
3 రోజుల్లో 1844 పాయింట్లు హాంఫట్
60,000 దిగువకు సెన్సెక్స్
రూ.6.80 లక్షల కోట్ల సంపద ఆవిరి
సమీక్ష
సూచీల భారీ నష్టాలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. ఐటీ, ఇంధన, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 60,000 పాయింట్ల దిగువకు చేరింది. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 1844 పాయింట్లు, నిఫ్టీ 551 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. బలహీన రూపాయి, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడం మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 74.51 వద్ద ముగిసింది.
* వరుస నష్టాల నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ గత మూడు ట్రేడింగ్ రోజుల్లో రూ.6.80 లక్షల కోట్లు తగ్గి రూ.273.21 లక్షల కోట్లకు చేరింది.
* సెన్సెక్స్ ఉదయం 60,045.48 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది.అమ్మకాల ఒత్తిడితో రోజంతా నష్టాల్లోనే కదలాడిన సూచీ.. ఇంట్రాడేలో 59,068.31 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. చివర్లో కొద్దిగా కోలుకుని 634.20 పాయింట్ల నష్టంతో 59,464.62 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 181.40 పాయింట్లు కోల్పోయి 17,757 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,648.45 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదుచేసింది.
* త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో ర్యాలీస్ ఇండియా షేరు 5.85 శాతం నష్టంతో రూ.277.40 వద్ద ముగిసింది.
* కంపెనీ బోర్డుకు ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు రాజీనామా చేయడంతో పీటీసీ ఇండియా షేరు 19.49 శాతం క్షీణించి రూ.20.65 దగ్గర స్థిరపడింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.