Published : 21 Jan 2022 02:53 IST

సంక్షిప్త వార్తలు

భారతీయ విక్రేతలకు వాల్‌మార్ట్‌ ఆహ్వానం

దిల్లీ: రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ ఎంపిక చేసిన భారతీయ విక్రేతలను తమ మార్కెట్‌ప్లేస్‌లో చేరమని గురువారం ఆహ్వానించింది. అమెరికాలో ప్రతి నెలా 12 కోట్ల కొనుగోలుదార్లకు వాల్‌మార్ట్‌ సేవలందిస్తోంది. భారత్‌ నుంచి ఇప్పటికే అధికంగా సరకును వాల్‌మార్ట్‌ తీసుకెళ్తోంది. 2027 నాటికి మన దేశం నుంచి ఏటా 1,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.75,000 కోట్ల) ఉత్పత్తులను తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని వాల్‌మార్ట్‌ నిర్దేశించుకుంది. 20 ఏళ్లకు పైగా వాల్‌మార్ట్‌తో కలిసి పనిచేస్తున్న భారతీయ ఎగుమతిదార్ల విస్తరణకు ఈ చొరవ దోహదం చేస్తుందని కంపెనీ తెలిపింది. భారతీయ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటా వాల్‌మార్ట్‌ ఆధీనంలోనే ఉంది.  


సైయెంట్‌ లాభంలో 38 శాతం వృద్ధి

ఈనాడు, హైదరాబాద్‌: సైయెంట్‌ లిమిటెడ్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. మొత్తం రూ.1,183.4 కోట్ల ఆదాయంపై రూ.131.7 కోట్ల నికరలాభం నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంతో పోల్చితే ఆదాయం 13.3%, లాభం 38% పెరిగాయి. ఎబిటా (వడ్డీ, తరుగుదల, పన్ను, ఇతర కేటాయింపుల కంటే ముందు లాభం) మిగులు 13.9% ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఆఫ్‌షోరింగ్‌ వాటా 51.3% కాగా, గత రెండున్నరేళ్లలో ఇదే అత్యధికం. ప్రస్తుత మూడో త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించినట్లు కంపెనీ ఎండీ-సీఈఓ కృష్ణ బొదనపు తెలిపారు.  భవిష్యత్తు అవసరాల కోసం నైపుణ్యం గల మానవ వనరులను  సిద్ధంగా ఉంచుకునే లక్ష్యంతో టెక్నాలజీ లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ (టీఎల్‌పీ)ని ఆవిష్కరించినట్లు చెప్పారు.


సైరాతో ఎల్‌ఎంఎల్‌ ఎలక్ట్రిక్‌ జట్టు

దిల్లీ: విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేసేందుకు సైరా ఎలక్ట్రిక్‌ ఆటోతో ఎల్‌ఎంఎల్‌ ఎలక్ట్రిక్‌ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు గురువారం వెల్లడించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఎల్‌ఎంఎల్‌ అభివృద్ధి చేసే విద్యుత్తు వాహనాలను, సైరాకు హరియాణాలోని బావల్‌లో ఉన్న ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. 2,17,800 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ ప్లాంటులో నెలకు సుమారు 18,000 వాహనాలను ఉత్పత్తి చేయొచ్చని సంస్థ తెలిపింది.. ‘సైరా ప్రపంచంలోని కొన్ని ప్రీమియం ఆటో బ్రాండ్లతో సమానంగా నైపుణ్యం, ఖ్యాతి కలిగి ఉంది. అందుకే మా కంపెనీ భాగస్వామ్యం కుదర్చుకునేందుకు ఈ సంస్థకు ప్రాధాన్యం ఇచ్చామ’ని ఎల్‌ఎంఎల్‌ ఎలక్ట్రిక్‌ సీఈఓ యోగేశ్‌ భాటియా వెల్లడించారు.


శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు వన్‌ వెబ్‌, హ్యూస్‌ ఆరేళ్ల ఒప్పందం

దిల్లీ: దేశవ్యాప్తంగా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించేందుకు ఆరేళ్ల డిస్ట్రిబ్యూషన్‌ ఒప్పందాన్ని భారతీ గ్రూప్‌నకు చెందిన వన్‌వెబ్‌, శాటిలైట్‌ సేవల సంస్థ హ్యూస్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌ కుదుర్చుకున్నాయి. భారత్‌లో ఈ సేవలను సంయుక్త సంస్థ హ్యూస్‌ కమ్యూనికేషన్స్‌ ఇండియా ద్వారా హ్యూస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ అందించనున్నాయి. 2021 సెప్టెంబరులో ఇరు కంపెనీలు అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోగా.. తాజాగా డిస్ట్రిబ్యూషన్‌ ఒప్పందంపై సంతకాలు చేశాయి. డిజిటల్‌ ఇండియాలో ఇది కీలక పరిణామమని, టెలికాం సేవల సంస్థలు, బ్యాంకులు, ఫ్యాక్టరీలు, స్కూళ్లు, రక్షణ సంస్థలు, దేశీయ విమానయాన సంస్థలు సహా అన్ని రంగాలు శాటిలైట్‌ సేవల కోసం చూస్తున్నట్లు హ్యూస్‌ కమ్యూనికేషన్స్‌ ఇండియా అధ్యక్షుడు, ఎండీ పార్థో బెనర్జీ తెలిపారు. వన్‌వెబ్‌సామర్థ్యాలతో హైస్పీడ్‌ సేవలు అందించనున్నట్లు వివరించారు. 2021 డిసెంబరు 27న వన్‌వెబ్‌ తాజా శాటిలైట్‌ను ప్రారంభించింది. దీంతో మొత్తం ఇన్‌-ఆర్బిట్‌ శాటిలైట్‌ల సంఖ్య 394కు చేరింది. 2022 చివరికి అంతర్జాతీయ సేవలు ప్రారంభించాలని కంపెనీ చూస్తోంది.


6జీ పరిజ్ఞానం అభివృద్ధికి జియో, ఫిన్లాండ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఓలు జట్టు

దిల్లీ: 6జీ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో పరస్పరం సహకరించుకునేందుకు జియో ఈస్తోనియా విభాగం, ఫిన్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ ఓలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. వ్యాపారవేత్తలకు కూడా ఊతమందించనున్నాయి. యూనివర్సిటీతో భాగస్వామ్యంతో జియో 5జీ సామర్థ్యాల పొడిగింపుతో పాటు 6జీ సాంకేతికతలో పాలుపంచుకునే అవకాశం ఉంది. టెలికాం సంస్థ రిలయన్స్‌ జియోకు మాతృసంస్థగా జియో ప్లాట్‌ఫామ్స్‌ ఉంది. ‘ప్రపంచంలో మొట్టమొదటి 6జీ పరిశోధన కార్యక్రమంలో అగ్రగామిగా ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ ఓలు వైర్‌లెస్‌ కమ్యూనికేషన్స్‌పై దృష్టిపెట్టింది. జియో ఈస్తోనియా, రిలయన్స్‌ గ్రూప్‌తో కలిసి పనిచేయడానికి చూస్తున్నాం. భవిష్యత్‌ వైర్‌లెస్‌ సొల్యూషన్‌లకు ఇది ఉపయోగపడుతుంద’ని యూనివర్సిటీ డైరెక్టర్‌ మ్యాటీ లాత్వా అహో పేర్కొన్నారు.


హెచ్‌సీఎల్‌ టెక్‌ దివాలా చర్యలపై స్టే

దిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీపై దివాలా చర్యలు ఆరంభించాలన్న జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఈనెల 17న ఇచ్చిన ఆదేశాలపై జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) స్టే మంజూరు చేసింది. తమకు రూ.3.54 కోట్లను హెచ్‌సీఎల్‌ టెక్‌ ఎగవేసిందంటూ సహజ్‌ భర్తి ట్రావెల్స్‌ చేసిన ఫిర్యాదు మేరకు దివాలా ప్రక్రియ చేపట్టాలని ఎన్‌సీఎల్‌టీ నిర్ణయించగా, ఆ ఆదేశాలను హెచ్‌సీఎల్‌ టెక్‌ ఎండీ-సీఈఓ సి.విజయకుమార్‌ ఎన్‌సీఎల్‌ఏటీలో ఫిర్యాదు చేశారు.


సియట్‌ టైర్ల ధరలు 2 వరకు ప్రియం!

చెన్నై: ప్రస్తుత త్రైమాసికంలో టైర్ల ధరలను 2 శాతం వరకు పెంచడానికి సియట్‌ సన్నాహాలు చేస్తోంది. ముడి వస్తువుల ధరలు పెరగడమే ఇందుకు కారణమని కంపెనీ ఎండీ అనంత్‌ గోయెంకా అనలిస్ట్‌ కాల్‌లో పేర్కొన్నారు. ముడిచమురు ధరల వల్ల ముడివస్తువుల ధరలు 1.5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. గత 12 నెలల్లో సహజ రబ్బరు, ముడిచమురు ధరలు 40 శాతం వరకు పెరిగాయి. గత త్రైమాసికంలోనూ ఉత్పత్తుల ధరలను కంపెనీ 2 శాతం  పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాల ప్రణాళికలను సైతం రూ.1000 కోట్ల నుంచి రూ.800 కోట్లకు సియట్‌ తగ్గించుకుంది.


యెస్‌ బ్యాంక్‌ మాజీ ఎండీ, సీఈఓ రాణా కపూర్‌కు బెయిల్‌ నిరాకరణ

దిల్లీ: యెస్‌ బ్యాంక్‌కు రూ.466.51 కోట్ల మేర నష్టం వచ్చేందుకు కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న, మనీ లాండరింగ్‌ కేసులోని ఆ బ్యాంక్‌ మాజీ ఎండీ, సీఈఓ రాణా కపూర్‌కు దిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసేందుకు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను గురువారం తోసిపుచ్చింది. రాణాపై వచ్చిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి కావడంతోనే బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసినట్లు ప్రత్యేక న్యాయమూర్తి సంజీవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని