18000 దిగువకు నిఫ్టీ

ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలతో రెండో రోజూ సూచీల నష్టాలు కొనసాగాయి. మదుపర్ల అమ్మకాలతో నిఫ్టీ 18,000 పాయింట్ల దిగువకు చేరింది. ద్రవ్యోల్బణ భయాలు, ముడిచమురు ధరల జోరు మదుపర్ల

Published : 20 Jan 2022 01:41 IST

రెండు రోజుల్లో రూ.5.24 లక్షల కోట్ల సంపద ఆవిరి

సమీక్ష

ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలతో రెండో రోజూ సూచీల నష్టాలు కొనసాగాయి. మదుపర్ల అమ్మకాలతో నిఫ్టీ 18,000 పాయింట్ల దిగువకు చేరింది. ద్రవ్యోల్బణ భయాలు, ముడిచమురు ధరల జోరు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలూ తోడయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 14 పైసలు పెరిగి 74.44 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు లాభాల్లో కదలాడాయి.

* సూచీల నష్టాలతో బీఎస్‌ఈలో మదుపర్ల సంపద గత 2 ట్రేడింగ్‌ రోజుల్లో రూ.5.24 లక్షల కోట్లు తగ్గి రూ.274.77 లక్షల కోట్లకు చేరింది.

సెన్సెక్స్‌ ఉదయం 60,845.59 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైనా, వెంటనే నష్టాల్లోకి జారుకుంది. తదుపరి ఏదశలోనూ సూచీ కోలుకోలేదు. అమ్మకాలు స్థిరంగా కొనసాగడంతో ఒకదశలో 59,949.22 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 656.04 పాయింట్ల నష్టంతో 60,098.82 వద్ద ముగిసింది. జనవరి 7 తర్వాత సెన్సెక్స్‌కిదే కనిష్ఠ ముగింపు. నిఫ్టీ సైతం 174.65 పాయింట్లు క్షీణించి 17,938.40 దగ్గర స్థిరపడింది.

రూ.1000 దిగువకు పేటీఎం షేరు: పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేరు నష్టాలు కొనసాగుతున్నాయి. ఇంట్రాడేలో 4.5% నష్టపోయిన షేరు రూ.990 వద్ద జీవనకాల కనిష్ఠాన్ని తాకింది. చివరకు   4.33% తగ్గి రూ.997.35 వద్ద ముగిసింది. కంపెనీ ఇష్యూ ధర రూ.2150తో పోలిస్తే బీఎస్‌ఈలో షేరు ఇప్పటివరకు 54% పతనమైంది.

* త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు ఇంట్రాడేలో 3.82% పెరిగి    రూ.8043.50 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. అయితే లాభాల స్వీకరణ ఎదురుకావడంతో    2.28% తగ్గి రూ.7570.30 వద్ద ముగిసింది.

* ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ షేరు 2.68% లాభంతో రూ.311.95 వద్ద ముగిసింది.

* ఫలితాలు నిరాశపరచడంతో జస్ట్‌డయల్‌ షేరు 3.17% కోల్పోయి రూ.812.90 దగ్గర స్థిరపడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 22 డీలాపడ్డాయి. ఇన్ఫోసిస్‌ 2.77%, ఏషియన్‌ పెయింట్స్‌ 2.71%, హెచ్‌యూఎల్‌ 2.46%, నెస్లే 2.41%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.28% చొప్పున నష్టపోయాయి.


ఐజీఎక్స్‌లో 4.93% వాటా ఉపసంహరణ: ఐఈఎక్స్‌

కొనుగోలు చేసిన ఐఓసీ

దిల్లీ: ఇండియన్‌ గ్యాస్‌ ఎక్స్ఛేంజీలో (ఐజీఎక్స్‌) 4.93% ఈక్విటీ వాటాను ఉపసంహరించుకున్నట్లు ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజీ (ఐఈఎక్స్‌) వెల్లడించింది. ఈ వాటాను ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) కొనుగోలు చేసింది. ఐజీఎక్స్‌కు ఎనర్జీ ఎక్స్ఛేంజీ ఐఈఎక్స్‌, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నాయి. దేశంలో గ్యాస్‌ ట్రేడింగ్‌ను ప్రోత్సహించేందుకు ఈ గ్యాస్‌ ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేశారు. గెయిల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, టొరెంట్‌ గ్యాస్‌ ప్రై.లి., అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌లు సహజ వాయువు ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో వ్యూహాత్మక పెట్టుబడిదార్లుగా ఉన్నాయి.


మూడో ఏడాదీ ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్స్‌ ఎక్స్ఛేంజీగా ఎన్‌ఎస్‌ఈ

దిల్లీ: ప్రపంచంలో మూడో అతిపెద్ద డెరివేటివ్స్‌ ఎక్స్ఛేంజీగా వరుసగా మూడో ఏడాదీ నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) నిలిచింది. ఫ్యూచర్స్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ (ఎఫ్‌ఐఏ) వివరాల ప్రకారం.. 2021లో అంతర్జాతీయంగా ఈక్విటీ డెరివేటివ్స్‌, కరెన్సీ డెరివేటివ్స్‌లో ట్రేడైన కాంట్రాక్టుల సంఖ్య పరంగా ఎన్‌ఎస్‌ఈ ఈ ఘనత సాధించింది. వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎక్స్ఛేంజీస్‌ (డబ్ల్యూఎఫ్‌ఈ) గణాంకాల ప్రకారం 2021లో క్యాష్‌ ఈక్విటీస్‌ విభాగంలో లావాదేవీల సంఖ్యా పరంగా ఎన్‌ఎస్‌ఈ నాలుగో స్థానం దక్కించుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని