సంక్షిప్త వార్తలు

అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం ఫైజర్‌ ఇంక్‌ ఛైర్మన్‌, ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) ఆల్బర్ట్‌ బౌర్లాకు ప్రతిష్ఠాత్మక జెనిసిస్‌ బహుమతి లభించింది. కొవిడ్‌-19 టీకా అభివృద్ధి ప్రక్రియను ఆయన

Published : 20 Jan 2022 01:40 IST

ఫైజర్‌ ఛైర్మన్‌ ఆల్బర్ట్‌ బౌర్లాకు ప్రతిష్ఠాత్మక జెనిసిస్‌ బహుమతి

కొవిడ్‌-19 టీకా అభివృద్ధిలో  చేసిన కృషికి గుర్తింపు

జెరూసలేం: అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం ఫైజర్‌ ఇంక్‌ ఛైర్మన్‌, ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) ఆల్బర్ట్‌ బౌర్లాకు ప్రతిష్ఠాత్మక జెనిసిస్‌ బహుమతి లభించింది. కొవిడ్‌-19 టీకా అభివృద్ధి ప్రక్రియను ఆయన ముందుండి నడిపించిన తీరు, చేసిన విశేష కృషికి ఈ గౌరవం దక్కింది. వృత్తిలో సాధించిన విజయాలు, మానవతా సేవలు, యూదుల (జ్యూయిస్‌) విలువలకు కట్టుబడి ఉండటం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏటా ఒకరికి 1 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7.5 కోట్లు) బహుమతిని జెనిసిస్‌ ఫ్రైజ్‌ ఫౌండేషన్‌ అందజేస్తోంది. ఈసారి 71 దేశాల నుంచి సుమారు 2,00,000 మంది ఆన్‌లైన్‌ ద్వారా వేసిన ఓట్లలో అత్యధికంగా బౌర్లాకే వచ్చాయని ఫౌండేషన్‌ తెలిపింది. గ్రీక్‌ సంతతికి చెందిన బౌర్లా.. ఈ బహుమతి కింద వచ్చిన డబ్బును హోలికాస్ట్‌ బాధితులకు (జర్మనీ నాజీ ప్రభుత్వం చేతిలో బాధింపబడిన కుటుంబాలు) ముఖ్యంగా గ్రీస్‌కు చెందిన వారి సంస్మరణ నిమిత్తం చేపట్టే కార్యక్రమాలకు వినియోగించనున్నారని ఫౌండేషన్‌ వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా నాజీల చేతిలో అంతరించిపోయిన తెస్సాలనికి యూదు జాతిలో బయటపడిన కొద్ది మందిలో బౌర్లా తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ‘ప్రపంచానికి ఏర్పడిన అత్యవసర ఆపద సమయంలో, తక్షణం స్పందించిన మా ఫైజర్‌ సహోద్యోగుల తరపున నేను ఈ బహుమతిని స్వీకరిస్తున్నానని బౌర్లా చెప్పినట్లు ఫౌండేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.


విద్యుత్‌ వాహనాల తయారీకి హీరో ఎలక్ట్రిక్‌, మహీంద్రా జట్టు

దిల్లీ: విద్యుత్‌ వాహనాల విభాగానికి సంబంధించి హీరో ఎలక్ట్రిక్‌తో మహీంద్రా గ్రూపు వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హీరో ఎలక్ట్రిక్‌కు చెందిన ప్రధాన ఎలక్ట్రిక్‌ బైక్‌ మోడళ్లు ఆప్టిమా, ఎన్‌వైఎక్స్‌లను మధ్యప్రదేశ్‌లోని పితామ్‌పుర్‌ ప్లాంటులో మహీంద్రా గ్రూపు తయారు చేయనుంది. డిమాండుకు అనుగుణంగా సరఫరా చేసేందుకు వాహనాల తయారీని మహీంద్రా చేపట్టనుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. దీంతో పాటు లుధియానా ప్లాంటును కూడా హీరో విస్తరించనుంది. తద్వారా 2022 చివరి కల్లా సంవత్సరానికి 10 లక్షల విద్యుత్తు వాహనాలను తయారు చేసే సామర్థ్యాన్ని హీరో సాధించనుంది. ‘అగ్రగామి సంస్థగా తన ఉనికిని, స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే ఉద్దేశంతో మహీంద్రా గ్రూపుతో ఒప్పందాన్ని హీరో ఎలక్ట్రిక్‌ ప్రకటించింది. ఈ పరిణామంతో 3, 4 చక్రాల వాహనాల్లోనూ విద్యుత్తు మోడళ్లు ప్రవేశపెట్టే అవకాశం ఏర్పడుతుంద’ని హీరో ఎలక్ట్రిక్‌ ఎండీ నవీన్‌ ముంజాల్‌ తెలిపారు. మహీంద్రాకు చెందిన అతిపెద్ద సరఫరా వ్యవస్థను ఉపయోగించుకుని కొత్త ప్రాంతాల్లోకి అడుగుపెట్టేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుందన్నారు.  సమీప భవిష్యత్‌లో మరిన్ని అంశాల్లో మహీంద్రా గ్రూపుతో కలిసి ముందుకు వెళ్లాలని అనుకుంటున్నామని చెప్పారు.


బయోఫోర్‌ నుంచి కొవిడ్‌ ఔషధం ‘నిర్మాట్రెల్విర్‌’ 

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అత్యవసర అనుమతి మంజూరు చేసిన ‘కొవిడ్‌’ ఔషధం-  ‘పాక్స్లోవిడ్‌’ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన నిర్మాట్రెల్విర్‌ అనే ఏపీఐను  (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్‌) హైదరాబాద్‌కు చెందిన బయోఫోర్‌ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌ ఉత్పత్తి చేయనుంది. హైదరాబాద్‌ సమీపంలోని తమ యూనిట్లో ఉత్పత్తి చేయనున్నట్లు బయోఫోర్‌ ఇండియా వెల్లడించింది. దీని కోసం చైనాపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొంది. అగ్రశ్రేణి ఫార్మా కంపెనీ ఫైజర్‌, ‘పాక్స్లోవిడ్‌’ ఔషధాన్ని కొవిడ్‌ చికిత్సలో వినియోగించడానికి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి ఇటీవల అనుమతి పొందింది. ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి కొవిడ్‌ లక్షణాలున్న వారికి ఈ ఔషధంతో చికిత్స చేస్తే, ఆసుపత్రి పాలయ్యే అవసరం ఉండదని భావిస్తున్నారు. నిర్మాట్రెల్విర్‌, రిటనావిర్‌ మందుల మిశ్రమంతో పాక్స్లోవిడ్‌ ఔషధాన్ని రూపొందించారు. కొవిడ్‌ చికిత్స కోసం ఇంతకుముందు రూపొందించిన యాంటీ-వైరల్‌ ఔషధాలతో పోల్చితే నిర్మాట్రెల్విర్‌ ఏపీఐ ఉత్పత్తి చేయడం ఎంతో సంక్లిష్ట ప్రక్రియగా బయోఫోర్‌ సీఈఓ డాక్టర్‌ జగదీష్‌ బాబు పేర్కొన్నారు. అవసరమైన ముడిపదార్థాలను సొంతంగా సిద్ధం చేసుకుంటున్నామన్నారు.


వీడియోకాన్‌ దివాలా పరిష్కారానికి మళ్లీ బిడ్లు

దిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌, దాని 12 విభాగాలపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్‌లను రుణ సంస్థలు మళ్లీ ఆహ్వానించాయి. బిడ్‌ల సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి 2గా నిర్ణయించాయి. ఈ మేరకు దివాలా వృత్తి నిపుణుడు (ఆర్‌పీ) ప్రకటించారు. ఇంతకుముందు విజయవంత బిడ్డర్‌గా నిలిచిన ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ ప్రతిపాదించిన ప్రణాళిక, దివాలా చట్ట మార్గదర్శకాలకు తగ్గట్లుగా లేదంటూ, దానిని రద్దు చేస్తూ జనవరి 5న అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దివాలా పరిష్కార ప్రక్రియను పూర్తి చేసే బాధ్యతను తిరిగి రుణసంస్థల కమిటీకి అప్పగించింది. దీంతో ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) బిడ్‌లను ఆహ్వానించే ప్రక్రియను ప్రారంభించేందుకు కమిటీలోని మెజార్టీ రుణ సంస్థలు మొగ్గు చూపినట్లు ఈ పరిణామాన్ని గమనిస్తున్న వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2ను గడువుగా పేర్కొంటూ మళ్లీ బిడ్‌లను రుణ సంస్థలు ఆహ్వానించాయి. వేణుగోపాల్‌ ధూత్‌ నేతృత్వంలోని వీడియోకాన్‌ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించేందుకు 2018 జూన్‌లో ఎన్‌సీఎల్‌టీ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. వీడియోకాన్‌, దాని 12 విభాగ సంస్థల నుంచి రూ.58,519 కోట్ల మేర బకాయిలు రావాలంటూ రుణ సంస్థలు క్లెయిమ్‌ చేశాయి.


రీఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గింది

ఈనాడు, హైదరాబాద్‌: సాధారణ బీమా సంస్థలు వసూలు చేసిన ప్రీమియం నుంచి రీ ఇన్సూరెన్స్‌ సంస్థ జీఐసీకి చెల్లించాల్సిన తప్పనిసరి మొత్తం వాటాను తగ్గించాలని ఐఆర్‌డీఏఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల మేరకు ప్రతి పాలసీకి వసూలు చేసిన ప్రీమియంలో 5 శాతాన్ని జీఐసీకి బీమా సంస్థలు చెల్లించాలి. దీనిని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 4 శాతం చేస్తున్నట్లు నియంత్రణ సంస్థ బుధవారం వెల్లడించింది. సాధారణ బీమా సంస్థలు తాము ఇచ్చిన పాలసీలను దేశీయ రీఇన్సూరెన్స్‌ సంస్థ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా దగ్గర రీ ఇన్సూరెన్స్‌ చేయిస్తాయి. దీనికోసం చెల్లించే మొత్తం 1% తగ్గుతున్నందున, మరింత నష్టానికి రీఇన్సూరెన్స్‌ చేసే వీలు బీమా సంస్థలకు లభిస్తుంది. అయితే, ఇది జీఐసీపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. బీమా నియంత్రణ సంస్థ ఈ ప్రీమియాన్ని తగ్గిస్తూ వస్తోంది.


విమానయానంపై పరోక్ష పన్నుల భారం

ఇండిగో సీఈఓ రోనోజాయ్‌ దత్తా

దిల్లీ: పౌర విమానయాన పరిశ్రమ తమ ఆదాయాల్లో 21 శాతాన్ని పరోక్ష పన్నులుగా చెల్లించాల్సి వస్తున్న ఫలితంగా పెనుభారం పడుతోందని ఇండియా సీఈఓ రోనోజాయ్‌ దత్తా పేర్కొన్నారు. విమాన ఇంధనంపై కేంద్ర ఎక్సైజ్‌ సుంకాలను 11 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ఆర్థిక శాఖను కోరారు. విమాన మరమ్మతు భాగాలపై కస్టమ్స్‌ సుంకాన్ని మినహాయించాలని దత్తా అభ్యర్థించారు. దేశంలో మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనలో విమానయాన పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించడానికే 21 శాతం మార్జిన్‌ ఆర్జించాల్సి రావడం సహేతుకం కాదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక శాఖ ఈ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.


ఫోర్డ్‌ 2 లక్షల కార్లు వెనక్కి

డెట్రాయిట్‌: అమెరికాలో దాదాపు 200000 కార్లను వాహన సంస్థ ఫోర్డ్‌ వెనక్కి పిలిపిస్తోంది. బ్రేక్‌ లైట్లు ఆగిపోకుండా తలెత్తిన సమస్యను సరిచేయడానికి కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 2014, 2015 ఫోర్డ్‌ ఫ్యూజన్‌, లింకన్‌, ఎంకేజడ్‌ మధ్య శ్రేణి కార్లతో పాటు 2015 మస్టాంగ్‌ మోడళ్లు ఇందులో ఉన్నాయి. డీలర్లు బ్రేక్‌, క్లచ్‌ పెడల్‌ బంపర్‌లను భర్తీ చేయనున్నారు.


జియో స్పెక్ట్రమ్‌ చెల్లింపులు రూ.30,791 కోట్లు

దిల్లీ: టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో 2021 మార్చి వరకు వేలంలో దక్కించుకున్న స్పెక్ట్రమ్‌కు సంబంధించిన చెల్లింపులను వడ్డీతో కలిపి రూ.30,791 కోట్లు చెల్లించినట్లు బుధవారం వెల్లడించింది. 2014, 2015, 2016 సంవత్సరాల్లో నిర్వహించిన వేలంలో దక్కించుకున్న స్పెక్ట్రమ్‌తో పాటు 2021లో భారతీ ఎయిర్‌టెల్‌తో చేసుకున్న వినియోగ ఒప్పందం కింద పొందిన స్పెక్ట్రమ్‌కు కూడా చెల్లింపులు పూర్తిగా చేసినట్లు తెలిపింది. వేలం, ట్రేడింగ్‌ ద్వారా 585.3 మెగాహెర్ట్జ్‌ల స్పెక్ట్రమ్‌ను జియో సొంతం చేసుకుంది. ఈ ముందస్తు చెల్లింపుల ద్వారా కంపెనీకి వార్షికంగా రూ.1,200 కోట్ల వడ్డీ ఆదా అవుతుందని కంపెనీ తెలిపింది. 2021 సెప్టెంబరులో ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీ కింద టెలికాం సంస్థలు స్పెక్ట్రమ్‌ సంబంధిత చెల్లింపుల కోసం నాలుగేళ్ల మారటోరియం వినియోగించుకోవచ్చు. ఇప్పుడు మొత్తం చెల్లింపులు చేయడంతో ఈ అవకాశాన్ని జియో వదులుకున్నట్లయ్యింది.


బయోఫోర్‌ నుంచి కొవిడ్‌ ఔషధం ‘నిర్మాట్రెల్విర్‌’

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అత్యవసర అనుమతి మంజూరు చేసిన ‘కొవిడ్‌’ ఔషధం- ‘పాక్స్లోవిడ్‌’ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన నిర్మాట్రెల్విర్‌ అనే ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్‌) ను హైదరాబాద్‌కు చెందిన బయోఫోర్‌ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌ ఉత్పత్తి చేయనుంది. హైదరాబాద్‌ సమీపంలో యూఎస్‌ఎఫ్‌డీఏ ప్రమాణాలు గల తమ యూనిట్లో ఈ ఏపీఐని ఉత్పత్తి చేయనున్నట్లు బయోఫోర్‌ ఇండియా వెల్లడించింది. దీని కోసం చైనాపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొంది. అగ్రశ్రేణి ఫార్మా కంపెనీ ఫైజర్‌, ‘పాక్స్లోవిడ్‌’ ఔషధాన్ని కొవిడ్‌ చికిత్సలో వినియోగించడానికి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి ఇటీవల అనుమతి పొందింది. ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి కొవిడ్‌ లక్షణాలున్న వారికి ఈ ఔషధంతో చికిత్స చేస్తే, ఆసుపత్రి పాలయ్యే అవసరం ఉండదని, ప్రాణాపాయం తప్పి, త్వరగా కోలుకుంటారని భావిస్తున్నారు. నిర్మాట్రెల్విర్‌, రిటనావిర్‌ అనే మందుల మిశ్రమంతో పాక్స్లోవిడ్‌ ఔషధాన్ని రూపొందించారు. కొవిడ్‌ చికిత్స కోసం ఇంతకుముందు రూపొందించిన యాంటీ-వైరల్‌ ఔషధాలతో పోల్చితే నిర్మాట్రైల్విర్‌ ఏపీఐ ఉత్పత్తి చేయడం ఎంతో సంక్లిష్ట ప్రక్రియగా బయోఫోర్‌ సీఈఓ డాక్టర్‌ జగదీష్‌ బాబు పేర్కొన్నారు. దీనికి అవసరమైన ముడిపదార్థాలను తాము సొంతంగా సిద్ధం చేసుకుంటున్నామని, భారీ మోతాదులో ఈ మందు ఉత్పత్తి చేయగల సామర్థ్యం తమకు ఉందని అన్నారు.


జీవిత కాల సభ్యుడి కోసం దరఖాస్తుల ఆహ్వానం: ఐఆర్‌డీఏఐ

ఈనాడు, హైదరాబాద్‌: భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ)లో జీవిత కాల (నాన్‌-లైఫ్‌) సభ్యుడి నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సాధారణ, ఆరోగ్య బీమా రంగంలో 25 ఏళ్ల అనుభవం ఉండి, ఆర్థిక సేవల విభాగంలో సీనియర్‌ స్థాయిలో పనిచేసిన వారు ఈ పదవికి అర్హులు. ఆర్‌బీఐలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయి, ఇతర ఆర్థిక సంస్థలు, నియంత్రణ సంస్థల్లో ఆ స్థాయిలో పనిచేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వంలో పనిచేసిన వారు అదనపు కార్యదర్శి హోదాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసి ఉండాలి. 60 ఏళ్లలోపు వయసు ఉన్నవారు ఈ పదవికి అర్హులు. ఫిబ్రవరి 15లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఐఆర్‌డీఏఐలో ఛైర్మన్‌ సహా అయిదుగురు జీవిత కాల సభ్యులు, నలుగురు పార్ట్‌ టైం సభ్యులు ఉంటారు. ప్రస్తుతం ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని