సాహసోపేత నిర్ణయాలతోనే

అమెరికా- భారత్‌ల మధ్య 500 బి.డాలర్ల (సుమారు రూ. 37.50 లక్షల కోట్ల) ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని సాధించాలంటే.. ఇరు దేశాలు సాహసోపేత నిర్ణయాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అమెరికా

Published : 22 Jan 2022 04:10 IST

500 బి.డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం

యూఎస్‌ఐబీసీ కొత్త అధ్యక్షుడు అతుల్‌ కేశప్‌

దిల్లీ: అమెరికా- భారత్‌ల మధ్య 500 బి.డాలర్ల (సుమారు రూ. 37.50 లక్షల కోట్ల) ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని సాధించాలంటే.. ఇరు దేశాలు సాహసోపేత నిర్ణయాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అమెరికా ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూఎస్‌ఐబీసీ) కొత్త అధ్యక్షుడు అతుల్‌ కేశప్‌ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఇటీవలి కాలంలో గణనీయంగా మెరుగు పడ్డాయని, మరో కొత్త స్థాయికి తీసుకెళ్లాల్సి ఉందని వివరించారు. ‘21వ శతాబ్దంలో ప్రపంచ వృద్ధి, సంపద సృష్టి విధానం, అభివృద్ధికి అమెరికా, భారత్‌లు చోదకాలుగా పనిచేస్తాయ’ని కేశప్‌ చెప్పారు. ప్రపంచానికి ప్రయోజనకర శక్తిగా అమెరికా- భారత్‌ భాగస్వామ్యం పనిచేస్తుందన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తానని తెలిపారు. ఇరు దేశాల భాగస్వామ్యం ‘ఆర్థిక వృద్ధి, పేదరికం నిర్మూలనపై’ అమిత ప్రభావం చూపుతుందని, పలు సవాళ్ల పరిష్కారానికీ దోహదం చేస్తుందని చెప్పారు. ఇరు దేశాల ప్రజలకు సహకారం అందించేందుకు అన్ని విధాల ప్రయత్నించే కేంద్రంగా యూఎస్‌ఐబీసీ ఉంటుందని తెలిపారు. ‘ప్రపంచ వాణిజ్య అజెండాను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. భవిష్యత్‌ కోసం ముఖ్యంగా కొవిడ్‌-19 పరిణామాల అనంతరం సంపదను సృష్టించే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉంద’ని పేర్కొన్నారు. అమెరికా- భారత్‌ల మధ్య 500 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యానికి అవకాశం ఉందన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఈ అంకెలు సాధించదగినవేనని, సాధిస్తామన్న నమ్మకమూ ఉందని కేశప్‌ అన్నారు. యూఎస్‌ఐబీసీ కొత్త అధ్యక్షుడిగా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2020-21లో భారత్‌- అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 80.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2019-20లో నమోదైన 88.9 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే తగ్గింది. 2021లో అమెరికాకు భారత్‌ ఎగుమతులు 2021లో 51.62 బిలియన్‌ డాలర్లు కాగా.. అమెరికా నుంచి భారత్‌ దిగుమతులు 28.9 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని