విలాస గృహాలకు తగ్గని గిరాకీ

వచ్చే రెండేళ్లలో రూ.5 కోట్ల కంటే అధిక విలువైన విలాస గృహాలు కొనుగోలు చేయడానికి దాదాపు 75 శాతం మంది కుబేరులు చూస్తున్నట్లు ఒక సర్వే పేర్కొంది. పెద్ద నగరాలు, పర్యాటక ప్రాంతాల్లో వీటిని కొనుగోలు చేయాలని

Published : 21 Jan 2022 03:15 IST

రూ.5 కోట్లు పైబడిన ఆస్తులపై సంపన్నుల చూపు
ఇండియా సోత్‌బైస్‌ ఇంటర్నేషనల్‌ సర్వే

దిల్లీ: వచ్చే రెండేళ్లలో రూ.5 కోట్ల కంటే అధిక విలువైన విలాస గృహాలు కొనుగోలు చేయడానికి దాదాపు 75 శాతం మంది కుబేరులు చూస్తున్నట్లు ఒక సర్వే పేర్కొంది. పెద్ద నగరాలు, పర్యాటక ప్రాంతాల్లో వీటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారని పేర్కొంది. విలాస స్థిరాస్తి రంగంలో అగ్రగామి బ్రోకరేజీ సంస్థ అయిన ఇండియా సోత్‌బైస్‌ ఇంటర్నేషనల్‌ రియాల్టీ 200 మంది హెచ్‌ఎన్‌ఐలు (అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు), సంపన్నుల నుంచి వివరాలు సేకరించి, ఈ నివేదిక రూపొందించింది. భారత్‌లోని 8 అగ్రగామి నగరాలు - హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, పుణె, చెన్నై, గోవాల్లో సర్వే చేపట్టామని సంస్థ తెలిపింది. భారత్‌లో సంపన్నుల స్థిరాస్తి సెంటిమెంట్‌లో బలమైన వృద్ధి ఉందని వివరించింది.

* 76 శాతం మంది స్థిరాస్తి కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఇందులో 89 శాతం మంది విలాస గృహాలు (నగర అపార్ట్‌మెంట్‌లు, బంగ్లాలు, విడిది ఇళ్లు) కోరుకుంటున్నారు. మిగిలిన 11 శాతం మంది ప్రీమియం వాణిజ్య స్థిరాస్తి ఆస్తుల వైపు చూస్తున్నారు.

* గత 18 నెలల్లో దాదాపు 26 శాతం మంది స్థిరాస్తి కొనుగోళ్లు చేశారు. ముఖ్యంగా జీవనశైలి స్థాయి పెంచుకోవడం, పెట్టుబడి అవకాశాలే ఇందుకు కారణం. గత 2-3 ఏళ్లలో కొవిడ్‌ సంక్షోభం ఉన్నప్పటికీ.. వ్యక్తిగత అవసరాల కోసం హెచ్‌ఎన్‌ఐలు, యూహెచ్‌ఎన్‌ఐలు విలాస ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు.

* 29 శాతం మంది సెలవుల్లో గడిపేందుకు ప్రత్యేకమైన ఇల్లు కావాలని అనుకుంటున్నారు. 69 శాతం మంది రూ.10-25 కోట్ల మధ్య విలాస అపార్ట్‌మెంట్‌, విల్లా కోసం చూస్తున్నారు. రూ.5-10 కోట్ల మధ్య నివాసాల కోసం 21 శాతం మంది, రూ.25 కోట్లు అంతకంటే విలువైనవి 10 శాతం మంది కోరుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని