ఆర్థిక వ్యవస్థ పురోగతికి బడ్జెట్లో మరిన్ని చర్యలు అవసరం

కొవిడ్‌-19 ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు బడ్జెట్లో మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆర్థికవేత్తలు

Published : 20 Jan 2022 01:41 IST

ఎల్‌ఐసీ వాటా విక్రయం పూర్తితో ద్రవ్యస్థిరీకరణకు వీలు

ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు

దిల్లీ: కొవిడ్‌-19 ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు బడ్జెట్లో మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. కేవలం ద్రవ్య స్థిరీకరణపైనే దృష్టి పెట్టకుండా.. ఆర్థిక వ్యవస్థ పురోగతిని సుస్థిరపర్చే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ‘ఎల్‌ఐసీలో వాటా విక్రయాన్ని పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాలో రూ.3 లక్షల కోట్ల మిగులు నగదుతో కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఈ పరిణామం 2022-23 కల్లా ద్రవ్యలోటు 6.3 శాతం లోపునకు దిగివచ్చేందుకు దోహదం చేస్తుంద’ని ముందస్తు బడ్జెట్‌ పత్రంలో ఎస్‌బీఐ ముఖ్య ఆర్థిక వేత్త సౌమ్య కాంతి ఘోష్‌ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థలో ఇంకా పలు రంగాలకు చేయూత అవసరం ఉండటంతో బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని 30-40 బేసిస్‌ పాయింట్లకు మించి తగ్గించకూడదని ఆయన పేర్కొన్నారు. 2021-22లో 6.8- 7.1 శాతంగా ఉన్న ద్రవ్యోలోటును 2022-23కు 6- 6.5 శాతానికి తగ్గించవచ్చని చెబుతూ.. ద్రవ్యస్థిరీకరణ ఓ క్రమపద్ధతిలో జరిగేలా బడ్జెట్లో నిర్ణయాలు ఉండాలని పేర్కొన్నారు. కొత్త పన్నులు విధించడం లాంటివి చేయకూడదని, వీటి వల్ల ప్రయోజనం కంటే చేటే ఎక్కువగా కలుగుతుందని అభిప్రాయపడ్డారు. 2021-22కు అంచనా వేసిన రూ.38 లక్షల కోట్లతో పోలిస్తే 2022-23లో వ్యయాల వృద్ధి మరో 8 శాతం ఉండొచ్చని  అంచనా వేస్తూ, ఆదాయాలు 10.8 శాతం పెరగొచ్చని పేర్కొన్నారు. దీని వల్ల ద్రవ్యలోటు రూ.16.5 లక్షల కోట్లు లేదా జీడీపీలో 6.3 శాతానికి దిగిరావొచ్చని పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎమ్‌ఈలు) సంస్థలకు సహకారం అందించడాన్ని కొనసాగించాలని ఘోష్‌ చెప్పారు. అత్యవసర రుణ హామీ పథకాన్ని  2022-23 చివరి వరకు కొనసాగించడం మంచిదని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని