయిడాలో అతిపెద్ద రోబోటిక్‌ తయారీ కేంద్రాన్ని కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కంపెనీ నోయిడా తయారీ ప్లాంట్‌లో ఏడాదికి దాదాపు 10,000 రోబోలను ఉత్పత్తి చేస్తున్నారు. యాడ్‌వెర్బ్‌లో 54% వాటా కొనుగోలుతో కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా రిలయన్స్‌ మారిందని కుమార్‌ తెలిపారు. 5జీ, కొత్త ఇంధన ప్రణాళికల ద్వారా బ్యాటరీ టెక్నాలజీ, మెటీరియల్‌ సైన్సెస్‌లో రిలయన్స్‌ తోడ్పాటు ద్వారా అధునాతన, అందుబాటు ధరలో రోబోలను అందించగలమనే ఆశాభావం వ్యక్తం చేశారు.  


అంకురాలకు రూ.5 కోట్లు: టి-హబ్‌

ఈనాడు, హైదరాబాద్‌: అంకుర సంస్థల ఇంక్యుబేటర్‌ టి-హబ్‌కు కేంద్ర ప్రభుత్వ డీపీఐఐటీ నుంచి రూ.5 కోట్ల నిధులు లభించాయి. స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండింగ్‌ నుంచి ఈ నిధులు అందాయి. ప్రారంభ దశలో ఉన్న అంకురాలకు పెట్టుబడులు సమకూర్చేందుకు ఈ నిధులను టి-హబ్‌ వినియోగించనుందని టి-హబ్‌ సీఈఓ మహంకాళి శ్రీనివాస రావు అన్నారు. అంకురాలను ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా ఇంక్యుబేటర్‌ సీడ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఐఎస్‌ఎంసీ)ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో పెట్టుబడిదారులు, మెంటార్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారని తెలిపారు. మూడేళ్ల వ్యవధిలో 15 సంస్థలకు ఈ నిధులను అందిస్తామని, అంకురాలు దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.


హోండా షైన్‌ విక్రయాలు కోటి దాటాయ్‌

దిల్లీ: తమ 125 సీసీ బైక్‌ షైన్‌ వాహనాలు ప్రారంభం నుంచి ఇప్పటికి కోటికి పైగా విక్రయమయ్యాయని హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) మంగళవారం వెల్లడించింది. 2006లో ఈ మోడల్‌ను విడుదల చేయగా, 2010 నాటికి 10 లక్షల విక్రయాలు నమోదయ్యాయి. 2014కు 30 లక్షల మార్కును మించాయి. 2017కు 50 లక్షల బైక్‌ల విక్రయాలు నమోదవగా, 2018కి 70 లక్షలు అధిగమించాయి. 2020 నాటికి 90 లక్షల మైలురాయిని చేరుకుంది.


ఎయిరిండియా సీఎండీగా విక్రమ్‌ దేవ్‌ దత్‌

దిల్లీ: ఎయిరిండియా కొత్త సీఎండీగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విక్రమ్‌ దేవ్‌ దత్‌ను కేంద్రం మంగళవారం నియమించింది. త్వరలోనే ఈ సంస్థను టాటా సన్స్‌కు అప్పగించాల్సి ఉన్నా, సీనియర్‌ అధికారుల బదిలీల్లో భాగంగా దత్‌ నియామకం జరిగినట్లు తెలుస్తోంది. ఈయన 1993 బ్యాచ్‌కు చెందిన ఏజీఎంయూటీ (అరుణాచల్‌ప్రదేశ్‌, గోవా, మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతం) ఐఏఎస్‌ అధికారి. ఈయన ప్రస్తుతం దిల్లీ ప్రభుత్వంలో పర్యాటక (టూరిజమ్‌) శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఎయిరిండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా (సీఎండీ) ఆయనకు పదోన్నతి లభించినట్లయింది.  


బజాజ్‌ ఫైనాన్స్‌ లాభం రూ.2,125 కోట్లు

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) డిసెంబరు త్రైమాసికంలో బజాజ్‌ ఫైనాన్స్‌ రూ.2,125.29 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.1,145.98 కోట్లతో పోలిస్తే ఇది 85.5 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.6,658.34 కోట్ల నుంచి రూ.8,535.06 కోట్లకు చేరింది. కంపెనీ ఏకీకృత నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) రూ.1,43,550 కోట్ల నుంచి 26 శాతం పెరిగి రూ.1,81,250 కోట్లకు చేరాయి. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ.4,296 కోట్ల నుంచి  40 శాతం పెరిగి రూ.6,000 కోట్లకు చేరింది. స్థూల ఎన్‌పీఏలు, నికర ఎన్‌పీఏలు వరుసగా 1.73%, 0.78%గా ఉన్నాయి. 2021 సెప్టెంబరు 30 నాటికి ఇవి వరుసగా 2.45%, 1.10%గా నమోదయ్యాయి. స్టాండలోన్‌ ప్రాతిపదికన, కంపెనీ లాభం రూ.1,049 కోట్ల నుంచి 84% పెరిగి రూ.1,934 కోట్లకు చేరింది.


కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ రూ.2,000 కోట్ల సమీకరణ

దిల్లీ: కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ ప్రీ-ఐపీఓ ఆపర్చునిటీస్‌ ఫండ్‌ ద్వారా రూ.2,000 కోట్ల నిధుల్ని సమీకరించినట్లు మంగళవారం వెల్లడించింది. బలమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నవతరం వ్యాపారాల్లో ఈ నిధుల్ని పెట్టుబడిగా పెడతామని పేర్కొంది. ఇప్పటికే 5 ఒప్పందాల ద్వారా రూ.653 కోట్ల పెట్టుబడులు చొప్పించినట్లు తెలిపింది. రూ.405 కోట్ల విలువైన ఒప్పందాలు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించింది. ఏపీఐ హోల్డింగ్స్‌ (ఫార్మ్‌ఈజీ మాతృ సంస్థ), పైన్‌ ల్యాబ్స్‌, మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌, పీబీ ఫిన్‌టెక్‌ (పాలసీ బజార్‌), ఎఫ్‌ఎస్‌ఎన్‌ కామర్స్‌ (నైకా) సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు వివరించింది.


ఐనాక్స్‌ విండ్‌ రూ.400 కోట్ల ఓఎఫ్‌ఎస్‌

దిల్లీ: ఐనాక్స్‌ గ్రీన్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఐజీఈఎస్‌ఎల్‌) ప్రతిపాదిత ఐపీఓ ద్వారా రూ.400 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో విక్రయించేందుకు ఐనాక్స్‌ విండ్‌ బోర్డు మంగళవారం ఆమోదం తెలిపింది. గత నెల 6న ఐజీఈఎస్‌ఎల్‌ బోర్డు ఐపీఓ ద్వారా నిధుల సమీకరించేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ.500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఈ ఐపీఓలోనే ఓఎఫ్‌ఎస్‌ ద్వారా రూ.400 కోట్ల వరకు విలువైన ఈక్విటీ షేర్లను ఐనాక్స్‌ విండ్‌ విక్రయించేందుకు సిద్ధమైనట్లు బీఎస్‌ఈకి సమాచారమిచ్చింది.

మరో 2 ఐపీఓలకు అనుమతి

ఇంటిగ్రేటెడ్‌ క్యాష్‌ లాజిస్టిక్స్‌ సంస్థ రేడియంట్‌ క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌ వేరాందా లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ల ఐపీఓలకు కూడా సెబీ అనుమతిచ్చింది. ఈ 2 కంపెనీలు అక్టోబరు-నవంబరు మధ్య ఐపీఓకు దరఖాస్తు చేసుకున్నాయి. రేడియంట్‌ క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ తాజా షేర్ల జారీ ద్వారా రూ.60 కోట్లు సమీకరించనుంది. ఓఎఫ్‌ఎస్‌ ద్వారా 3 కోట్ల షేర్లను ప్రమోటర్‌ డేవిడ్‌ దేవసహాయం, ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అసెంట్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ ఇండియా విక్రయించనున్నారు. 2015లో అసెంట్‌ క్యాపిటల్‌ ఈ సంస్థలో 37.2 శాతం వాటాను కొనుగోలు చేసింది. వేరాందా ఐపీఓ ద్వారా రూ.200 కోట్లను సమీకరించబోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని