
స్వచ్ఛంద సెలవుపై భారత్‌పే ఎండీ
కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో వివాదం నేపథ్యం
దిల్లీ: ఆర్థిక సాంకేతిక సేవల సంస్థ భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) అశ్నీర్ గ్రోవర్ మార్చి చివరివరకు స్వచ్ఛందంగా సెలవు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ సిబ్బందిపై అసభ్య పదజాలాన్ని వాడారనే ఆరోపణలు గ్రోవర్‌పై ఇటీవల వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన సెలవుపై వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రోవర్ సెలవు నిర్ణయం వెనక ఉద్దేశాన్ని భారత్‌పే వెల్లడించలేదు. కేవలం సెలవు తీసుకుంటానని మాత్రమే ఆయన బోర్డుకు తెలియజేశారని కంపెనీ తెలిపింది. కంపెనీ, ఉద్యోగులు, మదుపర్లు, లక్షల సంఖ్యలోని వ్యాపారుల ప్రయోజనాల దృష్ట్యా అశ్నీర్ నిర్ణయాన్ని బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొంది. సీఈఓ సుహైల్ సమీర్, యాజమాన్య బృందం నేతృత్వంలో కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించింది. ‘నేను 2022, ఏప్రిల్ 1న లేదా అంతకంటే ముందే తిరిగి వస్తాను. ఆ లోపు మలివిడత ఉత్పత్తుల అభివృద్ధి, భారత్‌పే లాభదాయకత మార్గాలు, ఐపీఓ లాంటి అంశాలపై ఆలోచించేందుకు సమయాన్ని వెచ్చిస్తాన’ని గ్రోవర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
* నైకా పబ్లిక్ ఇష్యూ సందర్భంలో షేర్ల కేటాయింపు, రుణ మంజూరు వ్యవహారంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని ఆరోపిస్తూ, ఆ బ్యాంకు సిబ్బందితో అశ్నీర్ గ్రోవర్, ఆయన భార్య ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడారంటూ ఈ నెల ప్రారంభంలో ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఈ ఆడియోలో మాట్లాడింది తాము కాదంటూ గ్రోవర్ ఖండించారు. అయితే నైకా పబ్లిక్ ఇష్యూ సందర్భంలో షేర్ల కేటాయింపు, రుణ మంజూరు వ్యవహారంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని ఆరోపిస్తూ, రూ.500 కోట్ల పరిహారాన్ని కోరుతూ అశ్నీర్, మాధురి గ్రోవర్ దంపతులు 2021 అక్టోబరు 30న కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు లీగల్ నోటీసులు పంపిన విషయం ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది. గ్రోవర్ దంపతుల నుంచి లీగల్ నోటీసులు వచ్చిన విషయాన్ని కోటక్ మహీంద్రా బ్యాంకు ధ్రువీకరించింది. ఈ వ్యవహారానికి సంబంధించి గ్రోవర్ దంపతులపై న్యాయపరమైన చర్యలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు జనవరి 9న కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.