Diabetes: మధుమేహ వ్యాధి బాధితులకు ఇన్సులిన్‌ బదులు ‘సెమాగ్లుటైడ్‌’ మాత్ర

బహుళ జాతి ఫార్మా కంపెనీ అయిన నోవో నార్డిస్క్‌, మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం నోటిద్వారా తీసుకునే ‘సెమాగ్లుటైడ్‌’ మాత్రను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రపంచంలోనే మొదటి ‘పెప్టైడ్‌ ఇన్‌ ఏ పిల్‌’ ఇదేనని నోవో

Updated : 21 Jan 2022 07:22 IST

నోవో నార్డిస్క్‌ ఆవిష్కరణ

దిల్లీ: బహుళ జాతి ఫార్మా కంపెనీ అయిన నోవో నార్డిస్క్‌, మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం నోటిద్వారా తీసుకునే ‘సెమాగ్లుటైడ్‌’ మాత్రను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రపంచంలోనే మొదటి ‘పెప్టైడ్‌ ఇన్‌ ఏ పిల్‌’ ఇదేనని నోవో నార్డిస్క్‌ వెల్లడించింది. రక్తంలో గ్లూకోజును నియంత్రణలో ఉంచుకోడానికి ఇంజెక్షన్‌ ద్వారా ఇన్సులిన్‌ తీసుకోడానికి వెనకాడుతూ, నోటిద్వారా తీసుకునే మందులకే పరిమితం కావాలనుకునే వారికి ‘సెమాగ్లుటైడ్‌’ వినూత్న పరిష్కారమని ఈ సంస్థ పేర్కొంది. ఇప్పటివరకు ఈ ఔషధం ఇంజెక్షన్ల రూపంలోనే అందుబాటులో ఉండగా, తొలిసారిగా నోటితో తీసుకునే మాత్ర రూపంలో తీసుకువచ్చినట్లు వెల్లడించింది. దాదాపు 15 ఏళ్ళ పాటు నిరంతర పరిశోధన- అభివృద్ధి ప్రక్రియ ద్వారా దీన్ని ఆవిష్కరించినట్లు వివరించింది. ఈ ఆవిష్కరణకు గానూ గత ఏడాదిలో ప్రిక్స్‌ గేలియన్‌ అవార్డు అందుకున్నామని, బయోటెక్‌ పరిశ్రమలో ఇది అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు అని తెలియజేసింది. నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్‌ మాత్రను అభివృద్ధి  చేయడానికి భారతదేశంతో పాటు పలు దేశాల్లో 10 వేల మందికి పైగా వాలంటీర్లపై పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఇందులో వెయ్యి మందికి పైగా భారతీయులు ఉన్నట్లు పేర్కొంది. ఈ పరీక్షల్లో ఎంతో ఉత్తమ ఫలితాలను సాధించినట్లు స్పష్టం చేసింది. ఈ మాత్రతో మధు మేహవ్యాధి చికిత్సలో వినూత్న మార్పులు వస్తాయని ఆశిస్తున్నట్లు నోవో నార్డిస్క్‌ ఇండియా ఎండీ విక్రాంత్‌ శోత్రీయ పేర్కొన్నారు. నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్‌ మాత్రకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) గత ఏడాదిలో అనుమతి ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని